Delhi shelter home: ఢిల్లీ ప్రభుత్వ వసతి గృహంలో మిస్టరీ డెత్స్

ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వ వసతి గృహంలో (Delhi shelter home) మిస్టరీ డెత్స్ బయటపడ్డాయి.

Update: 2024-08-02 10:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వ వసతి గృహంలో (Delhi shelter home) మిస్టరీ డెత్స్ బయటపడ్డాయి. రోహిణి ప్రాంతంలోని దివ్యాంగ పిల్లల ఆశాకిరణ్ వసతి గృహంలో గత 20 రోజుల్లో 13 మంది చిన్నారులు మరణించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మంది చిన్నారులు చనిపోయారు. దివ్యాంగ పిల్లలే చనిపోవడం గమనార్హం. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ విచారణలో ఈ సంచలనాలు బయటపడ్డాయి. గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్య అధికంగా ఉందని మేజిస్ట్రేట్ తెలిపింది. పోస్టుమార్టం నివేదికల తర్వాత నిజమేంటో తెలుస్తుందంది. కాగా.. షెల్టర్ హోం నిర్వహణపై విమర్శలు వెల్లుత్తుతున్నాయి.

జాతీయ మహిళా కమిషన్ ఆందోళన

ఆశాకిరణ్ షెల్టర్‌ హోమ్‌ నిర్వహణపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నిజనిర్ధారణ బృందాన్ని ఆ షెల్టర్ హోమ్‌కు పంపింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎన్సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ ఆశను కోల్పోయిందని విమర్శించారు. మిస్టరీ మరణాలపై విచారణ కోసం ఒక బృందాన్ని అక్కడకు పంపినట్లు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్సీడబ్ల్యూ విచారణ జరుపుతుందని తెలిపారు.

ఢిల్లీ మంత్రి స్పందన ఇదే..

ప్రభుత్వ వసతి గృహంలో పిల్లలు చనిపోవడంపై ఢిల్లీ ప్రభుత్వం లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఢిల్లీ మంత్రి అతిషి మృతుల సంఖ్యను వేరుగా తెలిపారు. 2024 జనవరి నుంచి ఈ షెల్టర్ హోమ్‌లో 14 మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపారు. మెజిస్ట్రీయల్ విచారణ చేపట్టాలని.. 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖని కోరారు. ఆప్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. హోంని సందర్శించి అక్కడి పిల్లలకు ఆహారం అందట్లేదని.. మురికి నీరు సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. వైద్యసదుపాయాలు కూడా లేవని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.


Similar News