ఈ-కామర్స్ రంగంలో భారీగా పెరిగిన ఉద్యోగాలు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ-కామర్స్ మార్కెట్ భారీగా పుంజుకుంది. పెరిగిన డిమాండ్ కారణంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిగాయి. పండుగ సీజన్ అమ్మకాల కోసం సుమారు 2.5 నుంచి 3 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడ్డాయని టీమ్‌లీజ్ సంస్థ వెల్లడించింది. మే నెల నుంచి దీపావళి వరకు ఈ-కామర్స్ దిగ్గజ అమెజాన్ ఇండియా, ఇతర లాజిస్టిక్ సంస్థల్లో ఈ నియామకాలు జరిగాయని నివేదిక తెలిపింది. ఈ నియామకాలు గతేడాదితో పోలిస్తే 30-40 శాతం […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ-కామర్స్ మార్కెట్ భారీగా పుంజుకుంది. పెరిగిన డిమాండ్ కారణంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిగాయి. పండుగ సీజన్ అమ్మకాల కోసం సుమారు 2.5 నుంచి 3 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడ్డాయని టీమ్‌లీజ్ సంస్థ వెల్లడించింది. మే నెల నుంచి దీపావళి వరకు ఈ-కామర్స్ దిగ్గజ అమెజాన్ ఇండియా, ఇతర లాజిస్టిక్ సంస్థల్లో ఈ నియామకాలు జరిగాయని నివేదిక తెలిపింది. ఈ నియామకాలు గతేడాదితో పోలిస్తే 30-40 శాతం అధికమని పేర్కొంది.
లాక్డౌన్ సమయంలో ఈ-కామర్స్ నిర్వహణ దెబ్బతిన్నప్పటికీ, ఆన్లైన్ ద్వారా అవసరమైన వస్తువులను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. కస్టమర్లు సైతం ఇంటికే పరిమితమై, ఆన్లైన్ కొనుగోళ్లు చేయడంతో ఈ ఉద్యోగాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. టీమ్‌లీజ్ అంచనాల ప్రకారం, సాధారణ పండుగ సీజన్ సమయంలో నియమించే 15-20 శాతం ఉద్యోగాలు 2021లోనూ కొనసాగవచ్చని తెలిపింది.
సీజనల్ ఉద్యోగాలు సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు కొనసాగుతాయి. ప్రస్తుత నియామకాలు పరిస్థితులను బట్టి మరికొంత కాలం కొనసాగవచ్చని టీమ్‌లీజ్ పేర్కొంది. ఆన్లైన్ కొనుగోళ్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ-కామర్స్ రంగంలో స్థిరమైన నియామకాలు ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుందా ఈ-కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 25 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ పరిశోధనా సంస్థ ఫారెస్టర్ తెలిపింది. ప్రస్తుత ఏడాది ఈ-మార్కెట్ 7-8 శాతం వృద్ధితో రూ. 2.4 లక్షల కోట్లుగా ఉంది. 2019లో ఈ మార్కెట్ 2.2 లక్షల కోట్లుగా నమోదైంది.