‘చలో నార్త్ ఇండియా’.. సొంత పార్టీ నేతలనూ నమ్మని కేసీఆర్‌..?

దిశ ప్రతినిధి, మెదక్ : సీఎం కేసీఆర్ ఇలాకాలోనూ క్యాంపు రాజకీయాలు తప్పడం లేదు. జిల్లాలోని మెజార్టీ ఓటర్లందరూ అధికార పార్టీ వైపే ఉన్న వారిని నమ్మే స్థితిలో టీఆర్ఎస్ లేదు. అందుకే అధికార టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు పూనుకుంది. ఇందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ బరిలో ఉండటమే కారణమని తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే ఎన్నికను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ చాలెంజ్ తీసుకున్నాయి. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ ఒక్క […]

Update: 2021-11-30 10:14 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : సీఎం కేసీఆర్ ఇలాకాలోనూ క్యాంపు రాజకీయాలు తప్పడం లేదు. జిల్లాలోని మెజార్టీ ఓటర్లందరూ అధికార పార్టీ వైపే ఉన్న వారిని నమ్మే స్థితిలో టీఆర్ఎస్ లేదు. అందుకే అధికార టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు పూనుకుంది. ఇందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ బరిలో ఉండటమే కారణమని తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే ఎన్నికను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ చాలెంజ్ తీసుకున్నాయి. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ ఒక్క అడుగు ముందుకేసి కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కలవకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించింది. ఇప్పటికే కొందరు నాయకులు క్యాంపులకు తరలివెళ్లగా.. మరికొందరు క్యాంపులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేల పర్యవేక్షణలో జిల్లా మంత్రి ఆదేశాల మేరకు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో క్యాంపు శిబిరాలు ఏర్పాటు చేశారు. పది రోజులకు కావాల్సిన సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు.

చలో నార్త్ ఇండియా..

జిల్లా మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు , పట్టణ కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్తున్నారు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,027 ఓటర్లకు గాను అధికార టీఆర్ఎస్ 750 వరకు ఓట్లు ఉన్నప్పటికీ.. ఓటర్లు ఎవరైనా కాంగ్రెస్ వలలో పడతారేమోనన్న భయంతో క్యాంపు రాజకీయం మొదలు పెట్టింది. ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత స్వీకరించిన మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, సిమ్లా, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాల వారీగా సిద్దిపేట జిల్లా ప్రజాప్రతినిధులు ఒక చోటికు వెళ్తుండగా మెదక్, సంగారెడ్డి చెరో వైపు పంపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. కొందరు మహిళా ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా … మిగిలిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నేడు లేదా రేపు వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు చెప్పుకొచ్చారు. వీరంతా ఎన్నికల పోలింగ్ సమయం వరకు అక్కడే గడపనున్నారు. వీరి కోసం ఇప్పటికే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పోలింగ్ రోజున నేరుగా క్యాంపు నుంచి వచ్చి ఓటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

సొంత పార్టీ నేతలను నమ్మని టీఆర్ఎస్..

సొంత పార్టీ నేతలను సైతం అధికార టీఆర్ఎస్ నమ్మలేని స్థితిలో ఉన్నట్టు సమాచారం. అందుకే ఉమ్మడి మెదక్ జిల్లాలో నూటికి 99.9 శాతం గెలిచే ఛాన్స్ ఉన్నా క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టిందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత క్రమంలో ఉండటం, కాంగ్రెస్ నాయకులు తమదైన శైలిలో అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆకర్షించేలా మీడియా, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించడం, అధికార పార్టీకి చెందిన అభ్యర్థి కొత్త వారు కావడం, దీనికి తోడు జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉండటంతో ఓట్లు చీలిపోతాయేమోనన్న ఆందోళనతో సొంత పార్టీ నేతలను సైతం అధికార టీఆర్ఎస్ నమ్మడం లేదనే చర్చ నడుస్తోంది. అందుకోసమే సీఎం ఇలాకాలో ఎన్నడూ లేని విధంగా క్యాంపు రాజకీయం అనే కొత్త పదం వినిపిస్తోందంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ముచ్చటించుకుంటున్నారు. మరీ క్యాంపునకు వెళ్లిన ప్రజాప్రతినిధులు అధికార టీఆర్ఎస్‌కు ఓటేస్తారా? లేక ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తారా? అన్నది తేలాలంటే డిసెంబర్ 10న జరిగే పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News