వివరాల సేకరణకు కొత్త కొత్త పేర్లు..

‘ధరణి సర్వే..’ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న మాట.. రాష్ట్రవ్యాప్తంగా ఇష్టారీతిన నడుస్తున్న ఈ ప్రక్రియపై ఇప్పడు ప్రజల్లో అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ధిష్టమైన ఆదేశాలేమీ జారీ చేయలేదు.. ఉద్యోగులకు ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు.. కొన్ని చోట్ల స్థలాలను కొలుస్తున్నారు.. ఇంకొన్ని చోట్ల నిర్మించిన స్లాబ్ ఏరియాకూ కొలతలేస్తున్నారు.. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రీతిన చేస్తున్నారు.. అయితే ఇప్పటి దాకా ప్రభుత్వం సహా అందరూ దీనిని ధరణి సర్వేగా పిలుస్తున్నారు.. […]

Update: 2020-10-04 20:53 GMT

‘ధరణి సర్వే..’ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న మాట.. రాష్ట్రవ్యాప్తంగా ఇష్టారీతిన నడుస్తున్న ఈ ప్రక్రియపై ఇప్పడు ప్రజల్లో అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ధిష్టమైన ఆదేశాలేమీ జారీ చేయలేదు.. ఉద్యోగులకు ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు.. కొన్ని చోట్ల స్థలాలను కొలుస్తున్నారు.. ఇంకొన్ని చోట్ల నిర్మించిన స్లాబ్ ఏరియాకూ కొలతలేస్తున్నారు.. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రీతిన చేస్తున్నారు.. అయితే ఇప్పటి దాకా ప్రభుత్వం సహా అందరూ దీనిని ధరణి సర్వేగా పిలుస్తున్నారు.. ఇక నుంచి సర్వే అనొద్దని.. ధరణి పోర్టల్లో వివరాల నమోదుగా చెప్పాలని పైనుంచి ఆదేశాలు కూడా అందాయట.. దీంట్లో ఏం కిటుకు ఉందో మరి..!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ‘ధరణి’ పోర్టల్ లో వ్యవసాయేత భూముల వివరాల నమోదు ప్రక్రియ మాత్రమే నడుస్తోంది. అయితే ఒక్కో జిల్లాలో ఒక్కో మాదిరిగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి దాకా ప్రభుత్వం సహా అందరూ ధరణి సర్వేగా పిలుస్తున్నారు. ఇక నుంచి ‘ధరణి సర్వే అనొద్దు. ధరణి పోర్టల్ లో నమోదుగా చెప్పాలి’.. అంటూ ఉన్నతాధికారులు సిబ్బందికి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వాట్సాప్ లో సమాచారాన్ని పంపారు. అయితే ఇప్పటి దాకా సిబ్బందికి పంపిణీ చేసిన అన్ని ఫారాల్లోనూ సర్వే అని పేర్కొనడం గమనార్హం.

అధికారులు కూడా ధరణి సర్వే అంటూనే చెప్పారు. ఇప్పుడేమో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలోనే సర్వే కాదంటూ మాట మార్చినట్లు తెలుస్తోంది. కేవలం ఆస్తుల వివరాల నమోదుగా పేర్కొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు మార్గదర్శకాలను రూపొందిస్తూ ఎవరికి వారు సర్క్యులర్లను జారీ చేస్తుండడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలేవీ ఉత్తర్వుల రూపంలో ఉండడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అన్నీ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా జిల్లా స్థాయి అధికారులకు చెబుతున్నారు. వాళ్లు కూడా అదే రీతిన నిబంధనలను, ఫార్మెట్లను తయారు చేస్తున్నారు. అందుకే సర్వే ఫార్మెట్లు విభిన్న రకాలుగా దర్శనమిస్తున్నాయి.

ప్రతి రోజూ.. ప్రతి ఒక్కరూ..

జీహెచ్ఎంసీ పరిధిలోనూ డిప్యూటీ కమిషనర్లు ఎవరికి వారు వారి పరిధిలోని బిల్ కలెక్టర్లకు నిబంధనలను జారీ చేస్తున్నారు. ధరణి పోర్టల్ యాప్ లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ డేటా బుక్(టీఎస్ ఎన్పీబీ) లో ఆస్తుల నమోదు కార్యక్రమానికి బృందాలను నియమించారు. ఉదయం 8 గంటలకు పనులు మొదలు పెట్టి వివరాల నమోదును చేపట్టాలన్నారు. ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ కనీసం 100 ఆస్తుల వివరాలను నమోదు చేయాలి. ప్రతి ఇంటిని సందర్శించాలి. ఎక్కడా ఒక్క పొరపాటు లేకుండా నమోదు చేయాలంటూ నిబంధనలను రూపొందించారు.

ఒకటి, రెండు రోజుల్లో అసాధ్యం..

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వే(నమోదు) కార్యక్రమం ఒకటీ రెండు రోజుల్లో పూర్తి చేయడం అసాధ్యం. ప్రతి ఇంటినీ సందర్శించి 40 నుంచి 50 ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవడం, పరిశీలించడం, ఆ తర్వాత యాప్ లో నమోదు చేయడం వంటి పనులకు కనీసం 30 నిమిషాలు పడుతుందని సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ 100 కనీసం పూర్తి చేయాలన్న నిబంధనతో సతమతమవుతున్నట్లు చెబుతున్నారు.

పబ్లిక్ డొమెయిన్లో పెట్టాలి..

ఇంటింటికీ వెళ్లి సేకరించిన ఆస్తుల వివరాలను నమోదు చేసేటప్పుడు అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. పైగా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలన్న షరతుల మధ్య సాగుతోన్న ప్రక్రియతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ‘దిశ’కు ఆదివారం వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలోనూ ఇదే తరహా ఉరుకులు, పరుగులు పెట్టించారు. అందుకే అనేక పొరపాట్లు దొర్లాయి. కంప్యూటర్లు, ఆపరేటర్లు చేసిన తప్పొప్పులకు యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్న ఉదంతాలు చాలా ఉన్నాయి.

ఇప్పుడూ అదే తీరును అనుసరిస్తుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ లో నమోదు చేసే ముందు పబ్లిక్ డొమెయిన్ లో కనీసం నెల రోజులు పాటు ఉంచి అభ్యంతరాలను స్వీకరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను ఆర్నెల్ల పాటు పొడిగించడం ద్వారానే పారదర్శకత, వాస్తవికత లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోయి త్వరగా పూర్తి చేయాలనుకోవడం వల్ల యజమానులు భవిష్యత్తుల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం సరైన పద్ధతిని అవలంబించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News