దేశ దేశాల్లో సామాజిక విప్లవాలకు చుక్కానిగా వెలసిన మధ్యతరగతి సామూహిక చైతన్యానికై ‘జమిడిక’తో దండోరా వేసి ఆధునిక కవిత్వానికి బాసటగా నిలిచిన కవి కందుకూరి అంజన్న. బతుకుబాటకు ఉద్యోగ బాటను సామాజిక నేపథ్యాన్ని కట్టెపల్క కవిత్వంతో అనుసంధానం చేస్తే పదేళ్ల ప్రయాణానంతరం వలసీకరణ, పట్టణీకరణ, అస్తిత్వ ఉద్యమాలు, నిరుద్యోగాలు, వెలివాడ వెతలు జమిడిక మోతలు అక్షరాలై చిగురించాడు. పాటల పల్లవిగా పరవశించాడు కందుకూరి అంజన్న. ఆనాడు ఎంఫిల్ ఎం.ఎ తెలుగు విద్యార్థిగా అగ్రవర్ణ ఆధిపత్యం తో నలిగిపోతున్న సెంట్రల్ యూనివర్సిటీలో మినుకు మినుకుమనే సాహిత్య వెలుతురులో పూలేను అంబేద్కర్ను వెలివాడ సాహిత్యాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. మనసును పుండు చేసుకున్నాడు. సాహిత్యానికి పురుడు పోసుకున్నాడు. ఆ సాహిత్యం కట్టె పలక నుండి ‘జమిడిక’ దండోరా వరకు కవిత్వమంతా కళ్ళు తెరిపించేదిగా, కుళ్ళు కడిగేసేదిగా ధిక్కార స్వరాన్ని వినిపించేదిగా 140 పేజీలతో అన్నవరం శ్రీనివాస్ ముఖచిత్ర పెయింటింగ్ తో అందంగా తీర్చిదిద్దిన ‘జమిడిక’ కవితా సంపుటిలో 55 కవితలు ఉన్నాయి. ఈ 55 కవితలను జమడకలో వేసుకొని ఊరంతా ఉసికయి, ఉడికి కక్కుడుపారుడు, కల్లోలం లేపితే, బుచ్చమ్మ తల్లి కన్నెర్ర చేసిందని చల్లపరచటానికి జబ్బకు ‘జమిడిక’ వేసుకుంటాడు. అని తన ముందు పేజీలోనే జమిడిక నేపథ్యాన్ని చెప్పుకొచ్చిండు కవి అంజన్న …అంజన్న కవిత్వంపై వలసీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ప్రపంచీకరణ, టెక్నాలజీ ఆధారిత సేవలు అస్తిత్వ ఉద్యమాలు దళితవాదం స్త్రీవాదం బహుజన వాదం మైనారిటీ వాదం సాహిత్య సంఘాలు వాటి ప్రభావాలు మొదలగునవి అన్ని ఆయన కవిత్వం పై మత్తడి దునుకుతాయి.
మెత్తని మనసు అనే కవితలో తిరగబడ్డ నాగళ్లను చూసి గడీలు గాబరా పడుతున్న వేళ మన చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాయి మనిషిని మార్తాండనిగా మలిచినై అంటాడు. అంతేకాకుండా తాను చేస్తున్న ఉద్యోగ నిర్వహణలో బాధ్యత గల వ్యక్తులకు ఉండే సుగుణమే కవిత్వానికి ఉన్నట్లుగా ఏ శాఖకు పోయినా ఎండిన మోడల్ పూయించి కఠిన శిలల గుండెలను కరిగించి జటిలమైన పనులు చేసి జగజ్జెట్టీవైనవు అని తానే అనుకుంటాడు. ఈ దేశంలో మనుషులు పుట్టలేదు వర్ణాలు పుట్టినాయి అంటాడు అంజన్న మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకున్నవాళ్ళం. ఏమో మేము నాలుగు అక్షరాలు నేర్చి నాలుగు మాటలు మాట్లాడితే నీ లోపల దాగున్న మనవు మేల్కొని నిషేధాలు విధిస్తాడు మా కదలికను కట్టడి చేస్తాడు అని అతను మనువాదం పై మండిపడతాడు… చూపుడు వేలు సూర్యులు అనే కవితలో మనువాదం పై జమిడికతో దరువేస్తాడు.. .. ఇక మేధావి వర్గానికి ఆలోచన ఆచరణకు సారూప్యతే లేదని మరో కవితలో ఆవేదన చెందుతాడు. విదూషకుడు విప్లవ కారుడైతాడు పుచ్చిపోయిన ఆలోచనలకు పురుడుపోసేవాడు పురుషోత్తముడైతాడు. ఊకదంపుడు ఉపన్యాసాలు దంచి ఉలిపిరి కట్టె అయినవాడు హరిజన బంధువైతాడు.. అని అంటాడు ..ఈ కవితా నిండా కఠోర సత్యాలు దాగి ఉంటాయి కళ్ళకు కట్టే నిజాలు ఒదిగి ఉంటాయి. తోటకు అగ్గిపెట్టి వసంతాన్ని వల్లకాడు చేసినవాడు తోటమాలి అయితాడు.. అని నర్మగర్భంగానే వ్యవస్థ లొసుగు ఏకరువు పెడతాడు. అంతేకాదు తన కవిత్వం నిండా పారే ఏరుకున్న స్వచ్ఛత పయనించే ఉద్యమానికి ఉన్న స్పష్టత తన కవిత్వంలో ఇంద్రావతి అనే కవితలో కనబరుస్తాడు.
ఇంద్రావతి నీవు ఉమ్మనీటిలో చందమామలకు అలల ఊయల నువ్వే కదా! నీ కడుపులో…కదులుతున్న కలువలకు కాపలా నువ్వే కదా…అంటాడు ప్రాణహిత ఇంద్రావతి శబరి గోదావరి నదుల ప్రతీకగా తీసుకొని ఉద్యమాలకు ప్రాణం పోసిన కవిత ఇది ..అంతే కాదు మావా నాటే మావా రాజ్ అనే కవితలో గోండు ప్రజలతో గొంతుక కలిపిండు రేకు డబ్బా కొట్టుకుంటూ రేల పాట పాడిండు మరట్ తుడుం వాజియే అన్నాడు.
ఏరువాకకు పోరు నేర్పిండు ఆ తెల్లని ఉదయాకాశము మీద ఎగురుతున్న ఎర్రని చంద్రవంక అయ్యిండు… ఇక తెలంగాణ పాట మట్టి వాసనలకు మూలమూలకు చేరి మురిసినయి అని పంజరంలో నినదించిన కవితలో తెలంగాణ పాట గొప్పదనాన్ని చెప్పిండు ..అదే పాట ఇప్పుడు గడీలకు ఊడిగం చేసే విధానాన్ని కూడా మరో కవితలో ఎండగట్టిండు
కష్టజీవుల కడుపునిండా కనికరించే జెండాలు పిల్ల కాలువల్లో పడి పరిగలేరుకున్టు న్నాయి అని వాపోయుండు.. ఇనుప గద్దల ఇసాన్ని ఇప్పిసెప్పిన సెంద్ర వంకలు గడీలు చూపిన మడుల్లో పడి మనసు మార్చుకున్నాయి అని ఆవేదన చెందుతాడు
ఇలా ప్రతి కవితలోనూ ప్రపంచం చుట్టూ పయనించి వస్తాడు. మనుషుల మర్మాలు చెబుతాడు. అభాగ్యుల జీవితాలను చిత్రిస్తాడు. కూలిన బతుకులను వ్యక్తీకరిస్తాడు. ఒరిగిపోయిన స్నేహితులను స్మరిస్తాడు. ఇట్లా అయితే ఎట్లా అని ప్రశ్నిస్తాడు. శాలువాల సత్కారాలను పుట్టగొడుగు లాంటి కవితల్లో ముఖ పుస్తక వెర్రిని నిరసిస్తాడు. తెలంగాణ పలుకుబల్లను పట్టుకున్న వాడు కనక చారిత్రక అవగాహన ఉన్న సమూహంలోని వ్యక్తి గనుక ఆధునిక కవిత్వానికి అగ్రభాగాన నిలిచిన కవిగా కందుకూరి అంజయ్య పేర్కొనడంలో అతిశయోక్తి లేదని నా నమ్మకం.
సమీక్షకులు..
బుర్ర తిరుపతి
99632 42525