Road accidents: రోడ్డు ప్రమాదాలతో గంటకు 20 మంది మృతి.. కేంద్రం ఆందోళన
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు(Road accidents) పెరిగిపోతున్నాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ(Ministry of Road Transport and Highways) ఆందోళన వ్యక్తం చేసింది.
దేశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు(Road accidents) పెరిగిపోతున్నాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ(Ministry of Road Transport and Highways) ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల కారణంగా గంటకు 20 మంది చనిపోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం గత ఏడాది 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు తెలిపింది. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో 4.2 శాతం మేరకు ప్రమాదాలు పెరిగాయంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi) రహదారులు రక్తమోడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో సగటున గంటకు 55 చొప్పున వాహనాలు ఢీ కొంటున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో జరుగుతున్న ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీలోనే అత్యధికంగా 1,457 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారంది. ఇక, దేశవ్యాప్తంగా రోజుకు 26 మంది చిన్నారులు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోతున్నారు. గతేడాది 9,489 మంది ప్రాణాలు కోల్పోయారు.
నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటంటే?
2023లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,72,890 మంది చనిపోయారు. 4,62,825మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు 2.6 శాతం, గాయాలపాలైన వారు 4.4 శాతం చొప్పున పెరిగారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్() లో 23 వేల మంది, ఆ తర్వాత తమిళనాడులో 18 వేల మంది, మహారాష్ట్రలో 15 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ప్రధాన నగరాల్లో చూస్తే ఢిల్లీలో 1,457 మంది చనిపోగా, తర్వాత స్థానాల్లో 915 మందితో బెంగళూరు (Bengaluru), 879 మందితో జైపూర్ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు(Tamil Nadu) తొలిస్థానంలో ఉంది. అక్కడ 2023లో 67,213 ప్రమాదాలు జరిగాయి. మితిమీరిన వేగం కారణంగా 68.1 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో బైకర్లే దాదాపు సగంమంది ఉన్నారు. మొత్తం మృతుల్లో వీరే 44.8 శాతం మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉండగా.. పురుషులే అధికంగా ఉంటున్నారని నివేదిక వెల్లడించింది. మరోవైపు, ప్రపంచ రహదారుల గణాంకాలు-2020 ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారత్ తొలిస్థానంలో ఉంది.