ఆత్మవిశ్వాసం వైపు తెలంగాణ రైతులు

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతాంగానికి పెద్దపీట వేశామని, రాష్ట్ర రైతు పథకాలను దేశమే మెచ్చుకుందని, తెలంగాణ రైతులు ఇప్పుడే ఆత్మవిశ్వాసం వైపు అడుగులేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనాతో రాష్ట్ర రాబడి రూ. 50వేల కోట్లు రాకున్నా రైతుబంధు కింద రూ.7,251 కోట్లు రైతులకు ఇచ్చాంమన్నారు. మరో రూ.30వేల కోట్లతో వందశాతం పంట ఉత్పత్తులను ప్రభుత్వం కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేసిందని […]

Update: 2020-08-04 11:25 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతాంగానికి పెద్దపీట వేశామని, రాష్ట్ర రైతు పథకాలను దేశమే మెచ్చుకుందని, తెలంగాణ రైతులు ఇప్పుడే ఆత్మవిశ్వాసం వైపు అడుగులేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనాతో రాష్ట్ర రాబడి రూ. 50వేల కోట్లు రాకున్నా రైతుబంధు కింద రూ.7,251 కోట్లు రైతులకు ఇచ్చాంమన్నారు. మరో రూ.30వేల కోట్లతో వందశాతం పంట ఉత్పత్తులను ప్రభుత్వం కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేసిందని వివరించారు. కోటి 10లక్షల ఎకరాలలో రాష్ట్రంలో పంటలు సాగుచేశారని, వ్యవసాయ రంగం బలోపేతం అయితే మిగతా రంగాలు బలంగా ఉంటాయని ప్రభుత్వం అనేక పథకాలు, వసతులు రైతాంగానికి కల్పించిందన్నారు. రూ.25వేల రుణాలు ఉన్న 2.87 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేశామని, వివిధ బ్యాంకుల నుండి గత ఏడాది పంటరుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 41,31,004 మంది ఉన్నారని, సహకార బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారు 20 శాతం ఉండగా, వాణిజ్య బ్యాంకుల నుండి మిగిలిన రుణాలు తీసుకున్నారని నిరంజన్ రెడ్డి వివరించారు.

మహిళా సంఘాలకు రుణాలు, కేసీఆర్ కిట్ , ఆసరా ఫించన్లు , రైతుబంధు, ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేయడం, రైతులకు పంటలు మంచిగా పండడం వంటి కారణాలతో తెలంగాణ గ్రామీణ ఆర్థికరంగం స్థిరంగా ఉందన్నారు. అప్పుల ఊబి, ఆత్మహత్యలు, కరువుకాటకాల నుంచి గతంలో లేనివిధంగా సుసంపన్నమైన తెలంగాణ ఆవిష్కృతమవుతుందని, ఆ దిశగా ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో రైతాంగం సంతోషంగా ఉందన్నారు. రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి చర్యలతో వ్యవసాయం బలోపేతానికి నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నామన్నారు. గతనెల 6న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి, పంట రుణాల ప్రణాళిక తయారు చేశామన్నారు. రూ.31,936 కోట్లు వానాకాలానికి రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఆగస్టు 4వరకు రూ.11, 093 కోట్లు రుణాలు మంజూరు చేశామని, గత ఏడాది జులై నెలాఖరుకు రూ.10,580 కోట్లు ఇచ్చారని, కరోనా నేపథ్యంలో కూడా గత ఏడాది కన్నా ఎక్కువ రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

సహకార బ్యాంకులు ఈ ఏడాది రూ.1516.88 కోట్ల రుణాలు మంజూరు చేశాయని, గత ఏడాది ఇదే సమయానికి రూ.1296 కోట్ల రుణాలు ఇచ్చారని, గత ఏడాది 11, 77,326 మంది ఈ సమయం వరకు రుణాలు తీసుకుంటే ఈ ఏడాది 12, 97,267 మంది రుణాలు తీసుకున్నారన్నారు. గత నాలుగేళ్ల వానాకాలం పంట రుణాల్లో ఈ ఏడాదే ఎక్కువగా ఇచ్చినట్లు వెల్లడించారు. అవసరం లేకున్నా రైతు అప్పులు తీసుకోరని, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకూడదనే దేశంలో రైతులకు రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. రైతాంగ అనుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతున్నామని, రైతులు సంతోషంగా ఉన్న నేపథ్యంలో ఏదో నిరాశ నిస్పృహలో ఉన్నట్లు, ఇబ్బందులలో ఉన్నట్లు అసత్య కథనం రాయడం దుర్మార్గమని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ సీతాపతి శర్మ, టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, టెస్కాబ్ ఎండీ మురళీధర్ ఉన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..