క్రికెట్‌కు బలైన ఆటగాళ్లు ఎందరో..!
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన రసవత్తర క్రీడ. ఈ ఆటనే వృత్తిగా ఎంచుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అత్యున్నత శిఖరాలకు చేర్చింది. నిరుపేదను కూడా కోటిశ్వరుడిని చేసింది. గల్లీ నుంచి గ్లోబల్ వరకు ఎంతోమందిని ఆకర్శితులను చేసిన ఈ ఆట ఇంగ్లాండ్‌లో పుట్టిన సంగతి తెలిసిందే. కానీ, పుట్టినింట్లో క్రికెట్ నింపిన విషాదం ఎంతమందికి తెలుసు..? కేవలం నాలుగేండ్లకు వచ్చే ప్రపంచ కప్, ఏడాదికోసారి జరిగే టీ-20లు, […]
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన రసవత్తర క్రీడ. ఈ ఆటనే వృత్తిగా ఎంచుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అత్యున్నత శిఖరాలకు చేర్చింది. నిరుపేదను కూడా కోటిశ్వరుడిని చేసింది. గల్లీ నుంచి గ్లోబల్ వరకు ఎంతోమందిని ఆకర్శితులను చేసిన ఈ ఆట ఇంగ్లాండ్‌లో పుట్టిన సంగతి తెలిసిందే. కానీ, పుట్టినింట్లో క్రికెట్ నింపిన విషాదం ఎంతమందికి తెలుసు..? కేవలం నాలుగేండ్లకు వచ్చే ప్రపంచ కప్, ఏడాదికోసారి జరిగే టీ-20లు, టెస్టు మ్యాచ్‌లు అందరికీ తెలిసినవే కానీ.. ఇదే ఆటను ఎంచుకున్న పలువురు క్రికెటర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మైదానంలో ఆడుతున్న సమయంలో కుప్పకూలి.. బ్యాట్, బంతి దెబ్బలకు బలైపోయారు. ముఖ్యంగా క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్‌లోనే ఇటువంటి విషాదాలు ఎక్కువగా వెలుగుచూశాయి.
క్రికెట్ ఆడుతూ మరణించిన వారు..:
1. జార్జ్ సమ్మర్స్ (25) ఇంగ్లాండ్, 1870
యావత్ ప్రపంచం గుర్తించని క్రికెటర్లు ఎంతోమంది మైదానంలోనే కన్నుమూసినా.. పలువురు ప్రముఖ ఆటగాళ్లు మైదానంలోనే తుది శ్వాస వీడారు. ఇందులో ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్ సమ్మర్స్ ఒకడు. ఇతడు రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. తన 25వ ఏట లార్డ్స్ మైదానంలో నాటింగ్‌హామ్ షైర్ తరఫున.. MCCతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న సమయంలో.. ఫాస్ట్ బౌలర్ జాన్ ప్లాట్స్ వేసిన షార్ట్ డెలివరీతో బంతిని ఆడబోయాడు. ఇదే సమయంలో బంతి బలంగా తాకడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మైదానం వీడాడు. బంతి గాయాన్ని ఓర్చుకున్న జార్జ్ సమ్మర్స్ చికిత్స మాత్రం చేయించుకోలేదు. ఆ తర్వాత నేరుగా నాటింగ్‌హమ్‌లోని తన ఇంటికెళ్లాడు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత కన్నుమూశాడు. అయితే, బంతి తలకు బలంగా తాకడంతోనే జార్జ్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కాగా, 1844 జూన్ 21న జన్మించిన ఇతడు.. 1870లో జూన్ 19వ తేదిన తన 25వ ఏట కన్నుమూయడం బాధాకరం. ఒక మంచి బ్యాట్స్‌మెన్‌ను తమ జట్టు కోల్పోయిందని నాటింగ్‌హామ్ షైర్ టీమ్ కన్నీరుమున్నీరైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 32 మ్యాచులు ఆడిన సమ్మర్స్.. 922 పరుగులు చేశాడు.. అందులో ఒక హాఫ్ సెంచరీతో అత్యధికంగా 57 పరుగులు చేశాడు.
2. ఆండ్రూ డుకాట్ (56) ఇంగ్లాండ్, 1942
ఆండ్రూ డుకాట్.. ఇంగ్లాండ్ జట్టు తరఫున మొత్తం ఒక టెస్టు మ్యాచ్, 429 ఫస్ట్ క్లాస్ మ్యాచుల సుధీర్ఘమైన ఆటతో పరుగుల వరద పారించాడు. అన్ని మ్యాచుల్లో కలిపి 23,373 పరుగులు తీసిన ఇతడు 52 సెంచరీలు, 109 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 306 నాటౌట్‌గా ఉండటం విశేషం. అటు బౌలింగ్‌లో అప్పుడప్పడు మెరిసే ఆండ్రూ 21 వికెట్లు తీసుకొని.. 3/12 బెస్ట్ బౌలింగ్ కూడా నమోదు చేశాడు. తన 56వ ఏటలో కూడా డుకాట్ క్రీడల్లో అత్యున్న ప్రదర్నన కనబర్చాడు. అయితే, జులై 23, 1942లో లార్డ్స్ గ్రౌండ్‌లో ఆట ఆడుతున్న మిడ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో డుకాట్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలి చనిపోయాడు. డుకాట్ మరణవార్త విన్న అభిమానులు, క్రికెటర్లు కొన్ని రోజుల పాటు విషాదంలో మిగిలిపోయారు. కాగా, డుకాట్ క్రికెట్‌లోనే కాకుండా ఫుట్ బాల్ మ్యాచుల్లో కూడా తనదైన ముద్ర వేసిన బహుముఖ ఆటగాడు.
3. అబ్దుల్ అజీజ్ (18) పాకిస్తాన్, 1959
పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్ అజీత్ తన 18 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో భాగంగా కరాచీ తరఫున ఆడిన ఈ ఆటగాడు మొత్తం 8 మ్యాచుల్లో 149 పరుగులు చేశాడు. ఇదే సమయంలో 1959లో ఓ మ్యాచ్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన అబ్దుల్.. బంతి వేగంగా వచ్చి ఛాతి భాగంలో తాకడంతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి పోయాడు. దీంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించేసరికి కన్నుమూశాడు.
4. విల్ఫ్ స్లాక్ (34) ఇంగ్లాండ్, 1989
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ విల్ఫ్ స్లాక్ మరణం మిస్టరీగా మిగిలింది. పలుసార్లు క్రికెట్ ఆడుతూ స్పృహ కోల్పోయిన అతడికి.. అదే వ్యాధి ప్రాణాలను తీసుకుంది. కానీ, మరణానికి సరైన కారణం వైద్యుల పరీక్షల్లో కూడా తేలకపోవడం గమనార్హం. 1989 జనవరి 15న గాంబియాలో డోమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సమయంలో స్పృహ కోల్పోయాడు. దీంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అతడు మరణించాడు. అయితే, వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అతడి మరణానికి సరైనా కారణాలు నిర్ధారణ కాలేదని చెప్పడం గమనార్హం.
5. ఇయాన్ ఫోలే (30) ఇంగ్లాండ్, 1993
ఇంగ్లాండ్‌కు చెందిన మరో ఆటగాడు ఇయాన్ ఫోలే కూడా మైదానంలో గాయపడి కన్నుమూశాడు. 1982 నుంచి ఇంగ్లాండ్ తరఫున రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్‌తో మ్యాచులు ఆడిన ఇతడు.. ఓ మ్యాచ్‌లో భాగంగా ఎడమ చేతికి గాయం అయింది. దీంతో దాదాపు రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న ఫోలే మళ్లీ బ్యాక్ టు క్రికెట్ అంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే వైట్‌హావెన్ తరఫున వర్కింగ్‌టన్‌తో తలపడుతున్న సమయంలో బ్యాటింగ్‌కు దిగాడు. బ్యాటింగ్ చేస్తుండగా.. బౌలర్ వేసిన బంతి నేరుగా కంటి కింద భాగంలో తగిలింది. గాయంతో మైదానంలోనే విలవిలలాడిని ఫోలేను జట్టు సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స అందిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
6. రామణ్ లాంబా (38) ఇండియా, 1998
టీమిండియాకు చెందిన రామణ్ లాంబా కూడా క్రికెట్ ప్రయాణంలోనే మరణించాడు. భారత్ తరఫున 4 టెస్టు మ్యాచులు, 32 వన్డే మ్యాచులు, 121 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన లాంబా టెస్టుల్లో 102, వన్డేల్లో 783, ఎఫ్సీలో 8776 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లాడు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో బంతి బలంగా తగలడంతో గాయపడ్డాడు. ఇదే గాయంతో రెండు, మూడు రోజుల పాటు కోమాలో ఉన్న లాంబా చివరకు 1998, ఫిబ్రవరి 22న మరణించాడు.
ఆటలో బలైన మరెందరో క్రికెటర్లు..
ఇలా క్రికెట్ ఆడుతూ మరణించిన వారిలో… వసీం రాజా (54) పాకిస్తాన్, రిచర్డ్ బ్యూమాంట్ (33) ఇంగ్లాండ్, జుల్ఫికర్ భట్టి (22) , పాకిస్తాన్, డారిన్ రాండాల్ (32) దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ హ్యూస్ (25), కూడా ఉన్నారు. క్రికెట్‌తో ఆడుతున్న వారే కాదు ఒకానోక సమయంలో ఆంపైర్ కూడా చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 2009లో ఓ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన జెంకిన్స్ ఆంపైర్‌గా ఉన్నాడు. ఇదే సమయంలో ఒక ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా ఆయన తలకు తగిలింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆల్క్విన్ జెంకిన్స్ కుప్ప కూలిపోయాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఆటలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం బాధాకరం.