JEE Advanced- 2024 ఫలితాలు వచ్చేశాయ్.. ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల

దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి.

Update: 2024-06-09 06:37 GMT

దిశ, ఫీచర్స్: దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

జూన్ 9న ఉదయం 10 గంటలకు ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ రోల్ నెంబరు, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్షకు హాజరైన వారిలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దాదాపు 40 వేల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ను రెండు సెషన్లు కలిపి 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్ కు అర్హత కల్పిస్తారు. మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

జూన్ 10 నుంచి JoSAA కౌన్సిలింగ్:

ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీ లతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా (JoSAA) పేరిట సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా జూన్ 10 నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. జులై

23 వరకు 44 రోజుల పాటు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుతో పాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈసారి జాయింట్ సిట్ అలకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య గత ఏడాది 114 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది.


Similar News