అధికసాగు.. సం‘పత్తి'నిస్తుందా?
దిశ, న్యూస్‌బ్యూరో: సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయదలచిన తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టిందా? పండించిన పంటను ఎక్కడ అమ్మాలి? గిట్టుబాటు ధర సాధ్యమేనా? ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలన్న నిబంధనలతో రైతులకు ఎంతో మేలు కలగనుంది. కానీ అదే స్థాయిలో గిట్టుబాటు ధర లభించకపోయినా, వర్షాభావ, అధిక వర్షాలతో పంట నష్టం వాటిల్లినా ప్రభుత్వమే జవాబుదారీగా మారనుంది. అధికారుల సూచనల మేరకే సాగుబడిని ఎంచుకోవడం ద్వారా రైతులకు ప్రశ్నించే అధికారాన్ని అప్పగించినట్లే! సాగునీటి […]
దిశ, న్యూస్‌బ్యూరో: సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయదలచిన తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టిందా? పండించిన పంటను ఎక్కడ అమ్మాలి? గిట్టుబాటు ధర సాధ్యమేనా? ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలన్న నిబంధనలతో రైతులకు ఎంతో మేలు కలగనుంది. కానీ అదే స్థాయిలో గిట్టుబాటు ధర లభించకపోయినా, వర్షాభావ, అధిక వర్షాలతో పంట నష్టం వాటిల్లినా ప్రభుత్వమే జవాబుదారీగా మారనుంది. అధికారుల సూచనల మేరకే సాగుబడిని ఎంచుకోవడం ద్వారా రైతులకు ప్రశ్నించే అధికారాన్ని అప్పగించినట్లే! సాగునీటి కింద పత్తిని సాగు చేస్తే దిగుబడి అధికమే. నాణ్యమైన పంట సాధ్యమే. కానీ పత్తికి ఏ మేరకు డిమాండ్ ఉంది? కొనుగోలుకు సీసీఐ అనుకూలమేనా? రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన రైతుల్లో ఉంది. పత్తికి ధర పలుకుతుండడంతో ఎలాగూ ఈ ఏడు 10 శాతం పత్తి సాగు పెరిగేది. కానీ విస్తీర్ణాన్ని పెంచాలన్న యోచనతో ప్రభుత్వమే జవాబుదారిగా మారింది. దిగుబడి పెరిగి గిట్టుబాటు లభించకపోయినా, పంట నష్టం వాటిల్లినా ప్రభుత్వాన్ని రైతాంగమంతా ప్రశ్నించేందుకు అవకాశం ఇచ్చినట్టయిందని షాద్‌నగర్‌కు చెందిన ఓ పెద్ద రైతు అభిప్రాయపడ్డారు. గుజరాత్ విధానాలను ఇక్కడెందుకు అమలు చేయలేదు? తెలంగాణ టెక్స్‌టైల్ పాలసీ విధి విధానాలను ఎందుకు రూపొందించలేదన్న సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేస్తే భవిష్యత్తులో తలెత్తనున్న సమస్యలకు ఇప్పుడే పరిష్కారాలను వెతకాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యాన్ని పెంచడం వల్ల ఏమైనా పరిష్కారం లభిస్తుందో అధ్యయనం చేయాలి. ప్రైవేటు రంగంలోని డిమాండ్‌ను గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆర్థిక మాంధ్యంలో కొట్టుమిట్టాడుతున్న టెక్స్‌టైల్ రంగం ద్వారా తెలంగాణ రైతాంగానికి ఎంత ప్రయోజనం చేకూరుతుందో లెక్కలు తీయాలి.
మార్కెటింగ్ ఏది?
దేశంలో కోటి బేల్స్ పత్తి దిగుబడి సామర్థ్యం ఉంది. ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర దిగుబడిలో 35 శాతం వరకు ప్రభుత్వ రంగ సంస్థలే కొనుగోలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ దఫా ఎర్రనేలల్లోనూ సాగు చేయడం ద్వారా మరింత దిగుబడి పెరిగే అవకాశం ఉంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో నల్లరేగడి భూములు అధికం. ప్రభుత్వ అంచనాల ప్రకారం సాగు చేయడం ద్వారా 80 లక్షల బేల్స్ పత్తి దిగుబడి రానుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కోటి బేల్స్ దిగుబడి వస్తుంది. గుజరాత్‌లో ప్రైవేటు మిల్లులు అధికం. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. ప్రపంచ ఆర్థిక మాంధ్యం వల్ల టెక్స్‌టైల్ రంగం దివాళా తీసింది. రానున్న రోజుల్లో తెలంగాణలో పండిన పత్తిని కొనేందుకు సీసీఐ ఏ మేరకు సహకరిస్తుందో పాలకులకే తెలియాలి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే సీసీఐ పత్తి కొనుగోలు ఉంటుంది. ప్రస్తుతమైతే ధరలు పడిపోయాయి. డిమాండ్ లేనప్పుడు దిగుబడి అధికమైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహం కలుగుతోంది. మరో వైపు తెలంగాణలో ఆరేండ్ల నుంచి జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సుమారు రూ.650 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాయితీలు వస్తాయన్న ఆశతోనే 2014 తర్వాత 140కి పైగా మిల్లులు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే చాలా గోడౌన్లు నిండిపోయాయి. రానున్న కాలంలో దిగుబడిని నిల్వ చేసే సామర్థ్యం చాలా కష్టమేనని ఓ స్పిన్నింగ్ మిల్లు యజమాని తెలిపారు. తమిళనాడు, ఏపీ రాష్ర్టాల్లోని గోడౌన్లను లీజుకు తీసుకోవడం అనివార్యం. కేంద్ర ప్రభుత్వంతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకోకపోతే పండిన పత్తి పంటకు మార్కెటింగ్ కష్టమే. అందుకే ముందుగానే ప్రయత్నాలు కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టెక్స్‌టైల్ పాలసీ విధివిధానాలేవి?
తెలంగాణ ఏర్పాటవగానే టెక్స్‌టైల్ పాలసీ కోసం తమిళనాడు బృందం, ఇతర నిపుణులతో చర్చించారు. ఆ తర్వాత 2017లో పాలసీని విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు విధి విధానాలను ఖరారు చేయలేదు. దాని ద్వారా ఎంతో మంది నష్టపోయారు. పాలసీ ప్రకటించిన ఉత్సాహం విధి విధానాల రూపకల్పనలో లేదన్న విమర్శలు ఉన్నాయి. పాలసీని అమలు చేసి ఉంటే పన్నుల రూపేణా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేది.
పత్తి సాగుకు అనుకూలమెంత?
ఏయే భూములు అనుకూలం. రైతులకే బాగా తెలుసు. ప్రస్తుతం వరి సాగును తగ్గించేందుకు పత్తిని వేయమంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో నల్లరేగడి భూముల్లోనే పత్తి వేసేవారు. ఇప్పుడు ఎర్రనేలల్లోనూ సాగు చేయమంటున్నారు. చివరికి దుబ్బ చెల్కల్లోనూ సాగు చేయమంటే ఓకవేళ వర్షాలు ఎక్కువగా కురిస్తే పంట నష్టం తప్పదు. అప్పుడు పరిస్థితి ఏంటన్న దాన్ని ఆలోచించడం లేదు. నేల స్వభావాన్ని బట్టి సాగు చేయించాలి. ఏ ఊరికాఊరు యూనిట్‌గా క్రాప్ కాలనీల ఏర్పాటు మంచిదని రైతులు చెబుతున్నారు.
పత్తి సాగు క్రమం…
– ఆదిలాబాద్, బైంసా ప్రాంతాల్లో 1890 కాలంలోనే పత్తిని సాగు చేశారు. అప్పట్లోనే బెంగాలీ దేశీ కాటన్ విత్తనాలను తీసుకొచ్చారు. మధ్య కాలంలో దిగుబడి రావడం లేదని, మార్కెట్ లేదని సాగు క్రమేణా తగ్గిపోయింది.
– బ్రిటన్, యూరోప్, టర్కీ వంటి దేశాల్లో హైబ్రీడ్ వెరైటీలను అభివృద్ధి చేశారు. ఇక్కడ అలాంటి తయారీ శక్తి లేకపోవడంతో దిగుబడిని సాధించలేకపోయారని నిపుణులు చెబుతున్నారు.
– ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో నంద్యాల, రాజేంద్రనగర్, రాయచూరు, పంజాబ్‌ల్లో 5 వ్యవసాయ యూనివర్సిటీలకు జవసత్వాలు లభించాయి. హైబ్రీడ్ వెరైటీస్‌ను తయారు చేయడం ప్రారంభించారు.
– 1970-80 మధ్య కాలంలో వరలక్ష్మీ విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. రాయచూర్ విత్తనాలు కూడా ప్రాచుర్యం పొందాయి.
– 1990 నుంచి పత్తి దిగుబడిలో నాణ్యత కొరవడింది. టెస్ట్ తగ్గింది. పురుగుల మందులు కొట్టడం తప్పనిసరైంది. దిగుబడి రాకపోవడం, రసాయనాల వాడకం పెరగడం మూలాన దురదృష్టవశాత్తు పత్తి రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. చాలా నష్టం వాటిల్లింది.
– తర్వాత హైబ్రీడ్ బన్నీ వెరైటీలు పురుడు పోసుకున్నాయి. ఎన్‌సీహెచ్ రకం కూడా వచ్చింది. ఇవి పురుగును తట్టుకునే శక్తితో వచ్చాయి. 2001 వరకు నిర్విరామంగా సాగు కొనసాగింది.
బీటీ విత్తనాల రాక
– బీటీ వెరైటీల రాక ఆరంభమైంది. జన్యుమార్పిడి విత్తనాలు వచ్చాయి. ఈ మొక్కలను పచ్చపురుగులు తింటే అవే చనిపోయేవి.
– 2003లోనే గుజరాత్ రాష్ట్రంలో కేంద్రం అనుమతి లేకుండానే నవ భారత్ కంపెనీ బీటీ విత్తనాలను వినియోగించారు. ఇప్పటి ప్రధాని, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోడి చొరవతో సాగుబడి నడిచింది.
చంద్రబాబుతో ఐదేండ్లు వెనక్కి
1999లోనే బీటీ విత్తనాలు చైనా నుంచి దిగుమతి అయ్యాయి. మన రాష్ట్రంలో మాత్రం అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు మూలంగా ఐదేండ్లు ఆలస్యంగా వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద కంపెనీల ఒత్తిడి వల్ల రాయల్టీ చెల్లింపుల రగడ తలెత్తింది. దక్షిణాది రాష్ర్టాలకు చెందిన పలు పెద్ద కంపెనీలు బీటీ విత్తనాల రాకను అడ్డుకున్నాయి. దాంతో గుజరాత్ ఐదేండ్లు మన కంటే ముందుకెళ్లిందని ఓ స్పిన్నింగ్ కంపెనీ యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విత్తనాలతో దిగుబడి పెరిగింది. పెట్టుబడి కూడా తగ్గింది. అప్పటి దాకా దేశంలోనే నంబర్ 1 గా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి, రెండో స్థానంలో ఉండే గుజరాత్‌కు మొదటి స్థానానికి చేరింది. గుజరాత్‌లో 30 శాతం దిగుబడి పెరిగింది.
గుజరాత్‌లో టెక్స్‌టైల్ పాలసీ అమలు
బీటీ విత్తనాల రాకతో పత్తి దిగుబడి పెరిగింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ పాలసీని రూపొందించింది. స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల పెట్టుబడిలో మూలధనం 25 శాతం తిరిగిచ్చారు. ఐదేండ్ల పాటు సేల్స్ ట్యాక్స్‌లో 50 శాతం రాయితీని ప్రకటించింది. నిరంతరాయంగా ఆ రాయితీలను కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో దేశంలోని మొత్తం జిన్నింగ్ మిల్లుల్లో, స్పిన్నింగ్ మిల్లుల్లో 50 శాతం గుజరాత్‌లోనే ఉన్నాయి. జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం 70 లక్షల బేల్స్, స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యం లక్ష బేల్స్‌గా ఉన్నట్టు సమాచారం. అలాగే పత్తి గింజల నుంచి నూనె తీసి కేక్ తయారీ చేసే కర్మాగారాలు సైతం దేశంలోనే సగం ఇక్కడే ఉన్నాయి. పత్తి దిగుబడితో పాటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
తెలంగాణలో సీసీఐ మీదే ఆధారం
తెలంగాణలో ఎంత పత్తి పండినా కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రైవేటు రంగ వ్యవస్థ లేదు. పూర్తిగా సీసీఐ మీదనే ఆధారపడాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. 60 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేయడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేదు. పెద్ద మొత్తంలో పత్తి సాగు చేయడం పట్ల రైతాంగం భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచించాలి. 2014 నుంచి అమలు చేసి ఉంటే ఏటా రూ.5 వేల కోట్ల వంతున ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లకు పైగా రెవెన్యూ లభించేది.
వేధిస్తున్న స్కిల్డ్ ఎంప్లాయీస్ కొరత
రాష్ట్రంలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కొరత తీవ్రంగా ఉంది. వలస కార్మికుల మీదనే జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు పని చేస్తున్నాయి. హమాలీ నుంచి యంత్రాల ఆపరేషన్ వరకు వేరే రాష్ర్టాలకు చెందిన వారితోనే నడిపిస్తున్నారు. ఇకనైనా స్వరాష్ట్రంలో గుజరాత్ అనుసరించిన విధానాలను అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
తెలంగాణలో..
తెలంగాణలో సుమారు 55 లక్షల బేల్స్ పత్తి దిగుబడి వచ్చింది. దీంట్లో 40 లక్షల బేల్స్ వరకు సీసీఐ కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు చేసిన బేల్స్ 90 లక్షలు. గుజరాత్ నుంచి సీసీఐ కొనుగోలు చేసిన బేల్స్ 10 లక్షలు మాత్రమే.
గుజరాత్‌లో మిల్లులు
జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం: 70 లక్షల బేల్స్
స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యం: లక్ష స్పిండిల్స్
తెలంగాణలో మిల్లులు
జిన్నింగ్ మిల్లులు: 322(వీటిలో 100 వరకు మూతపడ్డాయి.). సామర్థ్యం కోటి బేల్స్
స్పిన్నింగ్ మిల్లులు: 33(వీటిలో ఎన్పీఏ జాబితాలో 11 ఉన్నాయి. 8 మూత పడ్డాయి). సామర్థ్యం 10 లక్షల స్పిండిల్స్. ఇవన్నీ సరిగ్గా పని చేస్తే 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
పెద్దమొత్తంలో సాగు ప్రమాదకరమే: విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్, జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లు యజమానుల సంఘం
తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో పత్తి సాగు చేయించడం ప్రమాదకరమే. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గింది. టెక్స్‌టైల్ రంగం ఆశించిన రీతిలో లేదు. కొనుగోలు సామర్థ్యం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలకు కొనుగోలు సామర్థ్యం ఏ మేరకు ఉన్నదో ముందుగానే తెలుసుకోవాలి. రాష్ట్రంలోని మిల్లులకు మద్దతు ఇస్తే 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలి. దానికి అవసరమైన నిధులను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. నాబార్డు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. సీసీఐ కొనుగోలు చేసే అంశంలోనూ రైతులపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. గుజరాత్‌లో కాండ్ల పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కొనుగోలు చేసేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకు రావాలంటే రవాణా చార్జీలు భరించాలి.