బెంగాల్‌లో టీఎంసీ సర్కార్‌కు డబుల్ షాక్
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్ తగిలింది. రవాణా, నీటిపారుదల శాఖ మంత్రి సువేందు తన మంత్రి పదవికి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేగాకుండా తృణముల్ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ రవాణా, నీటిపారుదల శాఖ మంత్రి శువేందు అధికారి మమతా శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు […]
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్ తగిలింది. రవాణా, నీటిపారుదల శాఖ మంత్రి సువేందు తన మంత్రి పదవికి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేగాకుండా తృణముల్ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ రవాణా, నీటిపారుదల శాఖ మంత్రి శువేందు అధికారి మమతా శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధనకర్‌కు పంపారు. వీలైనంత తొందరగా తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. రాజీనామా లేఖ అందినట్టు గవర్నర్ ధనకర్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. సువేందు అధికారి బీజేపీ కేంద్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని, ఏ క్షణమైనా ఆ పార్టీలో చేరవచ్చునని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. అంతేగాకుండా శనివారమే ఢిల్లీ ప్రయాణమయ్యే అవకాశమున్నదని తెలిపాయి. కాగా అధికారపార్టీలో అసంతృప్తి పెరిగిందని, టీఎంసీ వీడిన శువేందు అధికారితోపాటు ఇతరులు తమ పార్టీలో చేరడానికి ద్వారాలు తీసే ఉన్నాయని బీజేపీ బెంగాల్ స్టేట్ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ అన్నారు. సువేందు అధికారితో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంతానికి బీజం పడిందని అభిప్రాయపడ్డారు.
అంతేగాకుండా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఎంపీలు అర్జున్ సింగ్, నిసిత్ ప్రమాణిక్‌ల సమక్షంలో మిహిర్ గోస్వామిని బీజేపీ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ పార్టీలోకి ఆహ్వానించారు. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఉత్తర బెంగాల్‌లో ఇకపై అభివృద్ధి జరుగుతుందని మిహిర్ అన్నారు. టీఎంసీ పుట్టుక నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేత మిహిర్ గోస్వామి అక్టోబర్ 31న పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రాబల్యాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పార్టీ మమతా బెనర్జీ చేతిలో లేదని విమర్శించారు. తన సమస్యలను బెనర్జీ దగ్గరకు తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయని వాపోయారు. పలుసార్లు అవమానానికి గురైన తాను టీఎంసీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు.