భారీ వర్షాలకు బీహార్‌లో కూలిన మరో రెండు వంతెనలు

గత 15 రోజుల వ్యవధిలో ఇది ఏడవ సంఘటన కావడం గమనార్హం.

Update: 2024-07-03 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా బీహార్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వంతెన ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో తాజాగా సివాన్ జిల్లాలో బుధవారం మరో రెండు భారీ వర్షాల కారణంగా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. గత 15 రోజుల వ్యవధిలో ఇది ఏడవ సంఘటన కావడం గమనార్హం. దాదాపు 35 ఏళ్ల నాటి ఈ రెండు వంతెనలు జిల్లాలోని డియోరియో బ్లాక్‌లో ఉన్నాయి. ఇవి చుట్టుపక్కల అనేక గ్రామాలను మహరాజ్‌గంజ్‌తో కలుపుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ ఏర్పడి మనుషుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూలిన రెండు వంతెనల్లో ఒకటి 1998లో అప్పటి ఎంపీ ప్రభునాథ్ సింగ్ నిధులతో రూ. 6 లక్షల ఖర్చుతో నిర్మించారు. ఆ తర్వాత మళ్లీ ఎంపీ నిధులతోనే 2004లో మరో వంతెనను నిర్మించారు. నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఆ రెండు వంతెనల మరమ్మతులను ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గండకి నది ఉప్పొంగి వంతెన్ నిర్మాణం బలహీనపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు అంచనా వేశారు. సరిగ్గా 11 రోజుల క్రితం జూన్ 22న సివాన్ జిల్లాలోనే దరౌండా ప్రాంతంలో మరో వంతెన కూడా కూలింది. ఇది కాకుండా ఇటీవలే మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంధ్ జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు బీహార్ ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 


Similar News