కీలక సమావేశానికి మంత్రి హరీష్, ఎమ్మెల్యేలు డుమ్మా.. నిలదీసిన నేతలు
దిశ, మెదక్ : వైద్యం, విద్యా, వ్యవసాయ శాఖలపై సభలో చర్చకు వచ్చిన సమయంలో జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీశారు. సత్వరం సమస్యలను పరిష్కరించాలని సభలో డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీష్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ హేమలత మాట్లాడుతూ.. నూతనంగా […]
దిశ, మెదక్ : వైద్యం, విద్యా, వ్యవసాయ శాఖలపై సభలో చర్చకు వచ్చిన సమయంలో జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీశారు. సత్వరం సమస్యలను పరిష్కరించాలని సభలో డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీష్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జడ్పీ చైర్మన్ హేమలత మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోసు కొవిడ్ టీకా వేసుకొని వారిని గుర్తించి ఈ నెలాఖరులోగా అందరూ వేసుకునేలా ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల10 వేల మందికి టీకాలు వేశామని, వాక్సిన్ కొరత లేదని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి అర్హులైన అందరికీ టీకాలు వేసి వందశాతం కరోనా టీకాలు వేసిన జిల్లాగా చేయాలని కోరారు. జ్వరం, ఎటువంటి కరోనా లక్షణాలున్నా RTPCR పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీరోజు 300 వరకు పరీక్షలు చేయడానికి వైద్యాధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముందస్తు చర్యల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూశామని చెప్పారు. ఈ సంవత్సరం 26 డెంగ్యూ, 4 మలేరియా, రెండు చికెన్ గున్యా కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. వారికి సరైన చికిత్స అందించామని తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని సమీక్షిస్తూ ఈ వానాకాలంలో సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట వచ్చే అవకాశముందని అన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన కందులు, శనగలు, పేసర్లు వంటి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని సమీక్షిస్తూ 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీలో రూ.166 కోట్లు అందజేసి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచామని అన్నారు. జిల్లా ఆహార శుద్ధి పరిశ్రమలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 21 మండలాలలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా మరో 4,5 మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.
ఆసరా పింఛన్ల దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడగించిందని, అర్హులు దరఖాస్తు చేసుకోవలసిందిగా కలెక్టర్ సూచించారు. విద్యా శాఖను సమీక్షిస్తూ కరోనా వల్ల చాలా నెలలు పాఠశాలలు తెరువనందున విద్యార్థులలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్‌లో కనీస పరిజ్ఞానం పెంపొందించుటకు దసరా తరువాత ‘త్రీ ఆర్స్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని అన్నారు. పాఠశాల విద్యార్థులు, అధ్యాపకుల హేతుబద్దీకరణ చేయాలని డీఈఓకు సూచించారు. విద్యుత్ శాఖను సమీక్షిస్తూ జిల్లాలో 14 కోట్లతో కొత్తగా 9 ఉప కేంద్రాలు నిర్మించామని, మరో 5 కేంద్రాలు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. మిషన్ భగీరథ కింద మిగిలిపోయిన గ్రామాలకు మంచి నీటిని అందించుటకు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.
పంచాయత్ రాజ్ కింద చేపట్టిన వివిధ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల సమర్పణలో వివిధ అధికారుల సంతకాల ప్రక్రియను స్ట్రీమ్ లైన్ చేయాలని సూచించారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి అనుమతి లేకుండా నడుపుతున్న రెండు పరిశ్రమలను మూసి వేయించామని, నిబంధనలు పాటించని మరో 4 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని సభ్యులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. 131 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ళు అందించామని, ఇంకా అర్హులైన వారికి జీ.ఏం.ఆర్. ద్వారా అందించనున్నామని.. వివరాలు అందజేయవలసినదిగా కలెక్టర్ సూచించారు.
పలువురు సభ్యులు మాట్లాడుతూ.. నార్సింగిలోని పాత పీ.హెచ్.సీ పెచ్చులూడిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని తెలుపగా నూతనంగా నిర్మించిన ఆస్పత్రికి పూర్తిగా షిఫ్ట్ కావాల్సిందిగా డీ.ఏం.హెచ్.ఓ.కు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి సబ్సిడీ అందించాలని సభ్యులు కోరారు. ఓ.డీ.ఎఫ్ ప్లస్‌గా గుర్తింపు పొందుటకు ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ స్థంబాలు, లైన్లు వేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ప్రజల పక్షాన ఉన్న ప్రజాప్రతినిధులకు గ్రామాల్లో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆహ్వానం అందడంలేదని, ఉన్నతాధికారులు వచ్చినా తెలుపడం లేదని, ప్రోటోకాల్‌ను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఆవిర్భవించి ఈరోజుకు 5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా సస్యశామలంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కలెక్టర్‌లు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, జిల్లా పరిషత్ ముఖ్య అధికారి శైలేష్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డుమ్మా..
మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేలు, పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, రఘునందన్ రావ్, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. ఇది ఇలా ఉండగా ఎంపీపీ, జడ్పీటీసీలు కూడా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో సభలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి.