రోజూ కన్నీళ్లతో ఎదురుచూస్తున్నాం..
దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద ఉన్న అడ్డా మాయమైంది. దీంతో అడ్డా కూలీల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఆ అడ్డా నిత్యం వందలాది మంది కూలీలకు జీవనోపాధిని చూయిస్తది. కానీ, ఇప్పుడు అక్కడెవరూ కనిపించడంలేదు. విషయమేమిటంటే.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి ఇక్కడికి వలస వచ్చిన కూలీలకు నెహ్రూ పార్క్ వద్ద ఓ స్థలం అడ్డాగా ఉండేది. నిజామాబాద్ నగరంతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు […]
దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద ఉన్న అడ్డా మాయమైంది. దీంతో అడ్డా కూలీల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఆ అడ్డా నిత్యం వందలాది మంది కూలీలకు జీవనోపాధిని చూయిస్తది. కానీ, ఇప్పుడు అక్కడెవరూ కనిపించడంలేదు. విషయమేమిటంటే.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి ఇక్కడికి వలస వచ్చిన కూలీలకు నెహ్రూ పార్క్ వద్ద ఓ స్థలం అడ్డాగా ఉండేది. నిజామాబాద్ నగరంతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు అవసరమైన కూలీ పనులకు ఈ అడ్డా నుంచే వారు అందుబాటులో ఉండేవారు. తాపీ పని, పెయింటింగ్, మట్టి, ఇసుక, ఇటుక మోసేవారు ఇలా చాలా మంది కూలీలు ఇక్కడి నుంచే నగరంలో ఎక్కడ అవసరం ఉన్నా అక్కడికి తరలివెళ్లేవారు. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తేనే పూట గడిచే ఆ కూలీలకు ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా కారణంగా కార్మిక శాఖతో పాటు పోలీస్ శాఖ అధికారులు అడ్డాలపై గుంపులుగా ఉండవద్దని ఆ అడ్డాను మూసివేశారు. నాటి నుంచి వీరికి ఉపాధి కరువైంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నగరంలో ఉంటున్న ఈ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు లేక, చేతిలో పైసలు లేక పస్తుంటున్నారు. అంతేకాదు వారికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. వారు బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆడిటోరియం, బోధన్ బస్టాండ్, నిరాశ్రయుల కేంద్రాల్లో అప్పటి వరకు ఉన్న ఆశ్రయం కూడా లేకాండా పోయింది. దీంతో వారు ఆకలితో అలమటిస్తూ రోడ్లపై వచ్చిపోయే వారిని యాచించే పరిస్థితి నెలకొన్నది.
కొద్ది మందికే పరిమితమైంది..
అడ్డా కార్మికులను అసంఘటిత కార్మికులుగా కార్మిక శాఖ గుర్తించి సహాయం చేసేందుకు చర్యలు తీసుకున్నా కేవలం రిజిష్ట్రేషన్ కలిగిన కార్మికులకు మాత్రమే అది వర్తించడంతో మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో తాత్కాలికంగా వసతి, భోజన ఏర్పాటు చేసినా అది కొద్ది మందికే పరిమితమైంది. మున్సిపల్ పరిధిలోని కూలీలకు కొద్దిగా ఉపశమనం కలిగించినా మిగిలిన వారికి ఫుట్ పాతే ఆశ్రయాన్ని ఇస్తోన్నది. నగరంలోని ప్రధాన రహదారులైన బోధన్ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, స్టేషన్ రోడ్డులోని ఫుట్ పాత్ లే వారికి నీడనిచ్చే ప్రాంతాలుగా మారాయి. స్వచ్చంద సంస్థలు, దాతలు ఇచ్చిన భోజనంతో కడుపునింపుకుంటున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం ఏ స్వచ్చంద సంస్థ, దాతలు అన్నదానం చేస్తారోనని ఆ అడ్డా కూలీలు ఎదురుచూసే పరిస్థితి నెలకొన్నది.
చెట్లు, భవనాల నీడలో..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రంలో కూలీల సంఖ్య, అనాథల సంఖ్య పెరుగడంతో వారికి ఎక్కడ వసతి కల్పించాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. నగరంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న నిరాశ్రయుల కేంద్రంలో స్థాయికి మించిన వారు ఉండడంతో అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కేవలం భోజన సదుపాయాలకు మాత్రమే పరిమితమైంది. అక్కడ వారు భోజనాలు చేసిన తర్వాత చెట్ల నీడన, భవనాల నీడలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అడ్డాపై కూలీనాలీ చేసుకుని కుటుంబానికి ఆసరా అవుదామని సొంతూర్లను వదిలి వచ్చిన వారికి కరోనా కన్నీళ్లను తెప్పిస్తోన్నది. అటు చేసేందుకు పని లేక ఇటు ఉండేందుకు నీడ లేక అడ్డా కూలీలు అల్లాడుతున్నారు. కరోనా సంగతి అటుంచి జ్వరమో, దగ్గో, జలుబో వచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడ గోలి బిళ్లలతో సరిపెడుతూ పంపిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
tags: Nizamabad, Migrant laborers, Corona Effect, Bodhan, Government Hospital