జీవితంలో మనం మన గురించి మాట్లాడుకోవడమే కవిత్వం. అందులో ఎన్నో ఆవేదనలు, ఆవేశాలు, ఆక్రోశాలు ఉంటాయన్న ఓ నిజాన్ని రచయిత డా. గేయానంద్ మరో ప్రముఖ రచయిత జంధ్యాల రఘునాథ్ రాసిన ‘నెర్రెలు’ కవితా సంకలనానికి రాసిన ముందు మాటలో చదివి సంతోషపడి, నాకు కొన్ని భావాలను పంచుకోవాలని అనిపించింది. ఈ వాక్యం చదవడం తోటే ఆఫ్రికాలో ‘గ్రీన్ బెల్ట్ మూవ్‌మెంట్’ నడిపి 2004 లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ‘వంగారై మాత’ గుర్తుకువచ్చారు. ప్రకృతిలో తరిగిపోతున్న అడవుల పట్ల ఆవేదన పడి ఆమె నడిపిన ఈ ఉద్యమంలో భాగంగా అడవిలో నిరక్షరాసులైన వనితలను మీకు ఏమి కావాలి? అన్న ప్రశ్నకు ఇచ్చిన జవాబు ‘మాకు నీళ్లు కావాలి’ అనే జవాబుతో ప్రారంభమైనది ఉద్యమం. ఇది ఎన్నో గొప్ప మలుపులతో ఎన్నో మంచి పరిణామాలకు దారి తీసింది.
ఎన్నో భావాలను కవిత రూపంలో..
అలాగే నెర్రెలు కవితా సంకలంలో ప్రకృతిపరంగా, రాజకీయపరంగా రాయలసీమ ప్రజలు సామాజిక జీవిత సమస్యల నేపథ్యంగా సాగిన కవనంగా పలురకాలుగా ఆలోచింపచేసింది. మొట్టమొదటి కవిత ‘వేరుపడం... కానీ’ చదవడంతోనే రచయిత ఆలోచన, మనసు, నడక, నడత సుస్పష్టంగా తెలిసింది. ‘సంజాయిషీలు కాదు , సత్కార్యాలు కావాలంటున్నాం...’ అన్న వాక్యాలు నేటి నాయకులకు ఓ సూచనలా ఉంది. అలాగే ‘స్వార్థం ఆక్రమణలు చేసింది. అంతరాలు సృష్టించింది. వ్యాపారాలే చేసింది. వారసత్వాలు నిలుపుకుంది.’ ఇది చదువుతుంటే నేడు ఒక రాజకీయ నాయకుడు ఎలా పుడుతున్నాడో...ఎలా నిలబడుతున్నాడో తిరిగి అదే రాజకీయాన్ని వారసత్వంగా ఎలా కాపాడుకోగలుగుతున్నాడో...అందరికి తెలిసిన పచ్చినిజాన్ని, ప్రజల తెలివితక్కువతనాన్ని, తిరిగి ఈ కవితలో చెప్పడం మళ్ళీ గుర్తుచేసినట్లుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ పద్ధతులు, సంసృతి, అలవాట్లను కొంచెం దగ్గరగా చూసినా వారి మనసులు, బంధాలు, బాంధవ్యాలు అర్ధమవుతాయి. ఇదే విషయాన్ని ‘దొడ్డ మనసు మాది....కల్మషం లేని హృదయాలం మేము’ అని చెప్పడంలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని చూడండి అని చెప్పడం కూడా గొప్ప మనసుకు తార్కాణం. అంతే కాక ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్న జీవితాల తీరును శ్రీ శ్రీ మహాకవి మాటల పదునుతో పోల్చి సమస్య తీవ్రతతో హెచ్చరించడం కవి కలం, గళం, పథం,పాదం ఈ కవితలో అర్థం చేసుకోవచ్చును.
మరో కవిత ‘నెర్రెలు’ అనే శబ్దం వింటేనే మరోక్షణంలో ‘నెర్రెలు బారిన పొలం’ దృశంగా తడితే మనసు కన్నీరు పెడుతుంది. ఏ కలమైనా, ఏ కుంచె అయినా, ఏ గళమైనా, బాధను తన కళలో కనపరిచినా చైతన్యమే లేని రాక్షస రాజకీయమనే ఆటలో పాలకుల కుట్రలో సీమకు రాను రాను నీళ్లే కాదు కన్నీళ్లు కూడా కరువయ్యే దుస్థితిని కళ్ళకు కట్టినట్లుగా బాగా రాసారు. ఈ మధ్య కొన్ని సినిమాల్లో, నాటికల్లో కొందరు నటులు సీమ మర్యాదలు, సౌరభాలు ప్రతిబింబించేలా సన్నివేశాల చిత్రీకరణ ఎన్నో విషయాలకు అద్దం పట్టినట్టుగా రఘుబాబు కూడా తమ కవితల్లో కొన్ని వర్ణనలు, అలంకారాలు తెలియచేసి సీమ ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. ఉదాహరణకు మా ఊరెళ్లిపోతుంది బంధాలను కరువు మెడలో మాలగా.., మా బతుకు సంద్రాన కరగని కరువు జీవనది.., ఆ మోములోని ముడతలు ఒక్కో మలుపుకు సాక్ష్యంగా.., మా కాళ్ల పగుళ్లు మా జీవితాన దిగుళ్ళు.., డబ్బున్న మదాన్ని ఓ మహమ్మారి.., ఇలా ఎన్నో భావాలను మంచి మంచి కవితల రూపంలో అందించిన మంచి కవిగా సాధికారత కనిపించింది.
సీమను చైతన్య పరిచేలా!
ఏ కవితను చూసిన అందులో సమస్యను వెలుగెత్తుటలో సహజత్వాన్ని, సరళత్వాన్ని చాటడం నేటి ఆధునిక కవిత్వ లక్షణాలలో ఒకటి. రైన్ రైన్ గో అవే...అనే కవితలో అసలే రానంటున్న వర్షాన్ని పొమ్మనద్దు పాపా బాబూ...అంటూ చమత్కారంతో కూడిన ఆవేదన వెలుబుచ్చడం ఇదీ ఒక రీతిగా చెప్పుకోవచ్చును. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పుణ్యమా అని కొన్ని పదాలు ప్రతివాడి నోట ఆనబడ్డాయి.. అలాంటి ఓ పదమే క్వారంటైన్. ఈ పదాన్ని బతుకు క్వారంటైన్ అనే కవిత వాడిన సందర్భం రఘుబాబు సమకాలీన స్పృహకు ఓ మచ్చుతునక.
ఒక బిడ్డ పుట్టిన తరువాత ..ఆ బిడ్డ బాగా ఉండాలని తిథి, వార, నక్షత్రాలను చూసి చక్కటి పేరు పెట్టి మురిసిపోతారో అలాగే రఘుబాబు తన మానస పుత్రికలుగా భావించిన ప్రతి కవితకు ఒక చక్కని, ఎంచక్కని, ఎదురులేని ఒక మంచి శీర్షిక పెట్టి ఎంతగానో పడి ఉంటారు...ఇందులో మహమ్మారి, లేఖా గణితం, నెర్రెలు, ఊరెళ్లిపోతుంది, కరువు మా ఐకాన్ ఇలా కొన్నింటిని పేర్కొనవచ్చును.
ఈ సంపుటిలోనే తను రాసిన 5 పాటలతో తన కలానికున్న పాట పదును కూడా చూపారు. అందులో హైకోర్టు కర్నూల్ హక్కు అనడంలో చరిత్రను తవ్వి , నాటి త్యాగాలను చక్కని చరణంలో తెలపడం బాగుంది.
రైతుకు ప్రకృతి పడ్డ బాకీగా వాన, తోస్తుంది ఆలోచిస్తే....రైతుకు లోకానిది కూడా అంతే. చివరి పాటగా మౌనంగా ఉన్న సీమను చైతన్య పరిచేలా రాసిన గళమెత్తవే రాయలసీమ అని పిలుపునిచ్చిన ఉత్తమ కవిగా, సామాజిక బాధ్యతను మనసులో పెట్టుకొని రాసిన ఈ నెర్రెలు పుస్తకంలోని 25 కవితలు చక్కని అందమైన, చదవదగిన మంచి ఆలోచనానుభవం నుండి పుట్టినట్లుగా తోస్తున్నాయి. అందుకు ప్రతి కవి, ప్రతి పాఠకుడు చదవలసిన పుస్తకం ఇది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన అన్వేషి, డా. గేయానంద్, పట్నాయకుని వెంకటేశ్వరరావు గార్ల స్పందన, అనుభూతి, సందేశం చదివిన ప్రతి పాఠకుడిని ఓ ఆసక్తి కవితా లోకానికి తీసుకెళ్లి ఆనందింపచేస్తుందని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జంధ్యాల రఘుబాబు ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ కవితా రీతులు ఎన్నో ఆలోచనకు పునాది వేసి, ప్రతి భావ పరిమళంతో ఈ పుస్తకమంతా మనసును సుసంపన్నం చేస్తుంది.
చందలూరి నారాయణరావు
9704437247