టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి, దాని పెరుగుదలకు కారణాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సమావేశంలో చర్చించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో పాటించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి గాను ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, కొవిడ్‌పై సరైన అవగాహన, […]
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి, దాని పెరుగుదలకు కారణాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సమావేశంలో చర్చించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో పాటించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి గాను ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, కొవిడ్‌పై సరైన అవగాహన, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని మోడీ సూచించారు. ప్రజలు అజాగ్రత్తలు వీడి విధిగా మాస్కు ధరించాలని, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, బహిరంగ ప్రదేశాలలో గుమిగూడవద్దని కోరారు. ప్రజల్లో వైరస్‌పై చైతన్యం నింపేందుకు ఏప్రిల్ 6 నుంచి 14 దాకా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మోడీ తెలిపారు. క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సహా సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
లక్షకు చేరువలో కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా కొత్త కేసులు 90 వేలను దాటాయి. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 93,249 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే వ్యవధిలో 513 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి పీక్ స్టేజ్‌లో ఉండగా గతేడాది సెప్టెంబర్‌లో ఇంచుమించు పదిసార్లు కొత్త కేసులు 90వేలను దాటాయి. రోజూవారీ కేసులలో మళ్లీ ఆ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కు చేరగా.. యాక్టివ్ కేసులు 6,91,597కు పెరిగాయి.
మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ
మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా తిరిగి అక్కడ లాక్‌డౌన్ విధించి రావొచ్చునని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరించినా.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గింది. లాక్‌డౌన్ లేదని కానీ రాత్రి పూట కఠినమైన ఆంక్షలతో కూడిన కర్ఫ్యూను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నైట్ కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారాంతాల్లో (శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం గంటల దాకా) అత్యవసర సర్వీసులు మినహా అన్నీ మూసే ఉంటాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లలో కూర్చోని తినడాన్ని నిషేధించారు. పార్కులు, సినిమా థియేటర్లను పూర్తిగా మూసేయనున్నారు. సినిమా షూటింగ్‌లనూ నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలన్నీ సోమవారం రాత్రి 8 గంటల నుంచి అమలులోకి రానున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మహారాష్ట్రలో ఆదివారం 57,074 కొత్త కేసులు నమోదయ్యాయి. 222 మంది మరణించారు. కొత్త కేసులలో ముంబై నుంచే 11,163 కేసులు నమోదు కావడం గమనార్హం.