ప్రశాంతంగా ముగిసిన సాగర్ ఉపఎన్నిక పోలింగ్
దిశ, హాలియా: సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఒకటి, రెండు చోట్ల చెదురు మదురు సంఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా ముగిసింది. 2018 సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 86.82% శాతం నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 88 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసినా.. తుది పోలింగ్ శాతం ఎంత అనేది అధికారికంగా వెల్లడించనున్నారు. కొంతకాలం పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడంతో సాగర్ […]
దిశ, హాలియా: సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఒకటి, రెండు చోట్ల చెదురు మదురు సంఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా ముగిసింది. 2018 సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 86.82% శాతం నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 88 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసినా.. తుది పోలింగ్ శాతం ఎంత అనేది అధికారికంగా వెల్లడించనున్నారు. కొంతకాలం పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడంతో సాగర్ ఉపఎన్నిక అనివార్యమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోత్ రవి కుమార్ నాయక్, టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్ కుమార్‌లతో కలిసి మొత్తం 41మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఎక్కువమంది పోటీకి దిగడంతో 3 బ్యాలెట్ యూనిట్‌లు, ఒక వీవీ ప్యాడ్, ఒక కంట్రోల్ యూనిట్‌లను ప్రతి పోలింగ్ బూతులో అధికారులు వినియోగించారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇదే సమయంలో త్రిపురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బూత్ నెంబర్ 265, గుర్రంపూడ్ మండల పరిధిలో వట్టి కోడ్ 13వ బూత్, సాగర్‌లో 107వ బూత్‌లల్లో ఈవీఎంలు మొరాయించి 30 నిమిషాలకు పైగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. హాలియా మున్సిపాలిటీలోని ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ప్రధాన పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఆలస్యంగా రావడంతో ఇక్కడ కూడా కాస్తా ఆలస్యమైంది.
అయినప్పటికీ.. ఓటు వేయడానికి జనాలు ఉదయం నుంచే బారులు తీరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో టెంట్ల కింద సేదతీరుతూ ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చివరి గంటలో కొవిడ్ పేషెంట్ల కొరకు పీపీఈ కిట్లను ఇచ్చి ఓటేసేందుకు అవకాశమిచ్చారు.
సాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు, అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రంపూడ్, తిరుమలగిరి( సాగర్), మాడుగుల పల్లి మొత్తం ఎడు మండలాలు, నందికొండ, హాలియా 2 మున్సిపాల్టీలతో కలిసి 2,20,300 ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 346 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు. అన్ని కేంద్రాల్లో పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను నల్గొండలోని ఆర్జలాబావి వద్ద ఉన్న గోదాంలో భద్రపరుస్తున్నారు. మే 2 వరకు గోదాముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ఉంటుంది.