లక్ష మందితో ఏకకాలంలో భగవద్గీత పఠనం
ఏకంగా లక్ష మంది ప్రజలు ఒకచోట హాజరై భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ‘లోఖో కొంథే గీతాపథ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిలిచింది.
కోల్‌కతా : ఏకంగా లక్ష మంది ప్రజలు ఒకచోట హాజరై భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ‘లోఖో కొంథే గీతాపథ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ కీలక నాయకులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 1.20 లక్షల మందికి పైగా ఈ ప్రోగ్రాం సందర్భంగా భగవద్గీత శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు, పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అర్ధవంతమైన మానవ జీవితానికి మార్గదర్శనం చేసే మహత్తు భగవద్గీతకు ఉందన్నారు. ‘‘భగవద్గీత ప్రపంచానికి అతిపెద్ద కానుక. ఈ కార్యక్రమాన్ని హేళన చేసిన వారికి హిందూ ధర్మం పట్ల గౌరవం లేదని అర్థం. హిందువులను విభజించడంలో వాళ్లు విఫలం అవుతున్నారు’’ అంటూ పరోక్షంగా టీఎంసీపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ విమర్శలు గుప్పించారు.
‘‘ఈ కార్యక్రమం రాష్ట్రంలో హిందువులను ఐక్యం చేస్తుంది. భగవద్గీత పఠించడమే కాకుండా, హిందువులను ఐక్యం చేయడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహించాం’’ అని ప్రతిపక్ష నేత సువేందు అధికారి చెప్పారు. ఈ కార్యక్రమంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. గీతా పారాయణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ నేతలు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, మతాన్ని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. టీఎంసీ మంత్రి ఉదయన్ గుహా మాట్లాడుతూ.. గీతాపారాయణ కార్యక్రమం బదులుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ని నిర్వహించొచ్చని, బెంగాల్ ప్రజలు ఇలాంటి వాటిని పట్టించుకోరని వివాదాస్పద వ్యాఖ్య చేశారు.