మేయర్ పీఠాన్ని డిసైడ్ చేసేది ఈ ఓట్లే..
దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా పీఠం ఎవరికి దక్కుతుంది? ఎన్ని డివిజన్లు గెలిస్తే మేయర్ కుర్చీ వశమవుతుంది? అంటూ చర్చ నడుస్తోంది. గతంలో కంటే సగం మంది గెలిచినా టీఆర్ఎస్ పార్టీకే ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య అత్యధికంగా ఆ పార్టీకే ఉన్నారు. అందుకే ఎన్నికల్లో అప్పుడే సగం గెలిచేసిందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులకూ […]
దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా పీఠం ఎవరికి దక్కుతుంది? ఎన్ని డివిజన్లు గెలిస్తే మేయర్ కుర్చీ వశమవుతుంది? అంటూ చర్చ నడుస్తోంది. గతంలో కంటే సగం మంది గెలిచినా టీఆర్ఎస్ పార్టీకే ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య అత్యధికంగా ఆ పార్టీకే ఉన్నారు. అందుకే ఎన్నికల్లో అప్పుడే సగం గెలిచేసిందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులకూ మున్సిపల్ చట్టం ద్వారా ఓట్లేసే హక్కులు కల్పించారు. అందుకే బల్దియా కుర్చీ కూడా వాటి మీదనే ఆధారపడి ఉంది. అయితే అందరూ అనుకున్నట్లుగా టీఆర్ఎస్ పార్టీకి ఈజీ కాదు. ఇప్పటికే సగం మంది ప్రజాప్రతినిధులు వారి ఎక్స్అఫిషియో అధికారాన్ని వినియోగించుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్నట్లుగా బరిలో నిలిచాయి. మేయర్, చైర్మన్ ఎన్నికకు సభ్యుల సంఖ్య తక్కువైన ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్స్అఫిషియో సభ్యులుగా నమోదు చేయించుకున్నారు. ప్రాంతంతో సంబంధం లేకుండానే అక్కడ వారి ఓటు హక్కు వినియోగం ద్వారానే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. వారందరికీ బల్దియా మేయర్ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఉండదు. ఎన్నికల్లో సరైన మెజార్టీ రాకపోతే కొత్తగా ఎక్స్అఫిషియో సభ్యులను వెతుక్కోవాల్సిందే. కొత్తగా ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారందరినీ బల్దియాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. అయితే బల్దియా ఎన్నికల ఫలితాల తర్వాత, మేయర్ ఎన్నికకు మధ్యలో నమోదయ్యే ఎక్స్అఫిషియోల సంఖ్యనే మ్యాజిక్ ఫిగర్‌ను నిర్ధారించనుంది.
మెజార్టీ వచ్చినా.. అంతే
బల్దియా ఎన్నికల్లో ఒకవేళ తక్కువ సీట్లు గెలుచుకుంటే ఎక్స్అఫిషియో సభ్యులే సూత్రధారులు. అందరేమో టీఆర్ఎస్ పార్టీకి 35 మంది అదనంగా ఉన్నారంటూ లెక్కలు వేస్తున్నారు. అయితే వారిలో సగం మంది నగర శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరలోనే ఉన్నారంటూ చేస్తోన్న ప్రచారం నిజం కాదని దీన్ని బట్టి తెలుస్తోంది. నగర శివార్లలోని ప్రజాప్రతినిధులే కాదు.. పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారన్న విషయాన్ని చాలా మంది పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇక మ్యాజిక్ ఫిగర్ 76కు కేవలం సొంతంగా టీఆర్ఎస్ దక్కించుకోవడం ఈజీ కాదని లెక్కలు చెబుతున్నాయి.
జాతకాన్ని మార్చే విధానం
ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అప్పుడే చాలా మంది ప్రజాప్రతినిధులు ఎక్స్అఫిషియో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లు దక్కించుకోవడానికి ఆ ప్రాంతంతో సంబంధం లేని వాళ్లతో ఎక్స్అఫిషియో ఓట్లు వేయించారు. దాంతో కాంగ్రెస్, బీజేపీలకు కొన్ని చోట్ల అత్యధిక సభ్యులు ఉన్నప్పటికీ మేయర్, చైర్మన్ పీఠాలు దక్కలేదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 104 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 8 కాంగ్రెస్, మూడు బీజేపీ, రెండు ఎంఐఎం పార్టీలు దక్కించుకున్నాయి.
ఒక్కసారే ఓటు
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో 150 మంది కార్పొరేటర్లతో పాటు పేర్లు నమోదు చేసుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు అవకాశం ఉంది. అయితే ఓ సారి ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి మళ్లీ అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే మనుగడలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓ సారి ఎక్స్ అఫిషియో ఓటు వేసిన వారికి బల్దియాలో వినియోగించుకునే అవకాశం లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్స్అఫిషియో ఓట్ల సంఖ్య సగానికి పడిపోతుంది. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్నింట్లో కాంగ్రెస్, బీజేపీలు సగానికి పైగా సభ్యులు ఎన్నికయ్యారు. అక్కడ ఆ పార్టీకి కుర్చీలు దక్కొద్దని టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేని ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపింది.
టీఆర్ఎస్ అదృష్టం
- తుక్కుగూడ మున్సిపాలిటీలో అప్పటి ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, మంత్రి సబితారెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేయించుకున్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్లే అక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మెజార్టీ స్థానాలు బీజేపీకి ఉన్నప్పటికీ టీఆర్ఎస్‌కు చైర్మన్ పీఠం దక్కింది.
- ఆదిభట్లలోనూ టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌లు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దాంతో టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ కుర్చీలో కూర్చోగలిగారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు లభించాయి.
- పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, మహేందర్ రెడ్డిలు ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ చైర్మన్ పీఠం టీఆర్ఎస్‌కు దక్కింది. అక్కడా కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఎక్కువ.
- నార్సింగి మున్సిపాలిటీలోనూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డిలు ఎక్స్అఫిషియో మెంబర్లుగా నమోదు చేయించుకొని ఓట్లు వేశారు. లేకపోతే ఆ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీదే.
- బోడుప్పల్ మున్సిపాలిటీలోనూ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేశారు. అక్కడే ఎంపీ రేవంత్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థే చైర్మన్ అయ్యారు.
- కొంపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వివేకానంద ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉన్నారు. దాని వల్లనే టీఆర్ఎస్‌కు ఆ మున్సిపాలిటీ పీఠం దక్కింది.