మారిషస్ ఆయిల్ స్పిల్.. మహా డేంజరస్
సముద్రాల మీదుగా చమురును మోసుకెళ్తున్న పెద్ద పెద్ద ఓడలకు ప్రమాదాలు జరిగి ఆయిల్ సముద్రపు నీటిలో కలవడం సాధారణమే. కానీ మారిషస్‌లో ఇటీవల జపాన్‌కు చెందిన షిప్ నుంచి విడుదలవుతున్న ఆయిల్ వల్ల భారీ ప్రమాదం పొంచి ఉంది. ఇంతకంటే పెద్ద ముడిచమురు లీక్ సంఘటనలు గతంలో బాగానే జరిగాయి. కానీ వాటితో పోలిస్తే ఈ మారిషస్ ఆయిల్ స్పిల్ ఘటన ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ మొత్తంలో ఉండనుంది. ఎందుకంటే ఇది రెండు ప్రధాన మెరైన్ […]
సముద్రాల మీదుగా చమురును మోసుకెళ్తున్న పెద్ద పెద్ద ఓడలకు ప్రమాదాలు జరిగి ఆయిల్ సముద్రపు నీటిలో కలవడం సాధారణమే. కానీ మారిషస్‌లో ఇటీవల జపాన్‌కు చెందిన షిప్ నుంచి విడుదలవుతున్న ఆయిల్ వల్ల భారీ ప్రమాదం పొంచి ఉంది. ఇంతకంటే పెద్ద ముడిచమురు లీక్ సంఘటనలు గతంలో బాగానే జరిగాయి. కానీ వాటితో పోలిస్తే ఈ మారిషస్ ఆయిల్ స్పిల్ ఘటన ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ మొత్తంలో ఉండనుంది. ఎందుకంటే ఇది రెండు ప్రధాన మెరైన్ జీవావరణాలు, ఒక బ్లూ బే మెరైన్ పార్క్ రిజర్వ్‌ల మధ్య జరిగింది. కాబట్టి ఇది కలిగించబోయే నష్టానికి ప్రమాదం జరిగిన స్థలమే ప్రధాన పాత్ర పోషించబోతోంది.
మారిషస్‌లోని మాహేబోర్గ్ వద్ద ఉన్న బ్లూ లగూన్.. సినిమాలు తీయడానికి మంచి లొకేషన్. ఇప్పుడు ‘ఎంవీ వకాషియో షిప్’ కారణంగా అక్కడంతా చమురుమయం అయిపోయింది. గత జులైలో ఈ షిప్ పాయింటె దె ఎన్సీకి వచ్చింది. గత గురువారం నుంచి ఈ షిప్ నుంచి చమురు లీక్ అవుతోంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇలె-అక్స్-ఐగ్రేటే వరకు ఈ చమురు లీకేజీ వ్యాపించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఓడ నుంచి 1000 టన్నులకు పైగా ఇంధనం లీకైనట్లు తెలుస్తోంది. దీన్ని శుభ్రం చేయడానికి స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆపరేషన్ చేపడుతున్నారు. వెంట్రుకల ఉండలు, పెద్ద పెద్ద వస్త్రాల పట్టీలు ఉపయోగించి చమురు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా మారిషస్ ప్రభుత్వం గుర్తించింది.
బయోవర్సిటీ నాశనం
మారిషస్‌లో ఒక ప్రత్యేకమైన జీవివైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చమురు లీక్ అవుతున్న ప్రాంతంలో ఎన్నో సముద్ర జీవులు, మాంగ్రూవ్‌లు సమన్వయంగా జీవిస్తున్నాయి. ఈ సంఘటన వల్ల ఇవన్నీ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని బ్రింగ్టన్ యూనివర్సిటీకి చెందిన మెరైన్ బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కొరినా సియోకాన్ అంటున్నారు. లీక్ అయిన నూనె సముద్రం మీద తేలియాడుతూ లోపలి ప్రాణులకు సూర్యరశ్మిని, ఆక్సిజన్‌ను అందకుండా చేయడం ఒక ఎత్తయితే, చమురులోని కొన్ని పదార్థాలు సముద్రపు నీటిలో కరిగి అడుగున భూస్వరూపాలను మార్చే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఇది జీవావరణాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని కొరినా వివరించారు. ఈ సంఘటన వల్ల మారిషస్ మెరైన్ జీవావరణంలో ఉన్న 1700 జాతులు దెబ్బతినబోతున్నాయి. వీటిలో 800 రకాల చేపలు, 17 రకాల నీటి క్షీరదాలు, రెండు రకాల తాబేళ్ల జాతులు అత్యంత ఎక్కువ ప్రమాదానికి గురికాబోతున్నాయని సియోకాన్ తెలిపారు.
కోరల్ బ్లీచింగ్
ఈ లగూన్‌లో పెద్ద మొత్తంలో ఉన్న పగడపు దిబ్బల మీద ఈ చమురు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుంది. చమురులో ఉన్న విషపూరిత హైడ్రోకార్బన్‌లు కోరల్ రీఫ్స్‌కు హాని కలిగించడంతో అవి నెమ్మదిగా చనిపోతాయి. సముద్రాలకు రెయిన్‌ఫారెస్టులుగా పరిగణించే కోరల్ రీఫ్స్, ఆయిల్ స్పిల్ కారణంగా బ్లీచ్‌కు గురవుతాయి. మొత్తం సముద్రంలో ఉన్న చేపల్లో 25 శాతం చేపలకు వీటి నుంచే ఆహారం దొరుకుతుంది. తీరప్రాంతాల్లో తుఫానులు రాకుండా, మట్టి కొట్టుకుని పోకుండా ఈ కోరల్ రీఫ్స్ కాపాడతాయి. అంతేకాకుండా టూరిజం ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నడుపుకునే మారిషస్ దేశంలో ఇప్పుడు ఈ కోరల్ రీఫ్స్ బ్లీచ్ అయితే ఆర్థికంగా సంక్షోభం రావొచ్చు.