Maharashtra Hospital: ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. 24 గంటల వ్యవధిలో 18 మంది మృతి

మహారాష్ట్రలోని థానే ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందడం కలకలం సృష్టించింది.

Update: 2023-08-13 14:35 GMT

థానే : మహారాష్ట్రలోని థానే ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతిచెందడం కలకలం సృష్టించింది. థానేలోని కల్వాలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో కొన్ని గంటల తేడాలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారని థానే మున్సిపల్ కమిషనర్‌ అభిజిత్‌ బంగార్‌ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. మృతుల్లో థానే నగరానికి చెందినవారు ఆరుగురు ఉండగా.. కల్యాణ్‌కు చెందినవారు నలుగురు, షాపూర్‌ నుంచి ముగ్గురు, భీవాండి, ఉల్హాస్‌నగర్‌, గోవండి (ముంబయి) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. వీరిలో 12 మంది 50 ఏళ్లు పైబడినవారని చెప్పారు. ఈ మరణాలపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఆరా తీశారు. దీనిపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.మృతిచెందిన రోగులు కిడ్నీలో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, న్యుమోనియా సమస్యలతో బాధపడ్డారు. మృతులకు ఆస్పత్రిలో అందిన చికిత్సపై దర్యాప్తు జరుపుతామని, చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను రికార్డు చేస్తామని అధికారులు తెలిపారు.


Similar News