నేను, ఆ గదిలోకి వెళ్ళినప్పుడల్లా
ఏవేవో గొప్పగా చెప్పాలనుకుంటాను
బెంచీలపై అరవిరిసిన తెల్ల గులాబీలను
నా జ్ఞానమనే ఎరువుతో
వికసింప జేయాలనుకుంటాను.
ఒకప్పుడు రేడియోలో పాటల మధ్య ప్రకటనల్లా
అలరించే కథల మధ్య
అలవోకగా పాఠాలు చెప్పేదాన్ని
ఇప్పుడు చిట్లించే నుదుర్లు
ఎగరేసే కనుబొమలు చూస్తూ
సహనాన్ని అరువు తెచ్చుకుని
అడ్వర్ టైజ్మెంట్ల మధ్య
టీ. వీ. ధారావాహికలా సాగదీస్తూ
తిట్లు, అరుపులు, పనిష్మెంట్ల మధ్య
నేనేం చెపుతున్నానో నాకే అర్థం కాకుండా
ముళ్ల గడియారాన్ని పదే పదే చూసుకుంటూ
బతుకుజీవుడా అని
ఆ గదిలోంచి బైట పడుతున్నా!
ఆ గది ఒకప్పుడు చదువులమ్మ ఒడి!
ఇప్పుడు బతుకుబండి లాగటానికి
తప్పని ఓ ప్రత్యామ్నాయం!
అప్పుడు బోధన ఓ కళ
ఇప్పుడు ఓ కల!.
డా. చెంగల్వ రామలక్ష్మి
63027 38678