దీదీ సర్కార్ కు షాక్ ఇచ్చిన కలకత్తా హైకోర్టు
పశ్చిమ బెంగాల్‌లోని దీదీ సర్కార్కు షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై సంచలన తీర్పు వెలువరించింది కలకత్తా హైకోర్టు.
నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని దీదీ సర్కార్కు షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై సంచలన తీర్పు వెలువరించింది కలకత్తా హైకోర్టు. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియను రద్దు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ స్కూళ్లల్లో 9, 10, 11, 12వ తరగతుల టీచర్లు గ్రూప్- సి, గ్రూప్- డి స్టాఫ్ నియామకం కోసం 2016లో బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 24,650 ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్ మెంచ్ చేపట్టగా.. 23 లక్షల మంది పరీక్ష రాశారు. అందులో నుంచి 25,753 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.
అయితే, స్కూల్ రిక్రూట్ మెంట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపైన విచారణ కోసం కలకత్తా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేశారు. ఈ స్కాంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. ఆ నియామకాలన్నీ చట్టవిరుద్ధమని తెలిపింది. అంతే కాకుండా, 23, 753 మంది ఉద్యోగాలు రద్దు చేయడమే కాకుండా.. నాలుగు వారాల్లో తీసుకున్న జీతాన్ని తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా తీసుకున్న జీతాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది ఈ వ్యక్తుల దగ్గర నుంచి ఆరు వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా అధికారులను కోర్టు ఆదేశించింది.
అలాగే, దీంతో పాటు జీరో పోస్టులపై కొత్త నియామకాలు ప్రారంభించాలని స్కూల్ సర్వీస్ కమిషన్‌ను కలకత్తా హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది.. ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం చెప్పుకొచ్చింది. రానున్న 15 రోజుల్లో కొత్త నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు అధికార యంత్రాంగానికి తెలిపింది.
టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థా ఛటర్జీ ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలపై విచారణ మార్చి 20నే ముగిశాయి. కానీ, తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది. సోమవారం రిజర్వు తీర్పుని ప్రకటించింది. ఈ కేసులో ఉత్తర్వులపై స్టే విధించాలని అప్పీలుదారులు చేసిన అభ్యర్థనను హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. కతకత్తా హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే.. కోర్టు ప్రాంగణంలో ఉన్న వందలాది మంది నిరుద్యోగులు ఆనందించారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు.