నీరా కేఫ్ గౌడ కులస్థుల అస్తిత్వానికి ప్రతీక

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఏర్పాటవుతున్న తొలి నీరా కేఫ్ గౌడ కులస్థుల అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో తొలి నీరా కేఫ్ నిర్మాణానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో వృత్తి నైపుణ్యం ఉందని, రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2లక్షల మంది జీవనం సాగిస్తున్నారన్నారు. కుల వృత్తుల అభివృద్ధితో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుందనేది సీఎం కేసీఆర్ నమ్మకమని […]

Update: 2020-07-23 07:54 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఏర్పాటవుతున్న తొలి నీరా కేఫ్ గౌడ కులస్థుల అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో తొలి నీరా కేఫ్ నిర్మాణానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో వృత్తి నైపుణ్యం ఉందని, రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2లక్షల మంది జీవనం సాగిస్తున్నారన్నారు. కుల వృత్తుల అభివృద్ధితో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుందనేది సీఎం కేసీఆర్ నమ్మకమని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రూ.16కోట్ల వృత్తి పన్ను బకాయిలు రద్దు చేసిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అంతకముందు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 1800 చదరపు మీటర్ల స్థలంలో రూ.3కోట్లతో ఈ కేఫ్‌ను నిర్మించనున్నామని, వెయ్యి చదరపు మీటర్ల‌లో కేఫ్ స్టాళ్లు, 800 చ.మీ ఓపెన్ స్పేస్‌లో హుస్సేన్ సాగర్ వ్యూ కనిపించేలా సీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీరాకేఫ్ మొత్తంగా చూస్తే తాటాకు ఆకృతిని పోలి ఉంటుందని తెలిపారు. షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం నీరాను తాగొచ్చని, నీరాకు కల్లుకు చాలా వ్యత్యాసం ఉందని ఉదయాన్నే చెట్ల నుంచి తీసేది నీరా అని వివరించారు. దీనిలో చాలా ఔషధ గుణాలున్నాయని, కరోనా లాంటి వ్యాధులను కూడా రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా నీరా నయం చేస్తుందని తెలిపారు. వేల సంవత్సరాల క్రితం నుంచి కల్లు గీత వృత్తి కొనసాగుతోందని, గీతవృత్తికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు అభివృద్ధి చెందారని గుర్తుచేశారు. గీత వృత్తి పన్ను రద్దు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయాని, అయితే పన్ను రద్దు చేసిన ఘనత మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు దక్కిందని అన్నారు.

పన్ను రద్దు కోసం ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారని చెప్పారు. గత పాలకులు కల్లు దుకాణాలను మూసి వేయించి ఎన్నో గౌడ కుటుంబాలను రోడ్డున పడేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పన్ను రద్దు చేయడంతో ఎన్నో కల్లు దుకాణాలు తిరిగి తెరచుకున్నాయని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ఇస్తోందన్నారు. హరితహారంలోనూ ఈత చెట్లు నాటుతూ ప్రభుత్వం గౌడ కులస్థులను ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని, ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గౌడ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీసాలలోని నీరా రుచి చూశారు.

Tags:    

Similar News