IIT బాంబే విద్యార్థుల్లో 36% మందికి ఇప్పటికి జాబ్స్ రాలేదు: నివేదిక
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త నియామకాలు చాలా వరకు తగ్గాయి. దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకుని చిన్న సంస్థలు ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో నియామకాల విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి
దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త నియామకాలు చాలా వరకు తగ్గాయి. చిన్న సంస్థల నుంచి మొదలుకుని దిగ్గజ కంపెనీల వరకు ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో నియామకాల విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి. అయితే క్యాంపస్ ప్లేస్‌మెంట్ల పరంగా అగ్రస్థానంలో ఉండే ఐఐటీ బాంబే కూడా ఈ సీజన్‌లో మాంద్యం ప్రభావాన్ని అనుభవిస్తుంది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, ఐఐటీ బాంబే విద్యాలయంలో 2024 సీజన్‌లో ప్లేస్‌మెంట్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్న మొత్తం 2000 మంది విద్యార్థులలో దాదాపు 712 మంది ఇంకా జాబ్‌లు పొందలేదని నివేదిక పేర్కొంది. అంటే మొత్తం విద్యార్థుల్లో 36 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు.
సాధారణంగా దిగ్గజ కంపెనీలు IIT బాంబే విద్యార్థులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఎంపిక చేసుకుని లక్షల్లో ప్యాకేజీని అందిస్తుంటాయి. కంపెనీలు పోటీ పడి మరి జాబ్ ఆఫర్లు అందిస్తాయి. అలాంటిది ఈ సీజన్‌లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. గతంలో ప్లేస్‌మెంట్స్ రాని విద్యార్థులు 35.8 శాతం ఉండగా, ఇప్పుడు అది 2.8 శాతం పెరిగింది. 2023లో, ఐఐటీ బాంబేలో నమోదైన 2,209 మంది విద్యార్థులలో 1,485 మంది ఉద్యోగాలు సాధించగా, 32.8 శాతం మందికి ఉద్యోగాలు దక్కలేదు.
సాధారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ బ్రాంచ్ విద్యార్థులను కంపెనీలు ఎక్కువగా నియమించుకుంటాయి. దీంతో ప్రతి సీజన్‌లో ఈ బ్రాంచ్100 శాతం నియామకాలను నమోదు చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కంపెనీలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఈ బ్రాంచ్ విద్యార్థులు ఈ ఏడాది 100 శాతం ప్లేస్‌మెంట్ సాధించలేకపోయారని IIT బాంబే ప్లేస్‌మెంట్ సెల్ అధికారి పేర్కొన్నారు.