తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలే ఒక పులకరింపు, ఒక పలవరింతలా ఉంది. తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్ళు దాటి పదో సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భం. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ భావజాల ప్రచారం ఎవరూ ఊహించని దానికంటే ఎక్కువ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ ఏదో ఒక చేదు అనుభవం ఎదురైంది. భాష, సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు, సాహిత్యం, పత్రికలు, పుస్తకాలు, సినిమాలు, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రంగాల్లో వివక్ష ఎవరు చెప్పకుండా తెల్సివచ్చింది. నిధులు, నీళ్ళు, ప్రాజెక్టులు, అభివృద్ధి అయితే అందరికీ లెక్కలు కట్ట తేల్చి చెప్పినవే. అందుకే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో సబ్బండ వర్గాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని స్వచ్ఛందంగా కల్సి వచ్చాయి. రాజకీయ పార్టీలు అవసరాన్ని బట్టి ఆఖరుకు అన్నీ చేరాయి. అందరికీ తెలంగాణ రావాలె, తెలంగాణ రావాలె, మన తెలంగాణ మనకే కావాలి, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకే కావాలనే రణనినాదం అంతటా విస్తరించింది. వీటికితోడు పాటలు కవిత్వం, కథలు విరివిగా వచ్చాయి.
ఆరవైఏళ్ళుగా విలవిలలాడి..
తెలంగాణ పాటు పెద్ద స్ఫూర్తి తెలంగాణ నేలమీద ఏ ఉద్యమానికైనా పాటనే ఆక్సిజన్, నక్సలైట్ ఉద్యమాల్లోను పాటలే అందరినీ నిలిపేవి. అంతకుముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ పాట ప్రభావం ఎక్కువ. పుంఖానుపుంఖాలుగా కవిత్వం అచ్చ తెలంగాణ భాషలో అచ్చు అయినవి. ఏ ఊర్లకు ఆ ఊర్లలోనే వేదికలు, జాయింట్ యాక్షన్ కమిటీలు, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఇందులో అన్ని పార్టీల వారు ఉంటారు. అన్ని సంఘాల వారు ఉంటారు. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్థి, యువత అన్నింట్లోనూ ఎవరు పిలుపు ఇవ్వకున్నా కమిటీలుగా ఏర్పడి ఎక్కడికక్కడ నినాదాలు ఊరేగింపులు బందులు జరిగాయి.
నడిరోడ్ల మీద వంటలు, వార్పులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆ రోజుల్లో ప్రతి ఊరి చౌరస్తా ఆ ఊరి వంటిల్లు అయ్యింది. ప్రతి రహదారి రవీంద్రభారతిలా ప్రదర్శనలు ఇచ్చింది. ఆ రోజుల్లో తెలంగాణ పాటలు పాడని వారు ఎవరూ లేరు. ఇంతగా ఒక ఉద్యమం ప్రజలందరిలోకి వెళ్ళిపోవడానికి ప్రజలే ఉద్యమించే స్థాయికి వెళ్ళింది. ప్రజల ఆశయాలను ఆశలను తెలుసుకొని ఆంధ్ర ఆధిపత్యంలోనున్న పార్టీలు కూడా అంగీకరించాయి. రెండు అసమతుల్యత గల ప్రాంతాలను బల్మీటికి కలపడం వల్ల అరవై ఏళ్ళుగా విలవిలలాడింది.
అసలు కారణం అదే!
1952 ముల్కి రూల్స్ అమలు నుంచి 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ఎన్ని పోరాటాలు చేసినా ఉషారున్న పార్టీల నాయకులు నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు చల్లార్చిండ్రు. అయినా నివురుకప్పిన నిప్పులు జయశంకర్ ఉపన్యాసల రూపంలో, కేశవరావు జాదవ్ ఆలోచనల రూపంలో రగులుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోరటానికి అసలు కారణం వివక్షనే. ఇది ఒక్క రంగమని కాదు, అన్ని రంగాల్లో అన్ని శాఖలో అన్ని రాజకీయ సామాజిక సంస్థల్లో కొనసాగింది. అందుకే సకలజనుల ఆరాటం కూడా అన్ని రోగాలకు జిందాతిలస్మాత్ లెక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే అనుకున్నారు.
అనుకున్న రాష్ట్రం పన్నెండు వందల మంది అమరవీరుల రక్తతర్పణంతో వచ్చింది. మరి అనుకున్నంత అభివృద్ధి జరిగిందా? నిధులు, నీళ్ళు, నియామకాలు అయినయి. భాష, సంస్కృతిలో తేడా వచ్చిందా అంటే కొన్ని రంగాలు పచ్చగైనయి, మరికొన్ని రంగాలు ఎండిపోయినయి. వ్యవసాయ రంగం విజయం సాధించింది. ప్రాజెక్ట్‌లు వచ్చినయి, నదుల్లో నీళ్ళు ప్రవహిస్తున్నయి, చెరువులు నవ్వుతున్నయి, విద్యుత్ నిరంతరం వస్తోంది. రైతులకు పెట్టుబడి అందుతోంది. రైతుల పేరుతో భూయజమానులకూ అందుతోంది. వృద్ధులకు పెన్షన్‌లు వస్తున్నయి. కానీ ఇంకా నిరుద్యోగులలో, ఉన్నత విద్యలో పూర్తిగా ఉమ్మడి రాష్ట్రమే నయమన్నట్టు తయారైంది. విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌లు నిండలేదు. తెలంగాణ భాష అధికార భాషగా అమలు కాలేదు. ఇవన్నీ ప్రజలు కోరుకున్న, మార్పు వస్తదనుకున్న ఫలాలు... కానీ అమలు కాలేదు. అధికార పీఠం ప్రజల విన్నపాలు వినేటట్టు ఉండాలి. ప్రతిపక్షాలకు, సంఘాలకు ఇదివరకున్న ప్రజాస్వామిక దృక్పథం, స్వేచ్ఛ కొనసాగాలి. పోరాటం ద్వారానే సాధించుకున్న తెలంగాణలో ఎవరు పీఠంపైన ఉన్నా సమస్యలు ఉండే ఉంటాయి. పోరాడే వాళ్ళను పోరాటం చెయ్యనియ్యాలి. ఆ గొంతులను వినాల్సిన అవసరం ఉన్నది. ఏదీ ఏమైనా ఈ నేల మీద విజయవంతంగా సాగిన గొప్ప శాంతియుత ప్రజా ఉద్యమం తెలంగాణ. జయహో తెలంగాణ.
అన్నవరం దేవేందర్
94407 63479