ఓరుగల్లులో ప్రచార హోరు

దిశ, వరంగల్ సిటీ : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగిసి.. పోలింగ్ ప్రారంభమైందో లేదో అప్పుడే పట్టభద్రుల ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీల నేతల పర్యటనలు ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లాలో రాజకీయ వేడి ప్రారంభమైంది. పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడం కోసం నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు పట్టభద్రుల ఓటరు నమోదును నెల క్రితమే మొదలుపెట్టాయి. ఇక స్వతంత్ర […]

Update: 2020-11-04 01:20 GMT

దిశ, వరంగల్ సిటీ : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగిసి.. పోలింగ్ ప్రారంభమైందో లేదో అప్పుడే పట్టభద్రుల ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీల నేతల పర్యటనలు ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లాలో రాజకీయ వేడి ప్రారంభమైంది. పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడం కోసం నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు పట్టభద్రుల ఓటరు నమోదును నెల క్రితమే మొదలుపెట్టాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులు సైతం వారి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

పోరుగల్లుపైనే ఫోకస్..

మంగళవారం ఓ వైపు దుబ్బాక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రధాన పార్టీల నేతలందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పర్యటించారు. పట్టభద్రుల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ కలిసి ములుగు, భూపాలపల్లి జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. వారితో ఎంపీ కవిత, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. అధికార పార్టీ కేడర్‌ను పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు ఓటరు నమోదు, గ్రాడ్యుయేట్లను ప్రసన్నం చేసుకునేందుకు సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇక టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సైతం వరంగల్‌లోని కొత్తవాడలో పర్యటించారు. చేనేత కార్మికులతో పాటు పట్టభద్రులతో సమావేశమయ్యారు. అక్టోబర్ నెలలో సైతం కోదండరాం వరంగల్‌లో రెండుసార్లు పర్యటించారు. తాను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. వామపక్షాల అభ్యర్థి జయసారధిరెడ్డి సైతం మంగళవారం వరంగల్‌లో పర్యటించారు. ఆయన ఇప్పటికే జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా ఓటరు నమోదుకే పరిమితమయ్యారు.

స్వతంత్రులు సన్నద్ధం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థులు సైతం సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే పర్యటనలు కూడా చేస్తున్నారు. యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న సైతం పట్టభద్రుల బరిలో నిలుస్తున్నట్లు చెప్పి.. సోమవారం జనగామ నుంచి తన పాదయాత్రను కూడా ప్రారంభించారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యమ జేఏసీ నేత కొళ్లు నర్సింహారావు పట్టభద్రుల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు విద్యార్థి జేఏసీ నేతలు మద్దతును ప్రకటించారు.

సెంటిమెంట్ ఫలిస్తుందా?

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానాన్ని గత ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే ఎన్నికల తర్వాత పెద్దగా పట్టభద్రులకు చేసిందేమీ లేదు. పైపెచ్చు అధికార పార్టీ విద్యార్థులకు ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీలు అమలు కాకపోవడంతో అధికార పార్టీపై పట్టభద్రులు అసహనంగా ఉన్నారు. పళ్లా మళ్లీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు సైతం తెరపైకి వచ్చింది. ఆయన అధిష్టానం ముందు పలు ప్రతిపాదనలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News