శపథం చేసిన ఎమ్మెల్యే రాజయ్య.. డిస్కౌంట్లతో దరువు
దిశ,వెబ్‌డెస్క్: ఓట్ల కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. ఎన్నికల్లో ఓట్లకోసం నేతల ప్రలోభాల పర్వం చూశాం. డబ్బులే కాదు చీరల నుంచి ముక్కపుడకల పంపిణీ వరకూ వార్తలు విన్నాం. ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ లో సభ్యత్వ నమోదు కోసం నేతలు కొత్త రూట్లలో వెళుతున్నారు. ఆల్ ఫ్రీ అంటూ ఆఫర్లిచ్చేస్తున్నారు. డిస్కౌంట్‌లు ఇచ్చి మరి సభ్యత్వాల్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీనియోజకవర్గం నుంచి ఒక్కో ఎమ్మెల్యే కనీసం 50వేల సభ్యత్వాల్ని పూర్తి చేయాలని టీఆర్ఎస్ […]
దిశ,వెబ్‌డెస్క్: ఓట్ల కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. ఎన్నికల్లో ఓట్లకోసం నేతల ప్రలోభాల పర్వం చూశాం. డబ్బులే కాదు చీరల నుంచి ముక్కపుడకల పంపిణీ వరకూ వార్తలు విన్నాం. ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ లో సభ్యత్వ నమోదు కోసం నేతలు కొత్త రూట్లలో వెళుతున్నారు. ఆల్ ఫ్రీ అంటూ ఆఫర్లిచ్చేస్తున్నారు. డిస్కౌంట్‌లు ఇచ్చి మరి సభ్యత్వాల్ని పూర్తి చేయాలని చూస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతీనియోజకవర్గం నుంచి ఒక్కో ఎమ్మెల్యే కనీసం 50వేల సభ్యత్వాల్ని పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టార్గెట్ పెట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ మాటల్ని చాలెంజ్‌గా తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లాలోని ప్రజల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. సభ్యతనమోదు పేరిట ప్రలోభాల వల విసురుతున్నారు.
గులాబీ పార్టీ సభ్యత్వం తీసుకుంటే భారీ మెడికల్ ప్యాకేజీ ఇచ్చారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటే ఉచిత అంబులెన్స్, తన ఆస్పత్రిలో ఆపరేషన్లకు 20శాతం రాయితీ, అన్నీ రకాల పరీక్షలకు 30శాతం డిస్కౌంట్, ఇక మగబిడ్డ జన్మిస్తే డెలివరీ ఛార్జెస్ లో యాబై శాతం తగ్గింపు, ఆడపిల్లపుడితే ట్రీట్మెంట్ ఫ్రీ అంటూ రాజయ్య బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం అందిస్తామంటూ మరో ఉచిత హామీని ప్రకటించారు. దీంతో రాజయ్య ఆఫర్లు జిల్లాలోనే కాదు, స్టేట్ లోనే హాట్ టాపిగ్గా మారాయి.
ఇంతకుముందు మైక్ దొరికితే మైమరచిపోయే రాజయ్య ఇప్పుడు డప్పు కనిపిస్తే డిస్కౌంట్ల పేరుతో దరువేయించేస్తున్నారు. తనదైన స్టైల్లో డప్పు వాయిస్తూ సభ్యత్వాల నమోదు సేకరణలో ఊపుతెప్పిస్తున్నారు. అంతేకాదు సభ్యత్వాల నమోదు కోసం ఆటో నడపడం, గడ్డం తీసేదీ లేదంటూ శపథం చేస్తూ దూసుకుపోతున్నారు రాజయ్య.
చూడప్పా సిద్దప్పా… నేను సింహం లాంటివాడిని
‘చూడప్పా సిద్దప్పా… నేను సింహం లాంటివాడిని… దానికి నాకు తేడా ఒక్కటే… అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అనే పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ డైలాగుల్ని ఫాలో అవుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య. స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు 60వేలు పూర్తయ్యే వరకు గడ్డం తీయనని రాజయ్య శపథం చేశారు. 60లక్షల సభ్యత్వాల్ని నమోదు చేసిన ప్రాంతీయ పార్టీగా తాము రికార్డ్ సృష్టించామని, ఆ రికార్డ్ ను మళ్లీ బద్దలు కొట్టేందుకు 80 లక్షల సభ్యత్వాల్ని టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పారు.
మనం చేసేపని ముందుకు సాగాలంటే ఒకదీక్షగానీ, తపస్సుగానీ, యజ్జం గానీ చేయాలి. నా కార్యకర్తల మీదున్న నమ్మకంతో 15 రోజుల్లోయజ్ఞాన్ని పూర్తి చేసేలా నేనెప్పుడూ నీటుగా గడ్డం తీసుకొని ఉంటా. కానీ తొలిసారి స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గ బలాన్ని ప్రదర్శించేందుకు, కార్యకర్తల కట్టుబాటుకు కార్యచరణ ఇవ్వాలని, 60వేల సభ్యత్వాన్ని 15రోజుల్లో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. మొత్తానికి ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రలోభాల్ని అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.