మోడీకి మరో ఘనత.. ఐక్యరాజ్యసమితిలో "మన్‌కీ బాత్" లైవ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "మన్ కీ బాత్" కార్యక్రమం మరో ఘనతను సాధించనుంది. ఏప్రిల్ 30న (ఆదివారం) జరగనున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "మన్ కీ బాత్" కార్యక్రమం మరో ఘనతను సాధించనుంది. ఏప్రిల్ 30న (ఆదివారం) జరగనున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 1.30 గంటలకు) ట్రస్టీ షిప్ కౌన్సిల్ ఛాంబర్ లో ఈ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ కానుంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులను, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సిబ్బందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.
"ఒక చారిత్రాత్మక క్షణానికి సిద్ధంగా ఉండండి. ప్రధాని మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ అపూర్వమైనది. " అంటూ ట్వీట్ చేసింది. "మన్ కీ బాత్ నెలవారీ జాతీయ సంప్రదాయంగా మారింది. భారతదేశం యొక్క అభివృద్ధి ప్రయాణంలో పాల్గొనడానికి మిలియన్ల కొద్దీ ప్రజలకు ఈ కార్యక్రమం స్ఫూర్తిని ఇస్తోంది " అని పేర్కొంది.ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగం తొలిసారి 2014 అక్టోబర్ 3న ప్రసారమైంది.ఈ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో, డీడీ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతోంది. 30 నిమిషాల నిడివిగల ఈ కార్యక్రమంలో 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మన్ కీ బాత్ ప్రోగ్రాంకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు.