స్థానిక కోటా.. ఎమ్మెల్సీ ఎవరటా?
దిశ, నిజామాబాద్ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం నుంచి ఇద్దరు నేతలు పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కారు పార్టీ కీలక నేతల దృష్టంతా రాజ్యసభపైనే పడింది. కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలను మాత్రం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఊరిస్తోంది. దీనిపై మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు ఆశలు పెట్టుకున్నారు. మధ్యలో తనకూ అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి […]
దిశ, నిజామాబాద్
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం నుంచి ఇద్దరు నేతలు పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కారు పార్టీ కీలక నేతల దృష్టంతా రాజ్యసభపైనే పడింది. కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలను మాత్రం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఊరిస్తోంది. దీనిపై మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు ఆశలు పెట్టుకున్నారు. మధ్యలో తనకూ అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తనవంతు ప్రయత్నాలు మొదలెట్టారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో గతంలో ఎమ్మెల్సీగా డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై శాసన మండలి చైర్మన్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో మండలి చైర్మన్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఛైర్మన్ నిర్ణయాన్నే కోర్టు సమర్థించింది. గత ఏడాది చివరలో భూపతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు మార్గం సుగమమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి సులువుగా విజయం సాధించే అవకాశం ఉండటంతో నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య పెద్దగానే ఉంది. కానీ, ప్రధాన పోటీ మాత్రం మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు మధ్యలోనే ఉంది. ఇద్దరిలో ఒక్కరికే అవకాశం దక్కవచ్చని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేద్దామనుకున్నా రాజకీయ సమీకరణాలు అనుకూలించలేదు. సురేష్‌రెడ్డికి టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదైనా ఉన్నత పదవి ఇస్తానని కేసీఆర్, కేటీఆర్ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుండటంతో ఆ పదవి సురేష్‌రెడ్డినే వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఎమ్మెల్సీ పదవి రేసులో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు సైతం ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వర్‌రావు ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. కాదనలేక ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. సీఎ కేసీఆర్ సైతం మండవకు ఏదో ఒక పదవిని కట్టబెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకావం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన ఏ పదవీ లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సీఏం కేసీఆర్ ద్వారా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.