బసవతారకంపై నీతి ఆయోగ్ ప్రశంసలు.. బాలకృష్ణ ఏమన్నారంటే..!

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, సత్యసాయి ఆస్పత్రులపై నీతిఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ఈ ఆస్పత్రులకు ఇచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. లాభాపేక్ష లేకుండా సేవ చేస్తుండటంతో వీటికి ఇకపై వందశాతం పన్నుమినహాయింపు ఇవ్వాలని నీతిఆయోగ్ కేంద్రాన్ని కోరింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల పేదల క్యాన్సర్ చికిత్స కేంద్రంగా బసవతారకం ఆస్పత్రిని చెప్తూ ఉంటారు. బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రి గురించి తెలుగు రాష్ట్రాల్లో […]

Update: 2021-06-30 06:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, సత్యసాయి ఆస్పత్రులపై నీతిఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ఈ ఆస్పత్రులకు ఇచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. లాభాపేక్ష లేకుండా సేవ చేస్తుండటంతో వీటికి ఇకపై వందశాతం పన్నుమినహాయింపు ఇవ్వాలని నీతిఆయోగ్ కేంద్రాన్ని కోరింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల పేదల క్యాన్సర్ చికిత్స కేంద్రంగా బసవతారకం ఆస్పత్రిని చెప్తూ ఉంటారు.

బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రి గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. క్యాన్సర్ అంటే ప్రమాదకరమైన జబ్బు. దానికి వైద్యం చేయించాలంటే పేదలకు చాలా కష్టం. దివంగత సీఎం ఎన్టీఆర్ తన సతీమణి క్యాన్సర్‌తో చనిపోయారు. క్యాన్సర్ బారినపడిన భార్యకు సరైన చికిత్స చేయించలేకపోయామేనని ఎన్టీఆర్ ఆవేదన చెందారు. నాటి పరిస్థితులను మార్చాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ బసవతారకం ఆస్పత్రిని లాభాపేక్ష లేకుండా నిర్మించారు. చివరకు 2000లో బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పేదలకు క్యాన్సర్ వైద్యంలో నమ్మకమైన ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రికి చైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిని 500 పడకలకు విస్తరించారు. తెల్లకార్డు ఉన్న పేదలకు దాదాపుగా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇతరులకు కూడా చాలా తక్కువ మొత్తంతో క్యాన్సర్ వైద్యం అందిస్తారు.

వ్యాధి వచ్చిన వారికే కాకుండా.. క్యాన్సర్ రాకుండా అవగాహన చేపట్టడం.. పేదల ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం వంటివి ఈ మెమోరియల్ ఆస్పత్రి చేస్తోంది. మరోవైపు ప్రభుత్వాసుపత్రులకు మించి ఉచిత సేవలందించే ఆస్పత్రులలో సత్యసాయి ఆస్పత్రి ఒకటి. ఇది అనంతపురంలో ఉంది. ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యం అందిస్తుంటారు. ప్రతి నెలా అనంతపురం జిల్లాలోని 12 నోడల్‌పాయింట్లలో మొబైల్‌ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 400 గ్రామాల ప్రజలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. కరోనా సమయంలోనూ అద్భుతమైన సేవలను సత్యసాయి ఆస్పత్రి అందించింది. వాటిని నిర్వహించడానికి ఇచ్చే విరాళాలకు పన్ను వద్దని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ ఆస్పత్రులకు లాభాపేక్ష లేదు. ఏదైనా విరాళమో.. ఆదాయమో వస్తే.. ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తారు. ఇప్పటి వరకూ వీటికి వచ్చే విరాళాల్లో యాభై శాతం పన్ను మినహాయింపు ఉంది. ఇక నుంచి వంద శాతంఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. నీతిఅయోగ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు ఆస్పత్రుల గురించి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇలాంటి స్వచ్చమైనసేవ చేసే ఆస్పత్రుల గురించి కూడా చెప్పింది.

ఆ ఘనత దివంగత ఎన్టీఆర్‌కే దక్కుతుంది : బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‎స్టిట్యూట్‌తో పాటు పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రులపై నీతిఆయోగ్ ప్రశంసలపై బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ స్పందించారు. దేశ అత్యున్నత ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత అంతా తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావుకే చెందుతుందన్నారు. పేదలకు సముచిత ధరలో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్స అందాలన్న తన తండ్రి దార్శనికత వల్లే నేడు ఈ గుర్తింపు లభించిందని చెప్పుకొచ్చారు. ట్రస్టు సభ్యులు, పెద్ద మనసు చూపుతున్న దాతలు, యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది తన తండ్రి ఆశయాన్ని నిజం చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News