చిన్నపిల్లలకు ఈ నూనెతో మసాజ్ చేస్తున్నారా.. వారి చర్మం దెబ్బతినట్టే..
భారతదేశంలో అనాదిగా వస్తున్న కొన్ని సంప్రదాయాలను పెద్దలు పాటిస్తూ ఉంటారు.
దిశ, ఫీచర్స్ : భారతదేశంలో అనాదిగా వస్తున్న కొన్ని సంప్రదాయాలను పెద్దలు పాటిస్తూ ఉంటారు. అందులో ఒక సంప్రదాయమే చిన్నపిల్లలకు మసాజ్ చేయడం. చిన్నపిల్లలకు చేసే మసాజ్ వారిని ఆరోగ్యంగా, దృఢంగా చేసేందుకు ఉపయోగపడతాయి. అంతే కాదు చిన్నపిల్లల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కానీ ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి సరైన నూనెను ఉపయోగించాలి. అలాగే సరైన మార్గంలో మసాజ్ చేయాలి. మరి ఆ నూనెలు ఏంటి, ఎలా మసాజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) నవజాత శిశువులు, పిల్లల మంచి చర్మ సంరక్షణ కోసం ప్రామాణిక మార్గదర్శకాలను ముందుకు తెచ్చింది. IAP ప్రకారం శిశువుకు నూనెతో మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. నూనె లేకుండా మసాజ్ అస్సలే చేయకూడదట. అయితే బిడ్డకు మసాజ్ చేయడానికి ఆలివ్ ఆయిల్ లేదా ఆవాల నూనెను అస్సలు ఉపయోగించకూడదట. అది శిశువు చర్మాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. అందుకే శిశువుల కోసం తయారు చేసిన ప్రత్యేకమైన నూనెను ఉపయోగించాలి. బేబీ ఆయిల్ లలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీని ద్వారా శిశువు చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది.
మసాజ్ చేసేటప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోవాలి..
మసాజ్ ప్రారంభించే ముందు శిశువు ప్రశాంతంగా ఉందని నిర్ధారించుకోవాలి.
వేసవిలో స్నానం చేసే ముందు, చలికాలంలో స్నానం చేసిన తర్వాత ఆయిల్ మసాజ్ చేయాలి.
శిశువు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత ఆయిల్ మసాజ్ చేయాలి.
నెమ్మదిగా, సున్నితంగా మసాజ్ చేయడం వల్ల శిశువు సురక్షితంగా ఉంటుంది.
ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. లైట్ ప్రెజర్, లైట్ స్ట్రోక్స్ ఉపయోగించండి.
బేబీ మసాజ్ కోసం, పారాబెన్లు, డైలు, థాలేట్స్ వంటి హానికరమైన రసాయనాలు లేని ఉత్పత్తులను ఉపయోగించండి.
శిశువు చర్మం ఎర్రగా మారినట్లయినా, మంటగా ఉన్నా నూనె రాయవద్దు.