సమగ్ర విజ్ఞాన సర్వస్వం
ఏదైనా ఒక విషయాన్ని గురించి పరిశోధించేటప్పుడు ఆమూలాగ్రంగా ఆ విషయాన్ని ఎలా పరిశీలించాలి, ప్రతిపాదించే అంశాలను ఎలా ప్రామాణికంగా
ఏదైనా ఒక విషయాన్ని గురించి పరిశోధించేటప్పుడు ఆమూలాగ్రంగా ఆ విషయాన్ని ఎలా పరిశీలించాలి, ప్రతిపాదించే అంశాలను ఎలా ప్రామాణికంగా నిరూపించాలి, ఆ విషయం ఎంత సమగ్రంగా, విపులంగా, సాధికారంగా వివరించాలి అనే సంగతులను తెలుసుకోవడానికి అసలు సిసలు ఉదాహరణగా నిలిచే పరిశోధనా గ్రంథం డాక్టర్ వి.వి.వేంకటరమణ గారి వావిళ్ల సాహితీ వికాసం.
గ్రంథం ముఖచిత్రంపై వావిళ్ల నుంచి వావిళ్ల దాకా అనే ఉపశీర్షికను బట్టి బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామి శాస్త్రులు (1826-1891), వారి తదనంతరం వారి కుమారులు శ్రీ వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు (1884-1956) ప్రచురణ రంగానికీ, సారస్వత రంగానికీ చేసిన సేవను తెలిపే గ్రంథమని స్థూలంగా అనిపిస్తుంది కానీ ఇది అంతకు మించిన సమగ్ర సాహితీ విజ్ఞాన సర్వస్వం. ప్రతి పుటలోనూ రచయిత కృషి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ప్రపంచ ముద్రణా చరిత్ర సమాహారం
ప్రపంచంలో ముద్రణ ఆరంభ వికాసాల చరిత్ర, కాగితం కథ, వావిళ్ల రామస్వామిశాస్త్రులుగారి చరిత్ర, వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారి చరిత్ర, పుదూరు ద్రావిడ బ్రాహ్మణుల చరిత్ర, శృంగేరీ మఠాధిపతుల చరిత్ర, భారతదేశంలో పుస్తక ముద్రణ, మద్రాసులో ముద్రణారంగ వికాసం, దానిలో పుదూరు ద్రావిడుల పాత్ర, బ్రిటిష్ కాలం నాటి ముద్రణ, దేశీయ ముద్రణాలయాల తీరుతెన్నులు, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలో బ్రౌన్ పాఠ నిర్ణయ పద్ధతి, పుస్తకాల పరిష్కరణ కోసం కవిపండితుల పోషణ, వావిళ్ల వారు నడిపిన ముద్రణాలయాల చరిత్ర, అవి ప్రచురించిన గ్రంథాల పట్టికలు, తెలుగు పత్రికల చరిత్ర (1840 నుండి 2022 వరకు), వావిళ్ల వారి త్రిలిఙ్గ ఫెడరేటెడ్ ఇండియా, బాలవినోదిని (తమిళ పిల్లల పత్రిక) పత్రికల చరిత్ర, వేంకటేశ్వరశాస్తుల షష్టిపూర్తి, శతజయంతుల ప్రత్యేక సంచికలు, వావిళ్ల 150 వసంతాల సంచికపై విపులమైన సమీక్షలు మొదలైన అనేక విషయాల సమాహారమే ఈ గ్రంథం.
ప్రచురణకు ఉద్యమరూపు కల్పించి..
వావిళ్ల రామస్వామిశాస్త్రి లేకపోతే, అమూల్యమైన మన ప్రాచీన కావ్యాలూ, పురాణేతిహాసాలూ తెలుగులిపిలోనే కాదు, దేవనాగరి లిపిలో కూడా గ్రంథాలుగా మనకు లభించేవి కావు. ఆయన ఆరంభించిన ప్రాచీన సాహితీ వికాసోద్యమాన్ని నిర్విరామంగా ముందుకు నడిపించినవారు ఆయన పుత్రులు వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి. గ్రంథం చివరి అట్టపైనున్న ఈ వాక్యాలు అక్షర సత్యాలు.
వెయ్యి గ్రంథాల ప్రచురణ కర్త
వావిళ్ళ రామస్వామి శాస్త్రి 1854లో ఆది సరస్వతీ నిలయ ముద్రణాశాలను స్థాపించక మునుపే మైసూరులో ఒక ముద్రాక్షరశాల, చెన్నపురిలో వివేక రత్నాకర ముద్రాక్షరశాల, హిందూభాషా సంజీవనీ ముద్రాక్షరశాలలను స్థాపించి 1891 వరకూ 50 గ్రంథాలను తెలుగు, సంస్కృత, తమిళ భాషలలో ప్రకటించారు. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి పగ్గాలు చేపట్టిన తరువాత ఆదిసరస్వతీ నిలయ ముద్రణాశాల పేరును కొంత కాలానికి వావిళ్ల ప్రెస్సుగా మార్చి వావిళ్ల రామస్వామి & సన్స్ పేరుతో సుమారు 1000 గ్రంథాలకు పైగా ప్రచురించారు.
పలు భాషా పుస్తకాలు.. పీఠికలు, టీకలు
వేదాంత, మత, పురాణ, ఇతిహాస గ్రంథాలతో పాటుగా పద్యకావ్యాలు, శతకాలు, వచన గ్రంథాలు, జీవిత చరిత్రలు, నవలలు, నాటకాలు, నిఘంటువులు, ఛందోలంకార తర్క న్యాయ వ్యాకరణ గ్రంథాలు, సంగీత గ్రంథాలు, రాజకీయ గ్రంథాలు వంటి పలు రకాలైన గ్రంథాలను ప్రచురించి తెలుగులోకానికి మహోపకారం చేశారు. సంస్కృతంలో అలంకారాది గ్రంథాలు, నామావళీ సహిత స్తోత్రగ్రంథాలను ప్రచురించారు. ఇవే కాక తమిళ, ఆంగ్ల గ్రంథాలనూ ప్రకటించారు. పలు గ్రంథాలకు వారే పీఠికలు, టీకలు, వ్యాఖ్యానాలను వ్రాశారు. శ్రీయుతులు అక్కిరాజు ఉమాకాన్తమ్, అల్లాడి మహదేవశాస్త్రి, ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, కల్లూరు వేంకటనారాయణరావు ఇత్యాది కవిపండితుల నెందరినో ప్రోత్సహించి వారి రచనలను వెలుగులోనికి తెచ్చారు.
వివాదాలను వదలలేదు
వావిళ్ల వారి సారస్వత సేవనే కాకుండా వారి దేశసేవను, వాణిజ్య, ముద్రాపక సంఘాలతో వారికున్న అనుబంధాన్నీ, ఆంధ్రోద్యమం,గ్రంథాలయ ఉద్యమాలలో వారి పాత్రనూ, వారి రాజకీయ చరిత్రనూ, వారి సమాజసేవను, ఉదార గుణాన్నీ, వారు పాల్గొన్న సభలు, సమావేశాల వివరాలనూ, వారికి జరిగిన సన్మానాలనూ ఈ బృహత్ గ్రంథంలో ప్రస్తావించారు గ్రంథకర్త. అంతే కాకుండా వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారిని చుట్టుముట్టిన వివాదాలనుకూడా వివరంగా, నిష్పాక్షికంగా చర్చించారు రచయిత.
పరిశోధనలో కలికితురాయి
రచయిత సేకరించిన అనేక వ్యక్తుల ఫోటోలు, విషయానికి అవసరమైన ఛాయాచిత్రాలు, వావిళ్ల వారు ప్రచురించిన పుస్తకాల ముఖపత్రాలు, వావిళ్ల సంస్థ లోగోలు, వివిధ పత్రికలలో వచ్చిన ప్రకటనలు మొదలైనవాటిని సందర్భానుసారం ఉపయోగించి ఈ గ్రంథానికి పరిపూర్ణతను చేకూర్చారు. సాహిత్యాంశాలపై పరిశోధన చేసే విద్యార్థులు ఈ గ్రంథాన్ని ఒక నమూనాగా పరిశీలించాలి. విషయసేకరణలో ఈ గ్రంథకర్తను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ పరిశోధనా గ్రంథంలో డాక్టర్ వి.వి. వేంకటరమణ అనేక కొత్త విషయాలను నిర్ధారించారు, నిరూపించారు, సూత్రీకరించారు. వారి పరిశోధనా సామర్థ్యానికి ఒక మచ్చుతునకను క్రింద చూడవచ్చు.
వావిళ్ల తప్పునే సరిచేసిన ఘనాపాటి
త్రిలిఙ్గ పత్రికను 1914 జనవరిలో ప్రారంభించారు. రజతోత్సవ ప్రత్యేక సంచిక 1941 లొ వెలువడింది. నిజానికి 1939లో 25 సంవత్సరాల పండగ జరగాలి. కానీ ఎందుకనో త్రిలిఙ్గ పత్రిక ప్రస్తావన తెచ్చినప్పుడల్లా 1914లో కాకుండా 1916లో ఆరంభమైనట్లే అందరూ వ్రాశారు. త్రిలిఙ్గ పత్రికలో సైతం 1916లోనే ప్రారంభమైనట్లు వ్రాశారు. గొప్ప గొప్ప రచయితలు పండితులు సైతం ఇదే పొరబాటును ప్రామాణికం చేశారు. ఆఖరుకు వావిళ్ల సంస్థ ప్రచురించిన రజతోత్సవ ప్రత్యేక సంచికలో, సంపుటంలో, వావిళ్ల షష్టిపూర్తి సంచికలో, శతజయంతి సంచికలో, మరుపూరు, బులుసు గార్ల వావిళ్ల పుస్తకాల్లోనూ, 150 వావిళ్ల వాఙ్మయ వైజయంతిలోనూ ఇదే పొరబాటు మనకు కనిపిస్తుంది. అని పేర్కొంటూ దానికి కారణాన్ని ఇలా నిర్ధారిస్తారు. గతంలో వావిళ్ల సంస్థ ప్రచురణల్లో ఒక్క అచ్చు పొరబాటూ ఉండేది కాదు. అలాంటిది రజతోత్సవ ప్రత్యేక సంచికలో ఈ పొరబాటు దొర్లింది. అదే అందరికీ ఆధారం అయ్యింది అంటూ “ఈ అపోహ తొలగడానికి త్రిలిఙ్గ తొలి, మలి సంచికల మొదటి పేజీలను ఈ అధ్యాయంలో పొందుపరిచారు.
ప్రతి లైబ్రరీలో ఈ పుస్తకం ఉండాలి!
వావిళ్ల సంస్థలకు పునర్వైభవం వచ్చేనా అనే శీర్షికలో గ్రంథకర్త చేసిన సూచనలు మన ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సాహిత్య సంస్థలు అవశ్యం పాటించదగినవి. సాహిత్యాభిమానులందరూ ఈ వావిళ్ల సాహితీ వికాసాన్ని చదవాలి. ప్రతి గ్రంథాలయంలోనూ అవశ్యం ఉండదగిన ఉపయోగకరమైన గ్రంథం ఇది.
పుస్తకం పేరు వావిళ్ల సాహితీ వికాసం,
రచన డాక్టర్ వి.వి. వేంకటరమణ,
పుటలు 686, వెల ₹800
ప్రచురణ వజ్ఝల సాంస్కృతిక వేదిక, హైదరాబాద్
ప్రతులకు:1. నవోదయ, కాచిగూడ,
2. పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,
3. శ్రీమతి వేంకట లక్ష్మి - 9441234429
సమీక్షకులు
కోడిహళ్ళి మురళీమోహన్
97013 71256