రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో 'లాక్ డౌన్'
దిశ, న్యూస్ బ్యూరో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి ‘లాక్ డౌన్’ పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఆదివారం ఉదయం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి కరోనాకు సంబంధించిన తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని భావించి ఆ […]
దిశ, న్యూస్ బ్యూరో
కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి ‘లాక్ డౌన్’ పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఆదివారం ఉదయం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి కరోనాకు సంబంధించిన తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని భావించి ఆ జిల్లాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పూర్తిగా బంద్ నిర్వహించాలని క్యాబినెట్ కార్యదర్శి ఆదేశించారు. ఆ ప్రకారం తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. జనతా కర్ఫ్యూ తరహాలోనే ఈ నెల 31 వరకూ అధికారిక కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ జిల్లాల్లో కరోనా లక్షణాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత లాక్ డౌన్ నిర్ణయం జరిగింది. ఈ ఐదు జిల్లాల్లో మొత్తం జనజీవనం ఈ నెల 31 వరకు స్థంభించిపోనుంది.
దేశవ్యాప్తంగా ప్రకటించిన 75 జిల్లాల్లో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని క్యాబినెట్ కార్యదర్శి ఆదేశించారు. ఆ ప్రకారం ఈ జిల్లాల్లోని బస్సు, రైలు, ఎఎంటీఎస్, మెట్రో, సబర్బన్ తదితర అన్ని రకాల ప్రజా రవాణా సర్వీసులు ఈ నెల 31వ తేదీ వరకు నిలిచిపోనున్నాయి. సినిమాహాళ్లు, ఫంక్షన్ హాళ్ళు, మ్యూజియంలు, పర్యాటక ప్రాంతాలు, సాంస్కృతిక సమావేశ మందిరాలు, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్… ఇలా జనం గుమికూడే వాణిజ్య సముదాయాలన్నీ మూసివేయాల్సి ఉంటుంది. పాలు, కూరగాయలు, వైద్యం, మెడికల్ షాపులు తదితర అత్యవసర సేవలను మాత్రం ఈ ‘లాక్ డౌన్’ నుంచి మినహాయిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్యాసింజరు రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో నిలిచిపోతున్నప్పటికీ గూడ్సు రైళ్ళు మాత్రం యధావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఒక్క రోజు ‘జనతా కర్ఫ్యూ’ కారణంగానే జనజీవనం పూర్తిస్థాయిలో స్తంభించిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు పూర్తి స్థాయిలో ప్రజలు సహకారం అందించారు. అయితే ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఐదు జిల్లాల ‘లాక్ డౌన్’కు ప్రజలు ఏ రకంగా సహకారం అందిస్తారు, రోజువారీ కూలీల, అసంఘటిత కార్మికుల రోజువారీ జీవన పరిస్థితులు ఏ మేరకు ప్రభావితమవుతాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతుందన్నది స్పష్టం కావాల్సి ఉంది.
Tags: Telangana, Corona, Curfew, Lock Down, Public, 75 districts