సింగరేణి ఎన్నికల్లో సీతక్కకు కీలక బాధ్యతలు
దిశ ప్రతినిధి, వరంగల్ : మరికొద్దిరోజుల్లో సింగరేణి ఎన్నికలు జరుగుతాయని తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ)కి రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్కను నియమించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే యూనియన్‌లో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, కొద్దిరోజుల్లోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఇక ఆమె […]
దిశ ప్రతినిధి, వరంగల్ : మరికొద్దిరోజుల్లో సింగరేణి ఎన్నికలు జరుగుతాయని తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ)కి రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్కను నియమించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే యూనియన్‌లో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, కొద్దిరోజుల్లోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఇక ఆమె నియామకం లాంఛనమేనని, సాధ్యమైనంత త్వరలో అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు.
సీతక్కే ఎందుకంటే…?
సింగరేణి గనులున్నా భూపాలపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరుతో పాటు మిగతా ప్రాంతాల్లోని కార్మికులతో సీతక్కకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. గతంలో సింగరేణి సమస్యలపై ఆమె అసెంబ్లీలోనూ గళం వినిపించారు. సీతక్క పోరాడే తత్వం కూడా సింగరేణి కార్మికులను యూనియన్ వైపు మొగ్గు చూపేలా చేస్తుందన్న ఆలోచనతో పార్టీ అధిష్ఠానం ఆమె నియామకానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఉండటంతో ఆమె నియామకం లాంఛనమేనని తెలుస్తోంది.
ఇక సింగరేణి భూ గర్భ గనులు ఎక్కువగా మందమర్రి, గోదావరిఖని, మంచిర్యాల, చెన్నూరు, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థులు ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో కార్మిక వర్గం ఓట్లే కీలకమయ్యాయి.
గెలిచి తీరాలనే లక్ష్యంతో ఐఎన్‌టీయూసీ..
2017లో జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలిచ్చినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న అభిప్రాయం ఎక్కువమంది కార్మికుల్లో ఉన్న మాట వాస్తవం. త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది.
నేడు రాజ్ భవన్ ఎదుట ధర్నా…
దీనికి తోడు 2017 అక్టోబర్ 5న ఎన్నికలు జరగగా.. బైలా ప్రకారం 2సంవత్సరాల్లోగా మళ్లీ నిర్వహించాల్సి ఉంది. ధ్రువీకరణ పత్రం ఆరు నెలలు ఆలస్యంగా అందజేశారనే వాదనతో 2020 ఏప్రిల్ మాసం వరకు పదవీకాలంలో ఉండేలా టీబీజీకేఎస్ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంది. అయితే ఆ గడువు ముగిసి కూడా ఇప్పటికే 20 నెలలు పూర్తయినా ఎన్నికల నిర్వహణకు చర్యలు లేకపోవడం గమనార్హం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ గవర్నర్ భవన్, లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.