‘ప్రకృతి పచ్చగా వుండాలి / గాలి స్వచ్ఛంగా ఉండాలి / ప్రాణులు స్వేచ్ఛగా వుండాలి / మనుషులు కనీసం మనుషులుగా వుండాలి’ అంటున్నారు డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తన ‘శతద్రు’ కవితా సంకలనంలో. అంతే కాదు.. ‘చెట్లతో స్నేహం చేస్తున్నానని / రాళ్ళతో మాట్లాడుతున్నానని / నీళ్ళతో కలిసి తిరుగుతున్నానని / గాలితో బతుకుతున్నానని / మతి చెలించిన వాణ్నని / అంటున్నారందరూ... / మనుషుల్లో వాటిని... మనుషులను వాటిలో చూడటం / నా అవివేకమంటున్నారు” అన్నారు.అట్లా గండ్ర లక్ష్మణ రావు మనిషిని, ప్రకృతిని తనలో మమేకం చేసుకుంటూ ‘శతద్రు’ రాశారు.
పండితుడూ.. ప్రతిభావంతుడూ
నిజానికి డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు అనగానే విశ్వనాథ సత్యనారాయణ గుర్తొస్తారు. ఆయన వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం మదిలో మెదులుతాయి. అంతేకాదు, జువ్వాడి గౌతమరావు గారి తర్వాత అంత గొప్పగా రామాయణ కల్పవృక్ష కావ్య గానం చేసిన గండ్ర లక్ష్మణ రావు స్వరం గుర్తొస్తుంది. పద్యాన్ని హృద్యంగా, భావయుక్తంగా, లయాత్మకంగా గానం చేయడంలో గండ్ర లక్ష్మణ రావు ప్రతిభ ఎంతగానో ప్రశంసనీయమయింది. కావ్యగానమే కాదు అంతే ప్రతిభతో ఆయన పద్యం రాయగలరు. అయితే ఆయన పద్యం దగ్గరే ఆగిపోకుండా 2003లోనే ‘ముగ్గు’ వచన కవితా సంకలనం తెచ్చారు. ఆ తర్వాత ‘వెర్రిమానవుడు’ పేర ఖలీల్ జిబ్రాన్ రచనను తెలుగులోకి అనువదించారు. ఆయన ఇటీవలి కవితా సంకలనం ‘శతద్రు’ వెలువరించారు. అందులో ఆకాశం గురించి ఇట్లా అంటాడు.. ‘శబ్దమై శ్రవణమై దృశ్యమై అదృశ్యమై / వెలుగై చీకటై స్థిరమై నిరంతర చలనమై / ఏమీ లేనట్టుండే ఆకాశం ఎన్ని చేస్తుంది .. / చూడలేని వానికి శూన్యం / చూడగలిగిన వాడికి జ్యోతిర్వలయం’ అన్నారు తాత్వికంగా. పండితుడూ ప్రతిభావంతుడూ గొప్ప ధారణా వున్నవాడు గండ్ర లక్ష్మణ రావు. ఇక భూమి గురించి కూడా స్పందించిన ఆయన ఇట్లా అంటాడు. ‘మనసంతా పరచుకుని సరిహద్దులు చెరిపేస్తే / భూమి ఇంతాకాదు అంతా నాదే / ప్రాణాలు ముడుచుకొని పోతే / దాని కడుపులో నేను’
ప్రకృతిని మనిషిని ఆవిష్కరిస్తూ..
కరీంనగర్ జిల్లాలో నిర్విరామంగా సాహితీ సంస్థల్ని సజీవంగా ఉంచుతూ గొప్ప ఉపన్యాసకుడిగా నిలబడ్డ గండ్ర లక్ష్మణ రావు ‘మౌనం గాడాంధకారం కన్నా భయంకరం / అయినా తనమీద తాను కప్పుకుని తనలో తాను కమ్ముకొని / ఏదో వెతుకుతున్నది లోలోపలి చీకటి’ అన్నారు. అంతేకాదు ‘మాట్లాడకపోవడమే మౌనం కాదు మూగవారందరిదీ మౌనవ్రతం కాదు, ‘ మౌనమూ చీకటి పోటీ పడుతున్నాయి’ అన్నారు. ఇట్లా నిరంతరం రచన, సాహిత్య అధ్యయనంతో వుండే గండ్ర లక్ష్మణ రావు తమ వూర్లో మేడిపట్టి వ్యవసాయం కూడా చేస్తారు. కవిత్వం ఎంతగా ఆయన జీవితంలో ఇమిడి పోయిందో వ్యవసాయమూ అంతకంటే ఒకింత ఎక్కువే ఆయనను పెనవేసుకుపోయింది. అందుకే ఆయన.. ‘నా రాతలు / తెల్లని కాగితం పై నల్లని సిరా చుక్కలు / జ్ఞాన బీజాలే అయినా / నీ చేతలు/ నల్లని చీకటి తెరపై ఉదయాన్ని ప్రకటించే / వేగు చుక్కలు ప్రాణ ధాతువులు’ అన్నారు. ఇట్లా శతద్రులో తాను తన చుట్టూ వున్న ప్రకృతిని మనిషిని ఆవిష్కరిస్తూ కవితలు రాశారు. వందమంది కొడుకులను కోల్పోయిన వశిష్టుడు బతకడం ఇష్టం లేక నదిలో దూకాడు. నీ అంతటి వాడిని నేను భరించలేను హరించలేను అని ఆ నది నూరుపాయలుగా చీలిపోయిందని ఆ నదిని శతద్రు అని అంటారు. ఆ ప్రతీకను తీసుకుని “పట్టని పల్లెలు, నెట్టేస్తున్న నగరాలు, బ్రతుకంతా బాటలుగా పాయలు పాయలుగా బ్రతుకే తపమై జనారణ్యంలో మనుషులు ప్రపంచమంతా ఇప్పుడొక ‘శతద్రు’ అన్నాడాయన.
ఎక్స్ ప్రశ్నల పేర..
ఈ శతద్రులో ఆయన తాను కోల్పోయిన తన దగ్గరి వాళ్ళ పైన ఎలిజీలు కూడా రాశారు. అన్యాయాన్ని ఎదిరించడం అవినీతిని ప్రశ్నించడం అక్రమాలను ఆరబెట్టడం జీవిత విధానంగా చేసుకున్న నరెడ్ల శ్రీనివాస్ గురించి. జగపతి రావు గురించీ ఎలిజీలు రాశారు. వీటన్నింటిలో తన చిన్ననాటి మిత్రుడు ‘నర్సిగాడు’ పైన రాసిన రాసిన ఎలిజీ మనసును కదిలించివేస్తుంది. గతంలో 'నీవు' పద్యకావ్యంతో ప్రయోగం చేసిన గండ్ర లక్ష్మణ రావు 'శతద్రు'లో ఎక్స్ ప్రశ్నలు పేర మరో ప్రయోగాత్మక కవితలు కూడా రాశారు. ఇట్లా సృజనతో పాటు ఆయన తన అధిక సమయాన్ని ‘సాహితీ గౌతమి’ సమతా సాహితీ’ లాంటి సంస్థల నిర్వహణకు వెచ్చించారు. ప్రతిష్టాత్మకమైన సినారె కవితా పురస్కారాన్ని దశాబ్దాల పాటు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు తన 70 ఏండ్ల వయసులో ఆయన అవధానాలు కూడా చేస్తున్నారు. తెలుగు అధ్యాపకుడిగా నాలుగు దశాబ్దాలపాటు పని చేసిన ఆయన తన కాలాన్నంతా సాహిత్యం వ్యవసాయం చుట్టూ నడిపిస్తున్నారు. కానీ ఆయన తన భవిష్యత్తు కాలాన్నంతా సృజన రంగంలోనే వెచ్చించి మరెన్నో మంచి రచనల్ని అందించాలని కోరుకుంటాను.
ప్రతులకు :
'శతద్రు' వచన పద్యాలు
పేజీలు: 145, వెల :120/
ఫోన్: 9849328036
పుస్తక పరిచయస్తులు
వారాల ఆనంద్
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత
94405 01281