నీట్-యూజీ కేసులో 13 మంది అరెస్ట్.. వివరాలు వెల్లడించిన బిహార్ ప్రభుత్వం

నీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన తమ రాష్ట్ర పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారని, వారి నుంచి మొబైల్ ఫోన్‌లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Update: 2024-07-06 15:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన తమ రాష్ట్ర పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారని, వారి నుంచి మొబైల్ ఫోన్‌లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు శనివారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వివిధ సెక్షన్ల కింద మే 5న పాట్నాలోని శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. ‘రాష్ట్ర ఏజెన్సీలు వివరణాత్మకమైన దర్యాప్తును నిర్వహించాయి. అరెస్టు చేసిన వారిలో కొందరు గతంలో ఇలాంటి ఇతర నేరాలకు పాల్పడ్డారు. అక్రమాలకు పాల్పడినట్లు అంగీకరించిన నలుగురు అభ్యర్థులను కూడా అదుపులోకి తీసుకున్నాం’ అని వెల్లడించింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మే 20న ఎనిమిది మంది సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి బదిలీ చేసిన తర్వాత, రాష్ట్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న కేసును కేంద్ర ఏజెన్సీ తక్షణమే చేపట్టి జూన్ 24న కేసు రికార్డులను అందజేసిందని పేర్కొంది.


Similar News