పాపం.. వాళ్లు ఏడుస్తున్రు
దిశ, నల్లగొండ: గత సీజన్‌లో అధిక ధర పలికిన బత్తాయి… లాక్‌డౌన్ కారణంగా పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో బత్తాయి సాగయ్యే నల్లగొండ జిల్లాలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పంట చేతికొచ్చిన సమయంలో కళ్ల ముందే కాయలు పనికి రాకుండా పోవడం చూసి అన్నదాత కన్నీరు పెట్టుకుంటున్నారు. లాక్‌డౌన్ వల్ల బత్తాయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆశించిన మేర పంట చేతికందినా మార్కెటింగ్ సదుపాయం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. […]
దిశ, నల్లగొండ: గత సీజన్‌లో అధిక ధర పలికిన బత్తాయి… లాక్‌డౌన్ కారణంగా పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో బత్తాయి సాగయ్యే నల్లగొండ జిల్లాలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పంట చేతికొచ్చిన సమయంలో కళ్ల ముందే కాయలు పనికి రాకుండా పోవడం చూసి అన్నదాత కన్నీరు పెట్టుకుంటున్నారు. లాక్‌డౌన్ వల్ల బత్తాయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆశించిన మేర పంట చేతికందినా మార్కెటింగ్ సదుపాయం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్ సదుపాయం లేక నల్లగొండ జిల్లా బత్తాయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ సీజన్‌లో ఆశించిన మేరా పంట చేతికందుతున్నా… లాక్‌డౌన్ కారణంగా దిగుబడులను తరలించే మార్గం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో 47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు చేశారు. ఈ పంటపైనే 16,900 మంది రైతులు జీవనాధారం సాగిస్తున్నారు. నల్లగొండ బత్తాయి రైతులపై ‘దిశ’ప్రత్యేక కథనం.
రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో..
బత్తాయి పంటకు నల్లగొండ జిల్లా స్వర్గధామం. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంతగా 47 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. వానాకాలం సీజన్‌లో 2 లక్షల టన్నుల దిగుబడులు రానుండగా… కత్తెర సీజన్‌లో 40 వేల టన్నుల కాయ చేతికొస్తుంది. సాధారణ సమయాల్లో కిలో 15 నుంచి 20 రూపాయలు పలికితే… కొద్దిరోజుల క్రితం 35 నుంచి 40 రూపాయల వరకు పలికింది. గతేడాది మాదిరిగానే ధరలు ఉన్నందున రైతులకు లాభాలు దక్కాయి. అయితే లాక్‌డౌన్ వల్ల రవాణా సౌకర్యం లేకపోవడం, కొనుగోళ్లు మందగించాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఫలితం శూన్యం..
బత్తాయి మార్కెటింగ్ విషయంలో భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలో ఇటీవలే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ, దానివల్ల బత్తాయి రైతులకు పెద్దగా ఒరిగిందేమీలేదు. రైతులు సరకు తెచ్చినా గిట్టుబాటు ధర లేదంటూ కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదు. సాగుదారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అజాద్‌పురా మండీని అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో వారం పాటు నిత్యం… నల్గొండ జిల్లా నుంచి 120 టన్నుల వరకు రవాణా జరిగింది. కానీ, ఇంతలోనే అక్కడి వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చిందని మార్కెట్ మూసేశారు. దీంతో బత్తాయి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పెట్టిన పెట్టుబడి చేతికి రాని పరిస్థితి..
ఒక్కో ఎకరాలో బత్తాయిని సాగు చేయడానికి రూ. 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చు అవుతది. 5 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా బత్తాయి చెట్టును కాపాడుకుంటూ వస్తే .. 6వ సంవత్సరంలో దిగుబడి ప్రారంభమవుతది. అయితే దిగుబడి ప్రారంభమయ్యాక కూడా ఎకరాకు లక్ష రూపాయల వంతున ప్రతి ఏడాది వ్యయం చేయాల్సి వస్తోంది. అలా ఖర్చు చేసి సాగు చేసిన బత్తాయి ఒక హెక్టారు నుంచి ఏడాదికి 25 మెట్రిక్ టన్నులు దిగుబడి మాత్రమే అవుతోంది. అలాగే చెట్ల నుంచి కాయలు కోయడానికి కూలీలు, వాటిని లారీలకు ఎగుమతి చేసేందుకు హమాలీ, లారీ బాడుగులతో కలుపుకుంటే రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కాదు. రూ. 50 నుంచి 60 వేలు టన్ను ధర పలికిన సందర్భంలో కూడా ఖర్చులన్నీ పోనూ రైతులకు మిగిలేది రూ.5 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే.
ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే..
ఉమ్మడి నల్గగొండ జిల్లాలో భూగర్భ జలాల లభ్యత పెరగటం, ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉండటం వల్ల గతేడాదితో పోలిస్తే… సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరిగింది. రైతులకు లాభం కలిగించేలా సూపర్ మార్కెట్లతో ఒప్పందం చేసుకునేలా చూడాలని రాష్ట్రస్థాయి అధికారులకు నివేదిక పంపామని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వాలు స్పందించి బత్తాయి ఎగుమతులను ప్రోత్సహించాలని కర్షకులు కోరుతున్నారు. దిల్లీ, హైదరాబాద్ మార్కెట్లకు పంపాల్సి ఉన్నా… కరోనా తీవ్రత వల్ల అక్కడా కొనుగోలు చేసే వాతావరణం లేకుండా పోయింది. ఏటా స్థానికంగానే కాయల్ని కొనుగోలు చేసే ట్రేడర్లు సైతం ముఖం చాటేయడం వల్ల రైతులు అయోమయంలో పడిపోయారు.
పడిపోయిన ధరలు..
గతేడాది ఇదే సీజన్‌లో టన్ను బత్తాయిలకు తోటల దగ్గరే దళారులకు రూ.50 వేలకు విక్రయించారు. కానీ, ప్రస్తుతం రైతు మార్కెట్ బత్తాయిని తీసుకొచ్చినా రూ.15 వేల నుంచి రూ.20వేలు మాత్రమే పలుకుతోన్నది. గడిచిన వారం రోజులుగా హైదరాబాద్ కొత్తపేట మార్కెట్‌లో టన్ను బత్తాయి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు మించడం లేదని రైతులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ బత్తాయి రైతుల దిగుబడులు కొనుగోళ్లకు సహకారం అందిస్తామన్న ప్రకటన.. కేవలం కాగితాలకే పరిమితమైపోయింది. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ ఉన్నా.. మహారాష్ట్ర నుంచి కమలపండ్లు, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్ల దిగుమతులు హైదరాబాద్ కొత్తపేట మార్కెట్‌కు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా సాగైన కత్తెర బత్తాయి పంట తోటల్లోనే ఉండిపోయింది. మరో వారం రోజులకు మించి బత్తాయిలు తోటల్లో ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే కాయలు పసుపు రంగులోకి మారుతున్నాయి. కొన్ని తోటల్లో కాయలు ఇప్పటికే మురిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదుకోవాలని బత్తాయి రైతాంగం కోరుతోన్నది.
Tags: ebony, Orange fruit, farmers, well damage, purchases, lock down effect