ఈ సినిమా నీకంటే నేను చేసుంటే బాగా హిట్ అయ్యేది.. చిరంజీవికే కౌంటర్ ఇచ్చిన మరో హీరో (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఈరోజు మెగా ఫ్యామిలీకి బ్యాగ్రౌండ్‌గా నిలిచాడు చిరంజీవి. చిరంజీవి నటనకు, డ్యాన్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోనే ఓ స్టార్ ఫ్యామిలీగా దూసుకుపోతున్నారు మెగా ఫ్యామిలీ. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆయన యువ హీరోలతో పోటిగా సినిమాలు చేస్తూ.. అప్పటి క్రేజ్‌ను ఇంకా డబల్ చేస్తున్నారు. అలాంటి చిరంజీవిని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరోస్టార్ హీరో.. ఈ సినిమా నువ్వు కాకుండా నేను చేసుంటే సూపర్ హిట్ అయ్యేది అని అందరి ముందు అన్నారట. ఈ విషయాన్ని నేరుగా చిరంజీవినే మీడియా ముందు చెప్పారు. ఆ విషయాల్లోకి వెళితే..
చిరంజీవి మూవీ కెరీర్‌లో ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన సినిమాల్లో ‘డాడీ’ ఒకటి. డైరెక్టర్ సురేష్ క్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు తండ్రి పాత్రలో కనిపించారు. అప్పటివరకు మాస్ అండ్ స్టైలీష్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఆయన.. ఒక్కసారిగా ఎమోషనల్ కంటెంతో రావడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేక పోయారు.
అయితే ఈ మూవీ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరు మాట్లాడుతూ.. ‘డాడీ సినిమా తనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. కానీ ముందుగా కథ తనకు చెప్పినప్పుడు ఈ స్టోరీ వెంకటేశ్ లాంటి హీరోకైతే ఇంకా బాగుంటుందని రచయిత భూపతి రాజాకు చెప్పాను. కానీ ఆయన మీకైతే కాస్త వెరైటీగా ఉంటుందని.. పైగా ఇందులో చిన్న పాప కూడా ఉండడంతో క్యూట్ ఫ్యామిలీ స్టోరీ అవుతుందని నన్ను ఒప్పించారు. ఇక ‘డాడీ’ సినిమా విడుదల తర్వాత వెంకటేశ్ తనకు ఫోన్ చేసి.. మాటల సందర్భంలో డాడీ బాగా చేశాను కదా అంటే.. లేదండీ మీ పైన కాబట్టి యావరేజ్‌గా ఆడింది. అదే ఆ సినిమా నేను చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అన్నాడు వెంకీ. ఆయన మాటల్లో నిజాయితీ, నిష్పక్షపాతం తనకు చాలా నచ్చింది’ అని చెప్పుకొచ్చాడు చిరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.