గులాబీ గూటిలో కేటీఆర్ మార్క్..!

అధికార పార్టీలో దిద్దు‘బాట’ మొదలైంది. ఇటీవలి కాలంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. రచ్చకెక్కగానే సారీ చెబుతుండటం రివాజుగా మారింది. ఈ వ్యవహారం పార్టీకి పలుచోట్ల తలనొప్పి తెచ్చి పెట్టంది. వీళ్లలో చాలా మంది సీనియర్లు సైతం ఉండటం విశేషం. దీనికి తోడు వరుసగా రెండో సారి గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్టు పార్టీ అధిష్టానం గుర్తించింది. అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటరీ వాలిపోతున్నది. అక్కడే మకాం […]

Update: 2021-02-04 12:29 GMT

అధికార పార్టీలో దిద్దు‘బాట’ మొదలైంది. ఇటీవలి కాలంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. రచ్చకెక్కగానే సారీ చెబుతుండటం రివాజుగా మారింది. ఈ వ్యవహారం పార్టీకి పలుచోట్ల తలనొప్పి తెచ్చి పెట్టంది. వీళ్లలో చాలా మంది సీనియర్లు సైతం ఉండటం విశేషం. దీనికి తోడు వరుసగా రెండో సారి గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్టు పార్టీ అధిష్టానం గుర్తించింది. అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటరీ వాలిపోతున్నది. అక్కడే మకాం వేసి రాజకీయ సమావేశాలకు సిద్ధమవుతున్నది. దీంతో అధికారపార్టీ ఎమ్మెల్యేల వెన్నులో వణుకు మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి వెల్లడైంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లిన టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ టికెట్ల కేటాయింపులో రాజీ పడలేదు. ఎమ్మెల్యేల గెలుపును భుజాలపై వేసుకుని సిట్టింగు​లకే అవకాశం కల్పించారు. నాలుగైదు చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా, టీఆర్​ఎస్​కు అనుకూలంగా ఉండటం కలిసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం మార్పు ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి కేటీఆర్​ను సీఎం చేస్తారనే ఊహాగానాలున్నాయి. కేటీఆర్​ కేబినెట్​ కూడా రెడీ అయిందంటున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలలో కూడా కేటీఆర్​ కోటరీ యాక్టివ్​గా మారింది. ఇప్పటి వరకు ద్వితీయశ్రేణి నేతలుగా ఉన్న నేతలు ప్రస్తుతం అంతా మాదే అనే రీతిలో రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలలో కొత్త టీం చక్రం తిప్పుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఇక మీరు చూసుకొండి..

ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కూడా మాట దాటుతున్నారు. దీంతో ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇలాంటి పరిణామాల పర్యవసానంగానే కొత్త నేతలు కనిపిస్తున్నారు. వరంగల్​ జిల్లాలో ఓ ఎమ్మెల్యే వైఖరి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని అధిష్టానం గుర్తించింది. దీంతో మంత్రి కేటీఆర్​కు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్సీని పరకాల సెగ్మెంట్​లో యాక్టివ్​గా తిరగాలని చెప్పి పంపించారు. మంత్రి కేటీఆర్​కు సన్నిహితులుగా ఉండే చాలా మందిని ప్రత్యామ్నాయ నేతలుగా తిప్పుతున్నారు. మహబూబ్​నగర్​, కరీంనగర్​, వరంగల్ జిల్లాలలో కేటీఆర్​ ప్రధాన అనుచరులు ప్రధానంగా కనిపిస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో కూడా కొంతమంది యూత్​ లీడర్లను రంగంలోకి దింపుతున్నారు. సోషల్​ మీడియాను నడిపించిన ఓ యువనేతను నగర శివారులోని ఓ నియోజకవర్గంలో తిప్పుతున్నారు. ఇలా కేటీఆర్​ కోటరీ పలు నియోజకవర్గాలలో మకాం వేస్తోంది. వరంగల్ జిల్లాలోని మరో ఎమ్మెల్యేపై భూ కబ్జాల ఆరోపణలు పదేపదే వస్తుండటంతో, తాజాగా ఓ ఎమ్మెల్సీని సదరు నియోజకవర్గంపై దృష్టి పెట్టుకోవాలని సూచించినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు.

పదవులు లేవంటూ..

కొందరు మొదట్నుంచీ కేటీఆర్​ అనుచరులైనప్పటికీ పదవులు లేకుండా ఉన్నారు. పార్టీ కోసం పని చేస్తున్న నేతలను వ్యతిరేకత పెరుగుతున్న సెగ్మెంట్లకు పంపిస్తున్నారని తెలుస్తోంది. తమ సెగ్మెంట్లలో ఆయా నేతలు యాక్టివ్​గా తిరుగుతుండటం ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. పార్టీలోని నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారని, రెండు వర్గాలుగా ఉంటున్నారని కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. పార్టీపరమైన అంశాలను పరిశీలిస్తున్నారంటూ సమాధానం చెప్పి పంపినట్లు తెలిసింది.

మార్పు మొదలైనట్టేనా?

పలు జిల్లాలు, నియోజకవర్గాలలో ఇప్పటికే అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన ఓ మంత్రి నియోజకవర్గంలో ఓ మైనార్టీ నేతను ఎంకరేజ్​ చేస్తున్నారంటూ పార్టీలోని ఒక వర్గం ఇటీవల తీవ్ర ఆరోపణలకు దిగింది. వికారాబాద్​ జిల్లాలోని కొడంగల్​ నియోజకవర్గంలో కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఆదిలాబాద్​ జిల్లాలోని పలు నియోజకవర్గాలలోనూ అదే పరిస్థితి. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్న ప్రాంతాలలో ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. గద్వాల జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒకవర్గం తాజాగా మంత్రి కేటీఆర్​ను కలిసి ఫిర్యాదు చేసింది. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేస్తారని చెప్పుకున్నారు. మంత్రి కేటీఆర్​ కోటరీ కూడా సెగ్మెంట్లలో అడుగు పెడుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News