ఆశ్చర్యం.. తల్లి గర్భంలో ప్లాస్టిక్
దిశ, వెబ్‌డెస్క్: ప్లాస్టిక్..మానవుడి దైనందిన జీవితంతో పెనవేసుకుపోయింది. పెనుభూతంలా మారి కరోనా కంటే ముందు నుంచే మానవాళిని పీడిస్తోంది. ఎవరెస్ట్ అంచుల్లో, సముద్ర గర్భంలో, పాతాళంలో, పవిత్ర నదులు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఇప్పుడు ఏకంగా పుట్టబోయే శిశువుల గర్భస్థ మావి/మాయలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉండటం వైద్యులను, సైంటిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది. రోమ్ నగరంలో గర్భిణుల మాయలో మైక్రోప్లాస్టిక్ కణాలు కనిపించాయని, ఇలా కణాలు మావిలో ఉండటం ఇదే తొలిసారి అని ఇటాలియన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్లాస్టిక్..మానవుడి దైనందిన జీవితంతో పెనవేసుకుపోయింది. పెనుభూతంలా మారి కరోనా కంటే ముందు నుంచే మానవాళిని పీడిస్తోంది. ఎవరెస్ట్ అంచుల్లో, సముద్ర గర్భంలో, పాతాళంలో, పవిత్ర నదులు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఇప్పుడు ఏకంగా పుట్టబోయే శిశువుల గర్భస్థ మావి/మాయలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉండటం వైద్యులను, సైంటిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది. రోమ్ నగరంలో గర్భిణుల మాయలో మైక్రోప్లాస్టిక్ కణాలు కనిపించాయని, ఇలా కణాలు మావిలో ఉండటం ఇదే తొలిసారి అని ఇటాలియన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కణాల వల్ల ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం పడుతుందో తెలియదు. కానీ, పిండాలకు మాత్రం దీర్ఘకాలిక నష్టం కలిగించే అవకాశమున్నట్లు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
మైక్రోప్లాస్టిక్స్ అతి సూక్ష్మమైనవి కావడంతో రక్తప్రవాహం ద్వారా ఇది సులువుగా శరీరంలోని వివిధ భాగాలకు చేరుకోగలవు. ప్లాసెంటాలోకి కూడా ఇదే విధంగా ప్రవేశించి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. వీటి వల్ల శిశువు అనేక దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ప్యాకేజింగ్, పెయింట్స్, కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్ వంటి వాటి ద్వారా ఇవి గర్భిణుల శరీరంలోకి ప్రవేశించే అవకాశముందని, మొత్తం నలుగురు మహిళల్లో ఇవి బయటపడగా, వారికి పుట్టిన బిడ్డలు మాత్రం అందరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్య బృందం వెల్లడించింది.
గర్భస్థశిశువు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే ప్లాసెంటాలో ప్లాస్టిక్ ఉండటం చాలా ఆందోళన కలిగించే విషయమని, మైక్రోప్లాస్టిక్స్ పుట్టిన బిడ్డల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపించే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడ్డారు. పిండాలపై మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం పడితే పిండం పెరుగుదల తగ్గుతుందని, ఈ విషయాలను మరింత లోతుగా తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. కొంతమంది తల్లుల మావిలో మాత్రం ఈ తరహా కణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు.