సుడాన్‌లో చిక్కుకున్న 4వేల మంది ఇండియన్స్.. రంగంలోకి ప్రధాని మోడీ!
ఆఫ్రికా దేశం సుడాన్ అల్లర్లతో అట్టడుకుతోంది. సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య జరుగుతోన్న సాయుధ
దిశ, డైనమిక్ బ్యూరో: ఆఫ్రికా దేశం సుడాన్ అల్లర్లతో అట్టడుకుతోంది. సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య జరుగుతోన్న సాయుధ పోరాటంలో వందలమంది పౌరులు, సైనికులు మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. చర్చలకు ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ అవి కొలిక్కి రావడం లేదు. దీంతో అక్కడ చిక్కుకున్న సుమారు 4వేల మంది భారత పౌరుల్లో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అక్కడున్న వారిని అప్రమత్తం చేసింది.
ఈ నేపథ్యంలో భారతీయుల భద్రతపై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో విదేశాంగమంత్రి జైశంకర్, ఎయిర్‌ఫోర్స్, నేవీ అధినేతలతో పాటు విదేశాంగ, రక్షణశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్ దౌత్యవేత్తలు పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరుపై చర్చించారు. నిజానికి దక్షిణాఫ్రికా దేశమైన సూడాన్‌లో గత వారం రోజులుగా అంతర్యుద్ధం జరుగుతోంది. అంతర్యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 270 మంది పౌరులు మృత్యువాత పడగా, 2500 మంది క్షతగాత్రులుగా మారారు.
సుడాన్ అంతర్ ఘర్షణల్లో ఇప్పటికే ఒక భారతీయుడు చనిపోగా తాజాగా 300కి పైగా భారతీయులు అక్కడ చిక్కకుపోయారు. కాగా, ‘సూడాన్‌లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. భారతీయుల రక్షణ, వారి భద్రతపై దృష్టి సారించాం. అక్కడి నుంచి తరలించే సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్నాం’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ తరుణంలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్‌తో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. సాధ్యమైనంత తొందరగా ముందస్తు కాల్పుల విరమణ కోసం దౌత్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.