కేంద్రం గుడ్‌న్యూస్.. పాలమూరు నుంచి మరో నేషనల్ హైవే..
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా నుండి మరో జాతీయ రహదారి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాలమూరు జిల్లా కేంద్రం నుండి కోస్గి, తాండూరు మీదుగా చించోలి వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలను శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం కేసీఆర్ పాలమూరులో […]
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా నుండి మరో జాతీయ రహదారి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాలమూరు జిల్లా కేంద్రం నుండి కోస్గి, తాండూరు మీదుగా చించోలి వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలను శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం కేసీఆర్ పాలమూరులో మరో జాతీయ రహదారిని అభివృద్ధి చేయవలసిందిగా చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. మొత్తం 196 కిలోమీటర్ల పొడవున రూపొందే ఈ జాతీయ రహదారి మన రాష్ట్రంలో 126 కిలోమీటర్లు, కర్ణాటకలో 64 కిలోమీటర్ల పొడవున ఉంటుందన్నారు.
కేంద్రం ఈ రోడ్డును నోటిఫై చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటాలో ఈ రోడ్డు ను సాధించుకుని తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో మంజూరై రద్దైన భారత్ మాల రోడ్డును డివిటిపల్లి సమీపం నుంచి ధర్మాపూర్ మీదుగా రాయచూర్ వరకు నిర్మించే పనులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ మంత్రి వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మాణం జరుపుకుంటున్న బైపాస్ రోడ్డు పొడిగింపునకు నిధులను కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా అంగీకరించారని గుర్తుచేశారు. ఇప్పటికే రూ.96.7 కోట్లతో 5.1 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందని, మరో 4.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తే బైపాస్ పూర్తవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలు, గ్రామాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి అన్నివిధాలా సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు.