సవాల్‌గా మారిన సాగర్ సమరం
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కొత్త సవాళ్లను ముందుకు తీసుకువస్తోంది. అన్ని పార్టీలకు సంకటంగా మార్చుతోంది. ఇప్పటికే పార్టీలన్నీ అంతర్గత సర్వేలు పూర్తి చేశాయి. ఒక్కోపార్టీ రెండుసార్లు సర్వే చేయించుకుంది. సర్వేలన్నీ అధికార పార్టీకి దారుణ పరిస్థితులనే చూపిస్తున్నాయి. దీంతో అనధికారిక ఒప్పందానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. జానారెడ్డి ఇప్పటివరకు తానే పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చినా, తీరా సమయానికి కొడుకును ముందు పెడుతున్నారు. నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దిశ, తెలంగాణ బ్యూరో : […]
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కొత్త సవాళ్లను ముందుకు తీసుకువస్తోంది. అన్ని పార్టీలకు సంకటంగా మార్చుతోంది. ఇప్పటికే పార్టీలన్నీ అంతర్గత సర్వేలు పూర్తి చేశాయి. ఒక్కోపార్టీ రెండుసార్లు సర్వే చేయించుకుంది. సర్వేలన్నీ అధికార పార్టీకి దారుణ పరిస్థితులనే చూపిస్తున్నాయి. దీంతో అనధికారిక ఒప్పందానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. జానారెడ్డి ఇప్పటివరకు తానే పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చినా, తీరా సమయానికి కొడుకును ముందు పెడుతున్నారు. నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల నర్సింహయ్య 2018లో విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేశారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉంది. జానారెడ్డి మరోసారి బరిలోకి దిగుతానని ప్రకటించినా పరిణామాలు మారుతున్నాయి. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉంటున్నవారు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరుతున్నారు. దీంతో జానారెడ్డి రూటు మార్చారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తన తర్వాత ఉన్న ఒకరిద్దరు సీనియర్ నాయకులు పోటీలో నిలబడితే తనకు అభ్యంతరం లేదని, ఆ పిదప అన్ని అర్హతలు కలిగిన తన కుమారుడు రఘువీర్‌రెడ్డిని అందరూ ఆమోదిస్తే పోటీకి దింపుతానని ప్రకటించారు. అధిష్టానానికి సైతం లేఖ పంపించారని పార్టీ నేతలు చెబుతున్నారు.
రంగంలోకి అధినేత
వరుస పరిణామాలు గులాబీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ ఒక్క సీటుతో వచ్చేది పోయేది ఏమీలేకున్నా రాజకీయంగా తీవ్ర నష్టం తప్పదని భావిస్తోంది. ఇప్పటికే నైతికంగా టీఆర్ఎస్ శ్రేణులు డీలాపడి ఉన్నాయి. ప్రజలు సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని దుబ్బాకలో తేలిపోయింది. కుటుంబ సెంటిమెంటు పని చేయలేదు. నోముల కుటుంబ సభ్యులను పోటీకి పెడితే ఎలా ఉంటుందో అనే మీమాంసలో పడిపోయారు. రెడ్డీలు బీసీ నేతలకు సహాకరించరని తేలిపోయింది.
నర్సింహయ్య కుటుంబానికి అన్యాయం చేస్తే యాదవ సామాజికవర్గం దెబ్బతీస్తుందేమోననే భయం కూడా పట్టుకుంది. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాల తర్వాత సాగర్‌లోనూ పరాజయం పాలైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభావం చూపిస్తుందని భయపడుతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ సభను భారీగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఈ నెల పదిన హాలియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉంది. దీనికంటే ముందుగానే కేసీఆర్ బహిరంగ సభ హాలియాలో తలపెట్టారు. గ్రాడ్యుయేట్, సాగర్ సిట్టింగ్ స్థానాలు జారిపోకుండా ఉండాలంటే తానే స్వయంగా రంగంలోకి దిగాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కు 34… బీజేపీకి 31
సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ రెండుసార్లు అంతర్గత సర్వేను పూర్తి చేసింది. ఈ రెండుసార్లూ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలే లేనట్టు తేలిందని సమాచారం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సర్వే బృందాలు ఇక్కడ ఓటర్లను కదలించాయి. ఎవరు పోటీ చేసినా మూడో స్థానానికే పరిమితమవుతారని వెల్లడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు, అభ్యర్థులను బట్టి కాంగ్రెస్‌కు 34 శాతం, బీజేపీకి 31 శాతం ఉండగా… మూడోస్థానంలో టీఆర్ఎస్ ఉంటున్నట్లు తేలింది. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుందామా, నామమాత్రంగా ఉందామా అనే కోణంలో కూడా అలోచిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
త్రిముఖ పోటీకి మారిన రాజకీయం
2018 అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ దూకుడుమీదే ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఒకప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న పోటీ ఇప్పుడు మూడు పార్టీల మధ్య తిరుగుతోంది. కాంగ్రెస్‌ను చేజేతులారా చంపేసిన టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి లాభం చేసింది. అదే ఇప్పుడు మేకులా మారిందనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. వాస్తవంగా ఇక్కడ గెలుస్తామనే ధీమా ఏ పార్టీలోనూ స్పష్టంగా కనిపించడం లేదు. పరువు కాపాడుకోవడమెలా అనే కోణంలోనే పార్టీలన్నీ ఆలోచిస్తున్నాయి. బీజేపీకి సైతం చెమటలు పడుతున్నాయి. ఇక్కడ ఓడిపోతే ఇటీవల సాధించిన విజయాలన్నీ సాగర్ లో కలిసిపోతాయేమోనన్నదే బీజేపీకి భయంగా మారింది. అధికార పార్టీకి సిట్టింగ్ స్థానమే అయినా 2018 నాటి ఏకపక్ష రాజకీయ సానుకూలత ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ తరఫున బరిలోకి దిగే బలమైన అభ్యర్థి కూడా కనిపించడం లేదు.
జానారెడ్డి లోకల్
సాగర్ సెగ్మెంట్ ఒకప్పుడు జానారెడ్డి స్థానమే. ఇప్పుడు పార్టీ బలహీనపడింది. ఒకవర్గం కాంగ్రెస్‌కు దూరమైంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలువాల్సిన కాంగ్రెస్ చేజేతులారా ఉనికిని కోల్పోతోంది. ఉమ్మడి నల్టొండ జిల్లా పార్టీకి బలంగా ఉండేదని భావించేవారు. అగ్రనాయకులుగా ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి వంటి నేతలు ఇక్కడివారే. అంతర్గత విభేదాలతో వారిలో వారే చులకనవుతున్నారనేది పార్టీలో జరుగుతున్న చర్చ. జానారెడ్డి సాగర్‌కే పరిమితమయ్యారు. తన ఇద్దరు కుమారులు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేశారు. నిడమనూరు మండలం ఆభంగపురం నుంచి ప్రచారం ప్రారంభించడం జానారెడ్డికి ఆనవాయితీ. ఇప్పుడు కూడా రఘువీర్‌తో వారం రోజుల క్రితమే అక్కడి నుండి కార్యక్రమాలు మొదలు పెట్టారు. కార్యకర్తలకు రఘువీర్ పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చారు.
బీజేపీకి బీసీ ఆశలు
ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికను బీజేపీ 2023 ఎన్నికల ట్రయల్‌గానే భావిస్తోంది. సాగర్ ఉప ఎన్నిక షాక్లాగే ఉండనున్నట్లు భావిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ ఎంసీ తరహాలో ఉండదని బీజేపీ సర్వేలో తేలిందని అంటున్నారు. అనుకున్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటే మాత్రం బీజేపీకే ఎక్కువ నష్టమని భావిస్తున్నారు. దీనికోసమే ఇక్కడ బీసీ నినాదాన్ని పార్టీ తీసుకుంది. తరుపున గతంలో పోటీ చేసిన నివేదితారెడ్డితో పాటు పలువురు టికెట్ అడుగుతున్నా… బీజేపీ మాత్రం బీసీ అభ్యర్థి అంజయ్య యాదవ్ వైపే దృష్టి పెట్టింది. ఇక్కడ గెలిస్తే ఇక రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను బలంగా చూపించుకుంటామని కాషాయదళం నమ్మకం పెట్టుకుంది.