The Birthday Boy: రియల్ స్టోరీతో వచ్చి ఆకట్టుకుంటున్న మూవీ
న్యూ కాన్సెప్ట్‌లతో రూపొందే సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది.
దిశ, సినిమా: న్యూ కాన్సెప్ట్‌లతో రూపొందే సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. నటీ నటులు అయినా కొత్త దర్శకుడైనా సరే కథలో కొత్త దనం ఉండాలి. ఆ విధంగా కొత్త నటీనటులతో.. చాలా వినూత్న ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమానే ‘ది బర్త్ డే బాయ్’. కొత్త ఆలోచనలో వీరు చేసిన మూవీకి వీళ్ల వినూత్న పబ్లిసిటితో మంచి బజ్ క్రియేట్ చేయగలిగారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ: బాలు (విక్రాంత్), అర్జున్ (మణి), వెంకట్ (రాజా అశోక్) సాయి (రాహుల్), సత్తి (అరుణ్) ఒకే గ్రామానికి చెందిన ఈ ఐదుగురు ఫ్రెండ్స్ ఎం.ఎస్ చదవడానికి అమెరికా వెళతారు. అక్కడ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అయితే అందులో ఒక రోజు బాలు బర్త్‌డే సందర్భంగా అందరూ గ్రాండ్‌గా పార్టీ చేసుకుంటారు. మద్యపానం సేవించిన ఆ స్నేహితులు బర్త్‌డ్ బాయ్ బాలుపై బర్త్‌డే బంప్స్ పేరుతో రకరకాల చేష్టలకు పాల్పడతారు. బాలుకు బర్త్‌డే బంప్స్ ఇస్తున్న సమయంలో అతనిని అందరూ పట్టుకుని విసిరేయడంతో బాలు కిందపడి చనిపోతాడు. దీంతో అందరికి భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అందులో ఓ స్నేహితుడికి అన్నయ్య అయినా భరత్ (రవికృష్ణ)ను పిలిపించి ఆయన సహాయం కోరతారు. ఈలోపు ఆ రూమ్‌కు మరో స్నేహితుడైన ప్రవీణ్ (సమీర్ మళ్ల) కూడా వస్తాడు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలి అని మదనపడుతున్న వారు బాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెబుతారు. చివరకు బాలు తల్లిదండ్రులను కన్వీన్స్ చేసి అమెరికా రప్పిస్తారు. కాగా బాలు శవంలో వచ్చిన మార్పులను గమనించిన సమీర్ బాలుది యాక్సిడెంట్ కాదు మర్డర్‌గా అనుమానిస్తాడు? ఇక అసలు కథ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అసలు బాలు ఎలా మరణించాడు? ఒకవేళ బాలుది హత్య అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారు? చివరకు ఈ సమస్య నుంచి స్నేహితులు ఎలా బయటపడ్డారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: ఈ చిత్రం దర్శకుడు విస్కీ తన జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో బర్త్ డే పార్టీలు అంటూ పిల్లలు చేసే వికృత చేష్టలకు హద్దు అదుపు లేకుండా పోయింది. శృతిమించుతున్న వాళ్ళ పనులకు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవారే. ఇలాంటి ఇష్యూ.. దర్శకుడు జీవితంలో జరగడం.. అది తెరపైకి తీసుకురావాలనే ఆలోచన చేయడం మెచ్చుకోదగ్గ విషయం.
ఆ సంఘటన ఆధారంగానే ది బర్త్ డే బాయ్ సినిమాను తీశారు. జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ కి కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు విస్కీ ఈ చిత్రాన్ని చాలా బాగా రూపొందించారు. సినిమా ప్రారంభంలో సరదా, సరదాగానే సాగుతుంది.. ఎప్పుడైతే వాళ్ల మిత్రుడు బాలు మరణించిన తరువాత అసలు కథ మొదలవుతుంది. అయితే చిత్రంలోని ప్రతి సన్నివేశం చాలా సహజసిద్దంగా తీర్చిదిద్దారు చిత్ర దర్శకుడు. ఈ మూవీ సెట్స్‌లో అన్నీ కూడా నిజంగా అమెరికాలో కథ జరుగుతున్నట్లుగా అత్యంత సహజంగా అనిపించాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు లాజిక్ మిస్ అయినా.. లెంగ్త్‌గా అనిపించినా ఓవరల్‌గా సెకండాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ఆడియన్స్ థ్రిల్ల్‌గా ఫీలవుతారు.
నటీనటుల ఫైర్ పర్ఫామెన్స్: రాజీవ్ కనకాల గురించి చెప్పనవసరం లేదు. తన నటన చాలా సహజంగానే ఉంటుంది. రవి కృష్ణ తన పాత్రలో నటనను అదరగొట్టాడు . ఇక అందరూ కొత్త నటీ నటులు అయినా అందరూ చాలా బాగా తమ తమ పాత్రల్లో చాలా సహజంగా నటించారు. ప్రతి పాత్ర సినిమాలో బిహేవ్ చేసినట్టుగా అనిపించింది తప్ప నటించినట్లుగా లేదు. అందరి దగ్గర నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.
సాంకేతిక అంశాలు: చిన్న బడ్జెట్ అయినా చిత్రం చాలా మంచి క్వాలిటీతో విడుదల చేశారు . ఫోటోగ్రఫీ, లైటింగ్ అంతా కథ మూడ్‌కు తగ్గట్టుగానే ఉంది. దర్శకుడు సినిమా మొత్తాన్ని రియల్ గా జరుగుతున్నట్టుగానే చిత్రీకరించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిత్రం కథ అంతా అమెరికాలో జరుగుతున్నట్లు గానే ఉన్న ఆర్ట్స్ దర్శకుని పనితీరు అందరినీ ఆకర్షిస్తోంది. సింక్ సౌండ్ వాడటం.. లైవ్ ఆడియో రికార్డింగ్ అనేది సినిమాకు చాలా నేచురాలిటి తెచ్చిపెట్టింది. ఇందులోని ఎమోషన్ క్యారీ అవ్వడంలో ఈ అంశం బాగా తోడ్పడింది. చిన్న సినిమా అయినా సాంకేతిక నిపుణుల కష్టం, పనితీరు కనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు విస్కీకి మొదటి సినిమా అయినా చాలా చక్కగా రూపొందించారు .ఆయన పనితీరు మెచ్చుకోదగ్గ విషయం.
చివరగా: నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకుని దానికి కొన్ని ఎలిమెంట్స్..ఎమోషన్స్.. జోడించి అందరి ముందుకు తీసుకొచ్చిన వినూత్న కథ ది బర్త్ డే బాయ్. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. సరికొత్త థ్రిల్లర్‌గా అందరిని ఆకట్టుకుంటుంది. మంచి కాన్సెప్ట్‌తో, ఓ సందేశంతో రూపొందిన ఈ చిత్రం ఈ వీకెండ్ హ్యపీగా ఫ్యామిలీతో చూడొచ్చు.
రేటింగ్ 2.75/5