బిపర్జాయ్‌ బీభత్సం..1000 గ్రామాల్లో అంధకారం

బిపర్జాయ్‌ తుఫాను ధాటికి గుజరాత్‌ రాష్ట్రంలోని దాదాపు 1,000 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.

Update: 2023-06-16 12:49 GMT

జఖౌ (గుజరాత్‌) : బిపర్జాయ్‌ తుఫాను ధాటికి గుజరాత్‌ రాష్ట్రంలోని దాదాపు 1,000 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. 10 రోజుల పాటు అరేబియా సముద్రంలో కొనసాగిన ఈ తుఫాను.. గురువారం సాయంత్రం గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటింది. అనంతరం కొన్ని గంటల తర్వాత తుఫాను బలహీన పడింది. అయితే భారీ వర్షాల రూపంలో అది గుజరాత్‌లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. భావ్‌నగర్ జిల్లాలో పశువుల కాపరితోపాటు అతని కుమారుడు.. వర్షంలో చిక్కుకున్న పశువులను కాపాడబోయి మృత్యువాత పడ్డారు. గుజరాత్ వ్యాప్తంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వృక్షాలు వేళ్లతో సహా నేలకు ఒరిగాయి. దాదాపు 524 చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరగడంతో వెయ్యి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

బిపర్జాయ్‌ బీభత్సం..1000 గ్రామాల్లో అంధకారంసముద్రంలో చేపల వేటకు వెళ్లడంపై శనివారం వరకు నిషేధం విధించారు. పోర్టులను మూసివేసి.. పడవలకు లంగరు వేశారు. ఈ తుఫాను గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. శుక్ర, శనివారాల్లో రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు శుక్రవారం ఫోన్ చేసి ఆరా తీశారు. తుఫాను తీరం దాటిన తర్వాత నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. గిర్ అడవుల్లోని క్రూర మృగాలు, సింహాల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి గుజరాత్ సీఎంను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు.


Similar News