భార్య చనిపోయిన ఐదురోజులకే.. మిల్కా సింగ్ తుదిశ్వాస
దిశ, స్పోర్ట్స్: భారత క్రీడా రంగంలో అత్యంత సుపరిచితమైన మిల్కా సింగ్ (91) ఇక లేరు. భారత పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిక్‌గా ముద్దుగా పిలుచుకునే మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి కరోనాతో కన్నుమూశారు. ‘మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి 11.30 గంటలకు మృతి చెందారని తెలియజేయడానికి చాలా విచారిస్తున్నాము. ఆయన కరోనాతో చాలా పోరాడారు. కానీ దేవునికి వేరే ఆలోచనలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో సాధించిన చాంపియన్, నిజమైన ప్రేమ అందించిన మా నాన్న.. అమ్మ […]
దిశ, స్పోర్ట్స్: భారత క్రీడా రంగంలో అత్యంత సుపరిచితమైన మిల్కా సింగ్ (91) ఇక లేరు. భారత పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిక్‌గా ముద్దుగా పిలుచుకునే మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి కరోనాతో కన్నుమూశారు. ‘మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి 11.30 గంటలకు మృతి చెందారని తెలియజేయడానికి చాలా విచారిస్తున్నాము. ఆయన కరోనాతో చాలా పోరాడారు. కానీ దేవునికి వేరే ఆలోచనలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో సాధించిన చాంపియన్, నిజమైన ప్రేమ అందించిన మా నాన్న.. అమ్మ చనిపోయిన 5 రోజులకే వెళ్లిపోయారు’ అని మిల్కా కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. మే 20న మిల్కా సింగ్‌కు కోవిడ్ సోకడంతో చండీఘర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆసుపత్రిలో చేర్చారు. జూన్ 3న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఐసీయూకి మార్చారు. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత బుధవారం మిల్కా సింగ్ నెగెటివ్‌గా నిర్దారణ అయ్యారు. అయితే కోవిడ్ అనంతరం కాంప్లికేషన్స్ కారణంగా శుక్రవారం రాత్రి మరణించారు. అయితే ఐదు రోజుల క్రితం మిల్కాసింగ్ భార్య నిర్మల కూడా కోవిడ్ కారణంగా అదే ఆసుపత్రిలో చనిపోయారు. భార్య భర్తలు ఇద్దరు ఒకే వారంలో మృతి చెందడం వారి కుటుంబంలోనే కాకుండా అభిమానుల్లో కూడా విషాదాన్ని నింపింది.
1929 నవంబర్ 20న పంజాబ్‌లోని గోవింద్‌పూర్‌లో జన్మించారు. ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న సమయంలో స్ప్రింటర్‌గా కెరీర్ మలుచుకున్నాడు. ఆసియన్, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున స్వర్ణ పతకాలు గెలిచిన ఏకైక అథ్లెట్ మిల్కాసింగ్. 1958, 1962 ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలిచారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మిల్కాసింగ్ అక్కడ పతకాలు గెలవకపోయినా.. చార్లెస్ జెన్కిన్స్‌ను కలుసుకున్నాడు. పరుగులో ప్రపంచ చాంపియన్ అయిన చార్లెస్ నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు సంబంధించిన మెలకువలు, శిక్షణా విధానాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాతే మిల్కా పతకాల వేట ప్రారంభమయ్యింది. ఒక కామన్వెల్త్ స్వర్ణం, నాలుగు ఆసియా స్వర్ణాలు, రెండు జాతీయ స్వర్ణ పతకాలు మిల్కా ఖాతాలో ఉన్నాయి. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో (1958) స్వర్ణపతకం గెలిచిన తొలి స్ప్రింటర్‌గా రికార్డు సృష్టించాడు. 1959లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బాలీవుడ్‌లో ఫర్హాన్ అక్తర్ హీరోగా ‘భాగ్ మిల్కా భాగ్’ అనే సినిమా వచ్చింది. ఇది మిల్కాసింగ్ బయోపిక్.