తెలంగాణలో రైతు రాజ్యం
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల సంఘటిత శక్తితో ఎన్నో అద్భుతాలను సృష్టించొచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం పూణె సమీపంలో భారామతి వద్ద శ్రీ సోమేశ్వర రైతు సహకార చక్కెర కార్మాగారం సందర్శించారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుబంధు సమితీలను ఏర్పాటు చేశారని మంత్రి వివరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజల పాత్ర, […]
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల సంఘటిత శక్తితో ఎన్నో అద్భుతాలను సృష్టించొచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం పూణె సమీపంలో భారామతి వద్ద శ్రీ సోమేశ్వర రైతు సహకార చక్కెర కార్మాగారం సందర్శించారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుబంధు సమితీలను ఏర్పాటు చేశారని మంత్రి వివరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజల పాత్ర, సహకార రంగంలో రైతుల పాత్ర లేకుండా గత పాలకులు మూస ధోరణిలో వ్యవహరించారని, దీంతో పంచాయతీ రాజ్, సహకార స్ఫూర్తి అమలుకాలేదని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చి నిధులు విడుదల చేస్తున్నామన్నారు.
దీంతో పంచాయతీరాజ్ ఉద్యమం పున:ప్రారంభమయిందని, రైతులను సమీకృతం చేసి సహకార వ్యవసాయం సమిష్టిగా ముందుకు తీసుకుపోవడమే నేటి అవసరమన్నారు. సహకార రంగంలో మహారాష్ట్ర రైతుల పాత్ర అద్వితీయమని కొనియాడారు. దీంతోనే వందలాది చక్కెర కార్మాగారాలు విజయవంతంగా సాగుతున్నాయని, ఏటా చెరుకు సాగు పెరిగి రైతులకు లాభాలు అర్జిస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి లేకుండా రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి అనేక కార్మాగారాలు నడిపిస్తున్నారని, పంట, పరిశ్రమ, యాజమాన్యం, అమ్మకం, లాభాలు అన్నీ రైతులవేనని, ఇది సహకార సంఘాలుగా ఏర్పడి విజయం సాధించిన రైతుల గాధ అని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్, సాగునీరు, పంటకు పెట్టుబడి, రైతుబీమా వంటి అద్భుతమైన చేయూతను ప్రభుత్వం రైతులకు అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుండడంపై శరద్ పవార్ ఆనందం వ్యక్తం చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ యోగక్షేమాలు, ఇటీవల కురిసిన వర్షాలు, పంటల పరిస్థితిపై ఆరా తీశారన్నారు. కాగా ఈ భేటీ అనంతరం తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితో సమావేశాన్ని శరద్ పవార్ ట్విట్టర్లో పంచుకున్నారు. ‘వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలు మరియు సవాళ్లను చర్చించామని, రైతు అనుకూల పథకాలు, వ్యవసాయ అభివృద్ధికి వినూత్న వ్యవసాయ పద్ధతులపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నామని’ ట్విట్టర్ లో శరద్ పవార్ ట్వీట్ చేశారు.