అవసరమైతే కరోనా టెస్ట్‌లు పెంచుతాం

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 116 జీహెచ్ఎంసీ పరిధిలోనే వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 8 మందికి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ అర్బన్‌లో ముగ్గురికి కరోనా సోకింది. ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కూడా రెండు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు […]

Update: 2020-06-05 11:25 GMT

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 116 జీహెచ్ఎంసీ పరిధిలోనే వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 8 మందికి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ అర్బన్‌లో ముగ్గురికి కరోనా సోకింది. ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కూడా రెండు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,290కు చేరుకుంది. ఒకే రోజు వ్యవధిలో ఎనిమిది మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 113కు చేరుకుంది. రాష్ట్రానికి విమానాల ద్వారా చేరుకున్నవారిలో 212 మందికి, రైళ్ల ద్వారా చేరుకున్న వలస కార్మికుల్లో 206 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది.

ఆంక్షల సడలింపుతో ప్రజల కదలిక పెరిగిందని, లక్షణాలు లేకున్నా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అవసరాలకు అనుగుణంగా కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతామన్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా అంటుకుంటోందని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయన్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, చెన్నైనగరాల్లో సైతం వైద్య సిబ్బందికి కరోనా సోకుతోందని, ఓపీ విభాగం కూడా ఇందుకు కారణమని మంత్రి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల కొరత లేదని, తాజాగా 150 కొత్త వెంటిలేటర్లు సమకూరాయన్నారు. కేంద్రం నుంచి వెయ్యి వెంటిలేటర్లను సమకూర్చుకోడానికి ఆర్డర్ ఇస్తే ఇప్పటికే యాభై చేరుకున్నాయని, మిగిలినవి వస్తాయన్నారు. ప్రైవేటు లేబొరేటీరీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అనుమతి ఇస్తే దాని తర్వాత వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయని, ఒక పాజిటివ్ పేషెంట్‌తో సంబంధాల్లో ఉన్న కాంటాక్టులను శోధించడం కష్టసాధ్యమవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు మెరుగైన సేవలు అందడంలేదంటూ వస్తున్న వార్తల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయినవారిని అడిగితే ప్రభుత్వ సేవల్లో నాణ్యత ఎలా ఉందో తెలుస్తుందని, చిన్నచిన్న లోపాలను భూతద్దంలో పెట్టి వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News