మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ @ జగన్ మృతి.. అదే కారణమా..?
దిశ ప్రతినిధి, వరంగల్ : కరోనాతో వరుసగా మావోయిస్టులు మృత్యువాత పడుతుండటం దళాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత మధుకర్, కేంద్ర కమిటీలో పనిచేస్తున్న మహబూబాద్ జిల్లా గార్ల మండల కేంద్ర వాస్తవ్యుడైన మోహన్ రావు సైతం మరణించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో మరణించినట్లుగా సమాచారం అందుతోంది. కొద్దిరోజులుగా కోవిడ్‌తో […]
దిశ ప్రతినిధి, వరంగల్ : కరోనాతో వరుసగా మావోయిస్టులు మృత్యువాత పడుతుండటం దళాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత మధుకర్, కేంద్ర కమిటీలో పనిచేస్తున్న మహబూబాద్ జిల్లా గార్ల మండల కేంద్ర వాస్తవ్యుడైన మోహన్ రావు సైతం మరణించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో మరణించినట్లుగా సమాచారం అందుతోంది. కొద్దిరోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన బస్తర్ జిల్లాలోని దంతేవాడ ప్రాంతంలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. మరి కొద్ది గంటల్లో పూర్తి వివరాలు బస్తర్ పోలీస్ లు అధికారికంగా వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ విషయమై హరి భూషణ్ కుటుంబ సభ్యులను ఆరా తీయగా తమకు సమాచారం లేదని చెబుతుండడం గమనార్హం. మహబూబాద్ జిల్లా పోలీసులు సైతం హరి భూషణ్ మృతిని ధ్రువీకరించడం లేదు. ఇటు మావోయిస్టు పార్టీ సైతం అధికారిక ప్రకటన చేయలేదు.
చదువుకుంటూనే ఉద్యమంలోకి..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలకేంద్రం యాప నారాయణ స్వస్థలం. నర్సంపేటలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా పనిచేసిన యాప నారాయణ అలియాస్ హరి భూషణ్ మావోయిస్టు కార్యకలాపాలకు ఆకర్షితుడై పార్టీ లో చేరాడు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. పలు ఎన్‌కౌంటర్లలో హరి భూషణ్ త్రుటిలో తప్పించుకున్నాడు. తెలంగాణ పోలీసులకు, స్పెషల్ పార్టీ బలగాలకు యాప నారాయణ కొరకరాని కొయ్యలా మారాడు.